Mitchell Starc Catch: ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య  లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు ఇదివరకే రసవత్తరంగా సాగుతున్న వేళ మరో వివాదం ఈ టెస్టును వార్తల్లో నిలిపింది.  రెండో టెస్టు నాలుగో రోజు ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ పట్టిన ఓ క్యాచ్ వివాదాస్పదమైంది.  ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఇచ్చిన  క్యాచ్ ను స్టార్క్ అద్భుతంగా అందుకున్నా థర్డ్ అంపైర్ దానిని నాటౌట్ గా ప్రకటించాడం వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో ట్విటర్ లో #Notout హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నిలిచింది. 


అసలేం జరిగిందంటే.. 


ఆట నాలుగో రోజులో భాగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డకెట్.. కామెరూన్ గ్రీన్ వేసిన  ఓ ఓవర్లో వేసిన బౌన్సర్ ను షాట్ ఆడబోయాడు. కానీ అది కాస్తా బ్యాట్ ఎడ్జ్ కు తాకి  ఫైన్ లెగ్ దిశగా  వెళ్లింది. మిచెల్ స్టార్క్  పరుగెత్తుతూ వచ్చి ముందుకు డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఆసీస్ ఆటగాళ్ల సంబురం.  దీంతో బెన్ డకెట్ నిరాశగా పెవిలియన్ దిశగా వెళ్తుండగా  ఫీల్డ్ అంపైర్లు అతడిని కాసేపు ఆగాలని సూచించారు. టీవీ అంపైర్ రిప్లే చూసి దానిని నాటౌట్ అని ప్రకటించాడు. 


వాస్తవానికి  స్టార్క్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు.  బంతిని అందుకున్న తర్వాత కూడా కొన్ని క్షణాలు బాల్ అతడి చేతిలో ఉంది. కానీ అప్పటికే డైవ్ చేసిన  స్టార్క్.. బాడీ మీద నియంత్రణ కోల్పోయి  ఎడమ చేతిలో ఉన్న బంతితో పాటు  నేల మీదకు వాలిపోయాడు. అదే క్రమంలో బాల్.. నేలను తాకినట్టు స్పష్టంగా తేలింది.  దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించడంతో బెన్ డకెట్ తిరిగి  బ్యాటింగ్ కు వచ్చాడు.  


 






మెక్ గ్రాత్, పాంటింగ్ ల అసహనం.. 


థర్డ్ అంపైర్  స్టార్క్ పట్టిన క్యాచ్ ను నాటౌట్ అని ప్రకటించడంతో  కామెంట్రీ బాక్స్ లో ఉన్న గ్లెన్ మెక్ గ్రాత్, రికీ పాంటింగ్ లు ఘాటుగా స్పందించారు.  మెక్ గ్రాత్ కామెంట్రీ చెబుతూనే..  ‘ఐయామ్ సారీ..  నేను చూసిన   అత్యంత చెత్త విషయం ఇదే.  స్టార్క్ బాల్ పట్టినప్పుడు పూర్తి నియంత్రణలోనే ఉన్నాడు. ఇది కూడా నాటౌట్ అని ప్రకటిస్తే ఇక  ఇలా పట్టే క్యాచ్ లు అన్నింటినీ నాటౌట్ గానే ప్రకటించాలి. ఇది చాలా అవమానకర చర్య..’అని అన్నాడు.


పాంటింగ్ స్పందిస్తూ.. ‘మిచెల్ స్టార్క్ బంతిని అందుకున్నప్పుడు పూర్తి నియంత్రణలోనే ఉన్నాడు. ఇదే మ్యాచ్ లో  జో రూట్ క్యాచ్ ను  అందుకున్నప్పుడు  స్టీవ్ స్మిత్ కంటే   స్టార్క్ ఎక్కువసేపు బంతిని తన నియంత్రణలో ఉంచుకున్నాడు..’అని చెప్పాడు.


 






నిబంధనలు ఏం చెబుతున్నాయి..? 


క్రికెట్ చట్టాలు చేసే మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధనల ప్రకారం.. ఒక బంతిని  ఫీల్డర్ క్యాచ్ అందుకున్న తర్వాత అది అతడి పూర్తి నియంత్రణలో ఉండాలి. ఒకవేళ అలా కాకుండా ఫీల్డర్  క్యాచ్ ను అందుకున్న క్రమంలో ఏదైనా  తేడాలున్నట్టు అంపైర్లు భావించి రుజువులను పరిశీలించి  వాళ్ల అనుమానమే నిజమైతే మాత్రం   దానిని నాటౌట్ గానే ప్రకటించొచ్చు.  
Join Us on Telegram: https://t.me/abpdesamofficial