West Indies: క్రికెట్ లో బజ్ బాల్ లు, అటాకింగ్ గేమ్స్ వంటివి ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నా ఒకప్పుడు వీటికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచిన జట్టు ఇప్పుడు దారుణ పతనానికి చేరింది. రెండు సార్లు వరుసగా వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టు.. వరుసగా మూడు ఫైనల్స్ ఆడిన జట్టు.. ఇప్పుడు అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో కనీసం క్వాలిఫై కూడా కాలేదు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ ను ఏలిన ఆ జట్టు ఇప్పుడు దారుణ పతనానికి కారణమేంటి..? లీగ్ క్రికెట్టే కరేబియన్ టీమ్ ను ముంచిందా..?
దిగ్గజాలు ఏలిన వేళ..
1920వ దశకంలోనే క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన విండీస్.. వన్డేలలో నిర్వహించిన తొలి మూడు వన్డే వరల్డ్ కప్ లలో తిరుగులేని జట్టుగా నిలిచింది. వన్డే ప్రపంచకప్ 1983లో భారత్ ఫైనల్లో ఓడించేదాకా విండీస్ ప్రభంజనానికి ఆకాశమే హద్దు. క్లైవ్ లాయిడ్, గ్యారీ సోబర్స్, వివ్ రిచర్డ్స్, ఆండీ రాబర్ట్స్, జోర్డాన్ గ్రీనిడ్జ్, మైఖేల్ హోల్డింగ్, డెస్మాండ్ హేన్స్, మాల్కమ్ మార్షల్ వంటి దిగ్గజాలు ఆ జట్టు సొంతం. 1970-90 నాటికి విండీస్.. ప్రపంచపటంలో క్రికెట్ ఆడే ఏ దేశానికి వెళ్లినా ఆ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ ప్రభంజనాలకు ప్రత్యర్థులు వణికిపోయేవారు. 1975, 79లలో వన్డే వరల్డ్ కప్ గెలిచిన విండీస్, 83లో భారత్ చేతిలో ఓడింది. ఒకరకంగా విండీస్ పతనానికి ఇక్కడే బీజం పడింది.
వాళ్లూ ఫర్లేదు..
రిచర్డ్స్, లాయిడ్, రాబర్ట్స్ వంటి దిగ్గజాలు నిష్క్రమించినా బ్రియాన్ లారా, కార్ల్ హూపర్, ఇయాన్ బిషప్, కోట్నీ వాల్ష్, శివనారాయణ్ చందర్పాల్, రామ్ నరేశ్ శర్వాన్ వంటి గత తరపు ఆటగాళ్లు కూడా తొలి తరపు ఆటగాళ్లంతా ప్రభావం చూపలేకపోయినా ఫర్వాలేదనిపించారు. జట్టు పతనదిశకు చేరినా వ్యక్తిగతంగా వీళ్లు ఆ టీమ్ పరువును ఎంతో కొంత కాపాడారు.
టీ20 మోజులో పడి..
టెస్టు క్రికెట్ పై ఆసక్తి తగ్గి.. వన్డేలు కూడా బోర్ కొట్టి ప్రపంచ క్రికెట్ అభిమానులు టీ20 ఫార్మాట్ కు ఆసక్తి చూపుతున్న వేళ.. విండీస్ క్రికెట్ కొన్నాళ్లు స్వర్ణయుగమే చూసింది. అచ్చంగా ఇదే ఫార్మాట్ ను అణువణువునా జీర్ణించుకున్న విండీస్.. 2012, 2016లో ఛాంపియన్ గా నిలిచింది. కానీ ఇదే విండీస్ పాలిట శాపంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందుతున్న టీ20 లీగ్ లు విండీస్ ఆటగాళ్లపై కన్నేశాయి. క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, లెండి సిమన్స్, డ్వేన్ బ్రావో, డారెన్ సామి, సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్, జేసన్ హోల్డర్, షిమ్రాన్ హెట్మెయర్, కైల్ మేయర్స్ వంటి ఆటగాళ్లు వీటిల్లో భాగమయ్యారు. ఐపీఎల్, విండీస్ లోనే జరిగే కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), బంగ్లాదేవ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్), పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), బిగ్ బాష్, హండ్రెడ్ లీగ్.. ఇలా ఎక్కడ చూసినా వాళ్లే. ఇదే విండీస్ ను నిట్ట నిలువునా ముంచింది. ఫ్రాంచైజీల మోజులో పడ్డ విండీస్ వీరులు.. వన్డే, టెస్టు ఆటను మరిచిపోయారు. విండీస్ క్రికెట్ బోర్డు కూడా ఆటగాళ్లతో నిత్యం పేచీలు పెట్టుకోవడం, నాణ్యమైన క్రికెటర్లను పక్కనబెట్టడం, వారు జాతీయ జట్టుకు కాకుండా లీగ్ లలో ఆడుతున్నా వారి పట్ల చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటం కూడా ఆ జట్టుకు శాపమైంది.
పతనం మొదలైంది మనతోనే..
అంతకుముందు రెండు వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆ జట్టు వన్డేలలో పతనం మొదలైంది మన (ఇండియా) తోనే కావడం గమనార్హం. 1983లో లార్డ్స్ లో ఇండియా.. వెస్టిండీస్ ను ఓడించిన తర్వాత మళ్లీ ఆ జట్టు ఫైనల్ చేరలేదు. 1987లో భారత్ లో నిర్వహించిన ప్రపంచకప్ లో రౌండ్ 1కే పరిమితమైన విండీస్ .. ఆ తర్వాత 1996లో మాత్రమే సెమీఫైనల్స్ కు చేరింది. అప్పట్నుంచి విండీస్ టీమ్ కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2011, 2015లలో క్వార్టర్స్ చేరిన ఆ జట్టు.. 2019లో కూడా గ్రూప్ స్టేజ్ లోనే నిష్క్రమించింది. ఇక ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ లో క్వాలిఫై కూడా కాలేదు.
అదే ఆఖరు..
2016 టీ20 ప్రపంచకప్ గెలవడమే ప్రపంచ క్రికెట్ లో విండీస్ కు చివరి ‘ది బెస్ట్’ అయింది. ఆ తర్వాత 2017 ఛాంపియన్స్ ట్రోఫీకి విండీస్ క్వాలిఫై కాలేదు. గతేడాది ఆసీస్ లో జరిగిన టీ20 ప్రపంచకప్ కు కూడా కరేబియన్ జట్టు అర్హత సాధించలేదు. తాజాగా స్కాట్లాండ్ చేతిలో ఓడటంతో వన్డే వరల్డ్ కప్ - 2023కి కూడా విండీస్ అర్హత కోల్పోయింది.