భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. టీమిండియా వ్యూహాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ అంతా సవ్యంగా సాగేలా చూస్తున్నాడు టీమిండియా దిగ్గజం, హెడ్ కోచ్ రాహుల్‌ ద్రవిడ్. తన అపార అనుభవాన్నంతా ఉపయోగించి, యువ క్రికెటర్లను సానపెడుతున్నాడు. ఈ వన్డే ప్రపంచ కప్‌ తర్వాత భారత ప్రధాన కోచ్‌గా మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రపంచకప్‌ ముగిసిన వారం రోజుల్లోపే భారత్‌లో పొట్టి సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌గా ఉన్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ టీమిండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరించొచ్చు. 


భారత జట్టుతో రాహుల్ ద్రావిడ్ రెండేళ్ల కోచింగ్ కాంట్రాక్ట్ 2023 వన్డే ప్రపంచ కప్‌తో ముగియనుంది. 2021లో టీ20 ప్రపంచ కప్ తర్వాత రవిశాస్త్రి నుంచి రాహుల్‌ ద్రవిడ్‌ బాధ్యతలు స్వీకరించాడు. ద్రావిడ్ మార్గనిర్దేశంలో టీమిండియా ఆసియా కప్‌ సాధించింది. టీ20 ప్రపంచ కప్ 2022లో సెమీ ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఇప్పుడు రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం పొడిగిస్తారా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేదు. ద్రవిడ్ మళ్లీ దరఖాస్తు చేసుకోకుంటే వీవీఎస్‌ లక్ష్మణ్ పూర్తికాల కోచ్‌గా మారే అవకాశం కుడా ఉంది. ఇప్పటికే పలు సిరీస్‌లకు కోచ్‌గా వ్యవహరించిన అనుభవం వెరీవెరీ స్పెషల్‌ లక్ష్మణ్‌కు ఉంది. బోర్డు మరోసారి ద్రవిడ్‌ వైపు మొగ్గు చూపితే నిబంధనల ప్రకారం అతడిని తిరిగి దరఖాస్తు చేసుకోవాలని కోరుతుంది. నిరంతర పర్యటనలు, పని ఒత్తిడి అధికంగా ఉండే ఈ బాధ్యతలను 51 ఏళ్ల ద్రవిడ్‌ తిరిగి తీసుకుంటాడాన్నదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ద్రవిడ్‌ ఐపీఎల్‌లోనే ఏదేనీ ఫ్రాంచైజీకి కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో దిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌కు కోచ్‌గా పనిచేసిన ద్రవిడ్‌.. మరోసారి ఐపీఎల్‌ బాధ్యతల పట్ల ఆసక్తి చూపుతున్నాడని దివాల్‌ సన్నిహత వర్గాలు తెలుపుతున్నాయి. 


లక్ష్మణ్ ను కేవలం ఆసీస్ తో జరిగే టీ20 సిరీస్ వరకే కోచ్ గా కొనసాగిస్తారా? లేక పూర్తిస్థాయిలో కోచ్ గా నియమిస్తారా? అని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. రాహుల్ ద్రవిడ్‌కి విరామం అవసరమైన ప్రతిసారీ వీవీఎస్ లక్ష్మణే ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు, కాబట్టి ప్రపంచ కప్ తర్వాత కూడా ఇదే జరగనుందని బీసీసీఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు  వచ్చే ఏడాది అండర్‌-19 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో నాలుగు జట్ల టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. విజయవాడలో జరిగే ఈ టోర్నీలో ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌తో పాటు భారత్‌ నుంచి రెండు జట్లు బరిలోఉంటాయి. వినూ మన్కడ్‌ అండర్‌-19 ట్రోఫీ, ఛాలెంజర్‌ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగా యువ జట్లను ఎంపిక చేస్తారు.


టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు ఎక్కువ ఛాన్సులిచ్చేందుకు అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ప్రణాళికలు రచిస్తోంది. పలువురు భారత ఆటగాళ్లకు ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి. హార్ధిక్‌ పాండ్యాకు వన్డే ప్రపంచకప్‌ తర్వాత విశ్రాంతినిచ్చి టీ20 స్టార్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జూన్‌లో జరుగబోయే పొట్టి ప్రపంచకప్‌లో హార్ధిక్‌ లేని పక్షంలో మరో సారథి కోసం ఈ ప్రయోగాలు ఉపయోగపడతాయని బీసీసీఐ భావిస్తోంది.