Pan Masala Ad:
రోల్ మోడల్ స్థాయికి ఎదిగిన క్రికెటర్లు బాధ్యతగా ఉండాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అంటున్నాడు. పాన్ మసాలా యాడ్‌లో నటించిన వీరేంద్ర సెహ్వాగ్, సునిల్ గావస్కర్‌ను ఘాటుగా విమర్శించాడు. డబ్బుల కోసం అలాంటి స్థాయికి దిగజారొద్దని సూచించాడు. కోట్లాది మంది యువత మిమ్మల్ని గమనిస్తారని తెలియదా అని ప్రశ్నించాడు. న్యూస్18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో చాలామంది క్రికెటర్లు ప్రకటనల్లో నటిస్తుంటారు. లైమ్‌లైట్‌లో ఉండే మాజీ ఆటగాళ్లనూ నటించాల్సిందిగా యాడ్ ఏజెన్సీలు కోరుతుంటాయి. ఇందులో భాగంగానే రీసెంట్‌గా మాజీ బ్లాస్టింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఒకప్పటి దిగ్గజం సునిల్ గావస్కర్ పాన్ మసాలా యాడ్‌లో నటించారు. వారిద్దరూ ఇలా చేయడం దారుణమని, చాలా నిరాశపడ్డానని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.
'ఇది డిస్‌గస్టింగ్‌గా అనిపించింది. చాలా నిరాశకు గురయ్యాను. అందుకే రోల్ మోడల్స్‌ను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని నేను పదేపదే చెబుతుంటాను. కేవలం పేరు తెచ్చుకుంటేనే గుర్తింపు రాదు. మనం చేసే పనులను బట్టే వస్తుంది. కోట్లాది మంది పిల్లలు మనల్ని చూస్తుంటారు. పాన్ మసాలా ప్రకటనల్లో నటించి డబ్బులు సంపాదించడం అంత ముఖ్యమేమీ కాదు. 2018లో దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు రూ.3 కోట్లు వదిలేసుకున్నాను. నేను దాన్ని తీసుకోవచ్చు. కానీ వదిలేశాను. ఎందుకంటే మనకు రావాల్సిందే వస్తుందని నా నమ్మకం' అని గౌతీ అన్నాడు.
'పాన్ మసాల ప్రకటనలో నటించాలని సచిన్ తెందూల్కర్‌కు రూ.20-30 కోట్లు ఆఫర్ చేశారు. కానీ అలాంటి వాటిల్లో భాగస్వామి కానని ఆయన తన తండ్రికి మాటిచ్చారు. అందుకే సచిన్ ఆరాధ్యుడిగా మారిపోయారు. అలాంటి పెద్ద ఆఫర్‌ను కాదనాలంటే చాలా ధైర్యం కావాలి' అని గంభీర్ అన్నాడు.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా ఓటమి తర్వాత గౌతీ స్పందించాడు. జట్టులో స్టార్ కల్చర్‌కు తెరపడాలని సూచించాడు. టీమ్ఇండియా కన్నా ఎవరూ ఎక్కువ కాదని, టీమ్‌నే స్టార్‌గా మార్చాలని వెల్లడించాడు. ఫియర్‌లెస్ క్రికెట్ ఆడటం మంచిదన్నాడు.
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ గదను సొంతం చేసుకొనేందుకు 444 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా అందులో కనీసం ముప్పావు స్కోరైనా చేయలేదు. రెండో ఇన్నింగ్సులో 63.3 ఓవర్లు ఆడి 234 పరుగులకే ఆలౌటైంది. ఏకంగా 209 పరుగుల తేడాతో ఓడిపోయింది. విరాట్ కోహ్లీ (49; 78 బంతుల్లో 7x4), అజింక్య రహానె (46; 108 బంతుల్లో 7x4), రోహిత్ శర్మ (43; 60 బంతుల్లో 7x4, 1x6) టాప్ స్కోరర్లు. చెతేశ్వర్ పుజారా (27; 47 బంతుల్లో 5x4), శ్రీకర్ భరత్ (23; 41 బంతుల్లో 2x4) ఏదో మోస్తరు స్కోర్లు చేశారు.