Asian Games 2023: ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ లో చైనాలోని హాంగ్జో వేదికగా జరుగబోయే ఆసియా క్రీడల్లో ఈసారి క్రికెట్ ను కూడా ఆడించనున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా భారత జట్టును పంపించేందుకు సన్నహకాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా నియమించి ద్వితీయ శ్రేణి జట్టుతో ఆసియా క్రీడలలో భారత్ ఆడనుందన్న వార్తలు ప్రస్తుతం క్రికెట్ వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా దీనిపై టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధావన్ కంటే ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను సారథిగా నియమిస్తే బెటర్ అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
అశ్విన్ అయితే బెటర్..
కార్తీక్ మాట్లాడుతూ.. ‘అశ్విన్ మెరుగైన ఆటగాడు. అందులో అనుమానమే లేదు. క్వాలిటీ బౌలింగ్ తో పాటు తీసిన వికెట్లు, గణాంకాలను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ కోసం ప్రధాన ఆటగాళ్లంతా ఆ సన్నాహకాల్లో ఉండగా ఆసియా క్రీడలకు భారత జట్టు ‘బీ టీమ్’ను పంపిస్తే అప్పుడు అశ్విన్ ను కెప్టెన్ గా చేయండి. అది కూడా అతడు భారత జట్టు వన్డే వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో భాగం కాకుంటేనే.. అశ్విన్ భారత జట్టు సారథ్య పదవికి అర్హుడు. ఆసియా క్రీడల్లో అతడిని కెప్టెన్ చేస్తే నేను చాలా సంతోషిస్తా. ఒకవేళ ఇక్కడ పతకం గెలిస్తే అది అతడి కెరీర్ లో ఓ ఘనతగా మిగిలిపోతుంది..’ అని కామెంట్స్ చేశాడు.
ఈ నెల 7న నిర్ణయం..
ఆసియా క్రీడల్లో టీమిండియాను పంపించే విషయమై జులై రెండో వారంలో స్పష్టత రానుంది. జులై 7న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరుగనుండగా ఈ సమావేశంలోనే ఆసియా క్రీడల్లో భారత్ ఆడుతుందా..? లేదా..? ఆడితే ఎవరు సారథిగా ఉంటారు..? అన్న విషయంలో క్లారిటీ వస్తుంది. క్రికెట్ ప్రేమికులు, మాజీ క్రికెటర్లు మాత్రం ఈ క్రీడల్లో భారత్ పాల్గొనాలని.. తద్వారా అవకాశాల కోసం చూస్తున్న చాలా మంది క్రికెటర్లకు ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుందని భావిస్తున్నారు.
వాస్తవానికి ఏసియన్ గేమ్స్ గతేడాది జరగాల్సింది. కానీ చైనాలో కరోనా తీవ్రరూపం దాల్చడంతో మేలో జరగాల్సిన గేమ్స్ కాస్తా ఈ ఏడాదికి వాయిదాపడ్డాయి. ఈ ఏడాది ఆసియా క్రీడలకు కూడా వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఆటంకంగా మారింది. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ మొదలుకానుంది. దీంతో గతంలో ఏసియన్ గేమ్స్ కు భారత పురుషుల జట్టును పంపడం కుదరదని బీసీసీఐ తెలిపింది. కానీ ద్వితీయ శ్రేణి జట్టుతో ఇందులో పాల్గొనాలని బీసీసీఐ భావిస్తున్నది. ఆసియా క్రీడల్లో 2014లోనే క్రికెట్ కు చోటు దక్కినా అప్పుడు బీసీసీఐ టీమ్ ను పంపలేదు. ఆ తర్వాత 9 ఏండ్లకు మళ్లీ ఆసియా క్రీడల్లో క్రికెట్ ను ఆడిస్తున్నారు.