Rishi Sunak on Dravid:టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కోచ్ గా భారత క్రికెట్ లో తనదైన ముద్ర ఇప్పటికీ వేయకపోయినా ఆటగాడిగా మాత్రం ఎప్పటికీ అతడు దిగ్గజమే. తాను క్రికెట్ ఆడేప్పుడు ప్రపంచ మేటి బౌలర్లకు సైతం కొరకరాని కొయ్యగా మారిన ద్రావిడ్.. గంటల తరబడి క్రీజులో బ్యాటింగ్ చేసేవాడు. దీంతో అతడిని క్రికెట్ అభిమానులంతా ‘ది వాల్’అని పిలుచుకునేవారు. సాధారణ అభిమానులే కాదు సాక్షాత్తూ యూనైటైడ్ కింగ్డమ్ (యూకే) ప్రధాని రిషి సునక్ కూడా ద్రావిడ్ అభిమానేనట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.
ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆట జరుగుతున్నప్పుడే రిషి సునక్ కూడా లార్డ్స్ కు వచ్చారు. బీబీసీ టెస్ట్ మ్యాచ్ స్పెషల్ (టీఎంఎస్) ప్రత్యేక ఆహ్వానం మేరకు సునక్.. కామెంట్రీ బాక్స్ లో ప్రత్యక్షమయ్యారు. స్వతహాగా క్రికెట్ అభిమాని అయిన సునక్.. కొద్దిసేపు మ్యాచ్ ను గురించి విశ్లేషణలు చేయడమే గాక తనకు ఆటతో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు.
టీఎంఎస్ లంచ్ టైమ్ షో లో భాగంగా సునక్ స్పందిస్తూ... ‘రాహుల్ ద్రావిడ్ నా ఫేవరేట్ క్రికెటర్. నిజంగా అతడి టెక్నిక్, అటిట్యూడ్, పర్సనాలిటీ అంటే నాకు చాలా ఇష్టం..’ అంటూ కామెంట్ చేశారు. ఇంకా తాను భారత్ - ఇంగ్లాండ్ ల మధ్య 2008లో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ ను చూశానని, ఆ మ్యాచ్ లో సచిన్ వీరోచిత పోరాటంతో ఇంగ్లాండ్ ఓడిపోయినా గొప్ప మ్యాచ్ ను చూశానని చెప్పారు.
‘2008లో నేను ఇండియాలోనే ఉన్నా. అప్పుడు ఇంగ్లాండ్ భారత్ పర్యటనలో ఉంది. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు అర్థాంతరంగా భారత్ ను వీడింది. కానీ కొద్దిరోజులకు తిరిగి సిరీస్ మొదలైంది. అప్పుడు నేను నా ఫ్రెండ్ పెళ్లి కోసం ఇండియాకు వెళ్లా. చెన్నైలో ఇంగ్లాండ్ - ఇండియాల మధ్య మ్యాచ్ జరుగుతుంటే దానిని చూశా. ఆ మ్యాచ్ లో సచిన్ వీరోచిత పోరాటంతో భారత్ మ్యాచ్ ను గెలుచుకుంది. ఇంగ్లాండ్ ఓడింది. సచిన్ బ్యాటింగ్ ను దగ్గర్నుంచి చూడటం చెప్పలేని అనుభూతినిచ్చింది..’ అని వ్యాఖ్యానించారు.
భారత్ లో క్రికెట్ ను మతంగా కొలుస్తున్న నేపథ్యంలో ఇక్కడి అభిమానుల మాదిరిగానే సునక్ కూడా క్రికెట్ ను ఆరాధిస్తారా..? అన్న ప్రశ్నకు యూకే ప్రధాని స్పందిస్తూ.. ‘నేను ఈ జాబ్ (పీఎం) చేస్తున్నప్పుడు అంత ఓవర్ ఎగ్జైట్ అవ్వలేను. కానీ ఈ పదవి రాక ముందు మాత్రం చేసేవాడిని. క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. క్రికెట్ ఒక్కటే కాదు. నేను అన్ని స్పోర్ట్స్ చూసేవాడిని. ఇదే లార్డ్స్ లో ఇంగ్లాండ్ ఆడే మ్యాచ్ లను రెగ్యులర్ గా వచ్చి చూసేవాడిని. అందరితో పాటే నేనూ నినాదాలు చేసి తర్వాత కామ్ గా కూర్చునేవాడిని...’అని తెలిపారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial