ప్రపంచకప్‌లో చావో రేవో తేల్చుకునే మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్... దక్షిణాఫ్రికా ముందు పోరాడే స్కోరును ఉంచింది. 46.4 ఓవర్లలో 270 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. ఓ దశలో మూడు వందలకుపైగా పరుగులు చేసేలా కనిపించిన బాబర్ సేన ప్రొటీస్ బౌలర్లు పుంజుకోవడంతో 270 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో సారధి బాబర్ ఆజమ్ 50, సౌద్ షకీల్ 52, షాదాబ్ ఖాన్ 43 పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రీజ్ షమీ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. పిచ్ స్పిన్‌కు అనూకూలిస్తున్న వేళ పాక్ 271 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోగలదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు శుభారంభం లభించలేదు. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. 17 బంతుల్లో 9 పరుగులు చేసిన అబ్దుల్లా షఫీక్‌ను జాన్సన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే 18 బంతుల్లో 12 పరుగులు చేసిన ఇమాముల్ హక్‌ను జాన్సన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో కేవలం 38 పరుగులకే పాకిస్థాన్ రెండు వికెట్లు కోల్పోయింది. కానీ పాక్ సారధి బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ పాక్‌ను ఆదుకున్నారు. సమయోచితంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. అడపాదడపా బౌండరీలు కొడుతూ పాక్‌ను భారీ స్కోరు వైపు నడిపించింది. కానీ 27 బంతుల్లో 31 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన మహ్మద్ రిజ్వాన్‌ను కాట్జే అవుట్ చేసి దెబ్బ కొట్టడంతో 86 పరుగుల వద్ద పాకిస్థాన్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం ఇఫ్తికార్ అహ్మద్‌తో కలిసి బాబర్ ఆజమ్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు.
కానీ ఈసారి షంషీ పాకిస్థాన్ దెబ్బ కొట్టాడు. 31 బంతుల్లో 21 పరుగులు చేసిన ఇఫ్తికార్ అహ్మద్‌ను షంషీ పెవిలియన్ చేర్చాడు. 129 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన పాక్.... ఆ తర్వాత కాసేపటికే క్రీజులో స్థిరపడ్డ సారధి బాబర్ ఆజమ్ వికెట్‌ను కోల్పోయి కష్టాల్లో పడింది. 65 బంతుల్లో సరిగ్గా 50 పరుగులు చేసిన బాబర్ ఆజమ్‌ను షంషీ అవుట్ చేశాడు. 141 పరుగుల వద్ద అయిదో వికెట్ కోల్పోయిన పాక్... కష్టాల్లో పడ్డట్లే కనిపించింది. కానీ సౌద్ షకీల్ పాక్‌ను ఆదుకున్నాడు. 52 బంతుల్లో 7 ఫోర్లతో 52 పరుగులు చేసి సౌద్ షకీల్ అవుటయ్యాడు. షాదాబ్ ఖాన్ 43, మహ్మద్ నవాజ్ 24 పరుగులతో పర్వాలేదనిపించారు. దీంతో పాక్ 300 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించేలా కనిపించింది. కానీ పుంజుకున్న ప్రొటీస్ బౌలర్లు వరుసగా వికెట్లను తీశారు. షంషీ నాలుగు, జాన్సన్ 3, కోట్జే రెండు వికెట్లు తీశాడు. దీంతో 50 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయిన పాక్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. చెన్నై చెపాక్ పిచ్ బౌలర్లకు సహకరిస్తున్న వేళ పాక్ బౌలర్లు ఈ లక్ష్యాన్ని కాపాడుకుంటారేమో చూడాలి.
ఈ మ్యాచ్‌లో ఓడితే పాక్ సెమీఫైనల్ అవకాశాలు పూర్తిగా గల్లంతవుతాయి. ఇప్పటికే పాక్ జట్టుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ.. ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైతే దాయాది జట్టు పరిస్థితి మరింత ఘోరంగా ఉండనుంది. నాకౌట్ చేరకుండా ప్రపంచకప్‌లో పాక్ పోరాటం ముగుస్తుంది. ప్రొటీస్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో ఓడితే మిగిలిన మ్యాచుల్లో గెలిచినా పాక్‌కు ప్రయోజనం ఉండదు.దక్షిణాఫ్రికా- పాక్ 82 మ్యాచ్‌లు ఆడగా 51 మ్యాచుల్లో ప్రొటీస్.. .30 మ్యాచుల్లో పాక్ గెలిచింది. ధర్మశాలలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క ఓటమి తప్ప.... మిగిలిన మ్యాచ్‌ల్లో ప్రొటీస్ విధ్వంసం కొనసాగింది. క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మాక్రమ్ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు 155 ఫోర్లు, 59 సిక్సర్లు కొడితే.. పాకిస్థాన్ ఐదు మ్యాచ్‌ల్లో 24 సిక్సర్లు, 136 బౌండరీలు మాత్రమే చేయగలిగింది. మొదటి సఫారీ జట్టులో డి కాక్, క్లాసెన్, మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ 100కి పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తుండగా పాక్ బ్యాటర్లు మూడంకెల స్ట్రైక్ రేట్‌ను చేరుకోలేకపోయారు. ప్రతి పోరులోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉన్న పాకిస్థానీలతో పోలిస్తే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మెరుగైన స్థితిలో ఉన్నారు.