Ashes 2023, ENG vs AUS: కొద్దిరోజుల క్రితమే ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య ఎడ్జబాస్టన్  వేదికగా ముగిసిన  తొలి టెస్టులో ఆఖరి ఓవర్ దాకా ఫలితం ఇరు జట్ల మధ్య దోబూచూలాడిన విషయం తెలిసిందే. ఆఖర్లో ఆసీస్ సారథి పాట్ కమిన్స్ రాణించడంతో  కంగారూలు  చిరస్మరణీయ విజయాన్ని  అందుకున్నారు. తాజాగా లార్డ్స్ లో కూడా అలాంటి ఫలితమే రిపీట్ అయ్యేలా ఉంది.  ఈ రెండు జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా నిర్దేశించిన 371 పరుగుల  లక్ష్య  ఛేదనలో  ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి   నాలుగు కీలక వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది.  ఆఖరి రోజు ఇంగ్లాండ్ గెలవాలంటే 257 పరుగులు అవసరం ఉండగా ఆసీస్ కు ఆరు వికెట్లు కావాలి. 


ఆసీస్ టపటప.. 


మూడో రోజు ఓవర్ నైట్  స్కోరు  130-2 తో  నాలుగో రోజు ఆరంభించిన ఆసీస్..  187 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.  నిలకడగా ఆడుతున్న ఉస్మాన్ ఖవాజా (187 బంతుల్లో 77, 12 ఫోర్లు)ను బ్రాడ్  62వ ఓవర్లో ఔట్ చేశాడు.  మరుసటి ఓవర్లో ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో  స్టీవ్ స్మిత్ (62 బంతుల్లో  34, 5 ఫోర్లు)ను టంగ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కూడా  ఆసీస్ బ్యాటర్లలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.  కామెరూన్ గ్రీన్ (18), ట్రావిస్ హెడ్ (7), అలెక్స్ కేరీ (21), పాట్ కమిన్స్ (11) కూడా విఫలమయ్యారు. 


ఇంగ్లాండ్ కు షాకులు.. 


372 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కు మిచెల్ స్టార్క్, కమిన్స్ లు స్టార్టింగ్ స్ట్రోక్ ఇచ్చారు.   జాక్ క్రాలే (3)ను స్టార్క్ ఔట్ చేయగా   ఓలీ పోప్ (13)ను కూడా అతడే క్లీన్ బౌల్డ్ చేశాడు.  ఇక ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (18) ను పామ్ కమిన్స్ పెవిలియన్ కు పంపాడు.  ఇంగ్లాండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ (4) ను కూడా కమిన్స్  బౌల్డ్ చేసి ఆ జట్టుకు  షాకిచ్చాడు.  45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను ఓపెనర్ బెన్ డకెట్ (67 బంతుల్లో 50 నాటౌట్, 6 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ (66 బంతుల్లో 29, 1 ఫోర్, 1 సిక్స్) లు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో రోజు మరో వికెట్  పడకుండా జాగ్రత్త పడ్డారు. డకెట్ - స్టోక్స్ లు నాలుగో వికెట్ కు 69 పరుగులు జోడించారు.


 






గతేడాది సూపర్ ఛేజ్.. 


ఆఖరి రోజు ఇంగ్లాండ్ గెలవాలంటే 257 పరుగులు చేయాలి.  ఆసీస్ విజయానికి 6 వికెట్ల దూరంలో ఉంది. గతేడాది ఇండియాతో  ఎడ్జబాస్టన్ లో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో  కూడా ఇంగ్లాండ్ ముందు 378 పరుగుల లక్ష్యం ఉండగా  బెయిర్ స్టో సూపర్  సెంచరీతో ఇంగ్లీష్ జట్టు సూపర్ డూపర్ విక్టరీ కొట్టింది. ఇప్పుడు కూడా  ఇంగ్లాండ్ ముందు ఇంతే లక్ష్యముంది.  చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. డకెట్, స్టోక్స్ తో పాటు  బెయిర్ స్టో ప్రధాన బ్యాటర్లు కాగా  స్టువర్ట్ బ్రాడ్ కూడా బ్యాటింగ్ చేయగలడు.   ఆసీస్ బౌలర్లు విజృంబిస్తే ఇంగ్లాండ్ కు లార్డ్స్ లో తిప్పలు తప్పవు.  అలా కాక బాల్ - బ్యాట్ మధ్య సమరం కంటిన్యూ అయితే మాత్రం  ఈ టెస్టులో కూడా రసవత్తర ముగింపు తప్పకపోవచ్చు. 


సంక్షిప్త స్కోరు వివరాలు: 


ఆస్ట్రేలియా ఫస్ట్  ఇన్నింగ్స్ : 416 ఆలౌట్ 
ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ : 325 ఆలౌట్ 
ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ : 279 ఆలౌట్ 
ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ :  31 ఓవర్లకు  114-4 (ఆట ముగిసే సమయానికి)