World Cup 2023: ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుబోయే వన్డే వరల్డ్ కప్ లో దాయాది పాకిస్తాన్ పాల్గొంటుందా..? లేదా..? అన్నది ఇంకా అనుమానంగానే ఉంది. నిన్నామొన్నటిదాకా వేదికల మార్పు కోరిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. ఇప్పుడు భద్రతా కారణాలను సాకుగా చూపుతోంది. తాజా సమాచారం మేరకు పాకిస్తాన్.. భారత్ లో ఆడబోయే మ్యాచ్ లలో ముందుగా తమ సెక్యూరిటీ టీమ్స్ ను పంపి వారి నుంచి అందే రిపోర్డు ఆధారంగానే తుది నిర్ణయం తీసుకోనుందని తెలుస్తున్నది.
అక్టోబర్ - నవంబర్ లలో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తమ మ్యాచ్ లను చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతాతో పాటు అహ్మదాబాద్ వేదికగా ఆడనుంది. అయితే బాబర్ ఆజమ్ సేన ఈ వేదికలలో మ్యాచ్ లు ఆడటానికంటే ముందే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సెక్యూరిటీ టీమ్స్ ను ఈ వెన్యూస్ కు పంపించనుంది. భద్రతా బృందం ఇక్కడి ఏర్పాట్లను పరిశీలించి ఆ రిపోర్టును పీసీబీతో పాటు బీసీసీఐ, ఐసీసీలకు కూడా అందించనుంది.
ఇదే విషయమై పీసీబీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘పీసీబీ పంపే సెక్యూరిటీ టీమ్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆడబోయే మ్యాచ్ వేదికలను పరిశీలించనుంది. భద్రతా బృందం ఇక్కడి భద్రతా ఏర్పట్లను, ఇతర సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఈ టీమ్ రిపోర్టును పీసీబీకి అందించనుంది. ఈ నివేదికను పీసీబీ.. బీసీసీఐ, ఐసీసీలకు పంపించనుంది..‘ అని తెలిపాడు. సెక్యూరిటీ టీమ్స్ ఇతర దేశాలలో వేదికలను పరిశీలించడం ఇదేం కొత్త కాదని.. క్రికెట్ తో పాటు ఇతర క్రీడలు జరిగినప్పుడు కూడా ఆయా దేశాలు తమ ప్రతినిధులను మ్యాచ్ లు జరుగబోయే వేదికలకు పంపుతాయని పీసీబీ ప్రతినిధి వెల్లడించాడు. అయితే సెక్యూరిటీ టీమ్ ఇండియాకు వచ్చేది పీసీబీకి కొత్త ఛైర్మన్ వచ్చిన తర్వాతే అని తెలుస్తున్నది.
ప్రభుత్వానికి లేఖ..
భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడాలా..? వద్దా..? అన్నదానిపై త్వరగా తేల్చాలని పీసీబీ.. ఆ దేశ ప్రభుత్వాన్ని కోరింది. రాజకీయ, సరిహద్దు వివాదాలతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఒక దేశపు జట్టు మరో దేశానికి వెళ్లాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అయింది. వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో పీసీబీ.. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు లేఖ రాసింది. ‘వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనడంపై పీసీబీ ప్రభుత్వ అనుమతి కోసం ప్రధానికి లేఖ రాసింది. ఇక ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం మేం నడుచుకుంటాం..’అని పీసీబీ తెలిపింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial