PAK vs BAN:
ఆసియాకప్ 2023లో మొదటి సూపర్-4 మ్యాచుకు వేళైంది! లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ వేశారు. టాస్ గెలిచిన బంగ్లా సారథి షకీబ్ అల్ హసన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
'మేం మొదట బ్యాటింగ్ చేస్తాం. ఎండ వేడిమి మినహాయిస్తే మరో కారణమేమీ లేదు. ముందు మేం పరుగులు చేస్తే పాకిస్థాన్‌ను ఒత్తిడిలోకి నెట్టొచ్చు. అఫ్గాన్‌పై అనుసరించిన వ్యూహాలనే ఇక్కడా అమలు చేస్తాం. మేం అత్యుత్తమంగా ఆడాల్సిన అవసరం ఉంది. ప్రత్యర్థి మమ్మల్ని ఏం చేస్తుందోనన్న భయం లేదు. వారి బలాలు, బలహీనతలు మాకు తెలుసు. శాంటో ఆడటం లేదు. అతడి స్థానంలో లిటన్ దాస్‌ను తీసుకొచ్చాం' అని బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అన్నాడు.
'టాస్ గెలిస్తే మేమూ మొదట బ్యాటింగే తీసుకోవాలని అనుకున్నాం. పిచ్‌పై కాస్త పచ్చిక ఉంది. దానిని మేం సద్వినియోగం చేసుకుంటాం. పేస్ డిపార్ట్‌మెంట్లో మేం చాలా బాగున్నాం. మాకు ఇక్కడ చాలా ఆడిన అనుభవం ఉంది. కాబట్టి ఎండ వేడిమి అనుకూలంగా మార్చుకుంటాం. నేనీ మ్యాచు గురించే ఆలోచిస్తున్నా. అన్వర్ సెంచరీల రికార్డును సమం చేసేందుకు ప్రయత్నిస్తా. చివరి మ్యాచులో ఫాస్ట్ బౌలర్లు మాకు అండగా నిలబడ్డారు. అందుకే మేం ఒక అదనపు పేసర్‌ను తీసుకున్నాం' అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు.
బంగ్లాదేశ్: మహ్మద్ నయీమ్, హసన్ మిరాజ్, లిటన్ దాస్, తౌహిద్ హృదయ్, షకిబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, షమీమ్ హుస్సేన్, అఫిఫ్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, హసన్ మహ్మద్
పాకిస్థాన్: ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హఖ్, బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రౌఫ్
శ్రీలంక.. అఫ్గానిస్తాన్‌ను ఓడించడంతో లక్కీగా సూపర్-4 చేరిన బంగ్లాదేశ్ ఇంతవరకూ పాకిస్తాన్‌తో (పాక్‌లో) మూడు ఫార్మాట్లలోనూ ఆడిన ఏ ఒక్క మ్యాచ్ లోనూ ఆ దేశాన్ని ఓడించలేదు. ఆసియా కప్‌లో కూడా పాక్ చేతిలో బంగ్లాకు పరాభవాలు తప్పలేదు. వన్డేలలో భారత్ మాదిరే 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత బంగ్లా.. పాకిస్తాన్‌తో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 1999 వన్డే వరల్డ్ కప్ నుంచి 2015 ప్రపంచకప్ మధ్యలో బంగ్లాదేశ్ తాను ఆడిన ప్రతి ప్రత్యర్థితో ఏదో ఒక్క మ్యాచ్ లో అయినా గెలిచింది. కానీ పాకిస్తాన్‌ను మాత్రం ఓడించలేదు. అయితే 2015లో తొలిసారి ఆ ముచ్చట తీర్చుకున్న బంగ్లా ఇప్పటివరకూ పాక్‌తో 37 వన్డేలు ఆడితే ఐదు మ్యాచ్‌లు మత్రమే గెలిచింది. ఇప్పుడు బంగ్లాకు పాక్‌ను వారి స్వదేశంలోనే ఓడించే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్ స్వదేశంలో జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఫేవరేట్‌గా ఉన్నా గత కొంతకాలంగా వన్డేలలో బంగ్లా పటిష్టంగా తయారైంది.
గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న బంగ్లాకు ఈ మ్యాచ్‌కు ముందే భారీ షాక్ తాకింది. ఈ టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉన్న నజ్ముల్ హోసేన్ శాంతో నేటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగానే ఉంది. గాయం కారణంగా అతడు ఆడేది అనుమానమే. అతడి స్థానంలో ఈ టోర్నీకి ముందే జ్వరంతో ఇబ్బందిపడి కోలుకున్న లిటన్ దాస్ జట్టుతో చేరే అవకాశముంది. అదే జరిగితే బంగ్లా బ్యాటింగ్ బలోపేతమైనట్టే. దాస్ వస్తే ఓపెనర్‌గా వచ్చి గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన మెహిది హసన్ మిరాజ్‌ను ఆడిస్తారా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అఫ్గాన్‌తో ఇదే లాహోర్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో బంగ్లా.. 334 పరుగుల భారీ స్కోరు చేసి మంచి టచ్‌లోనే ఉంది. దీనినే కంటిన్యూ చేయాలని షకిబ్ అల్ హసన్ సేన భావిస్తున్నా ఫుల్ స్వింగ్‌లో ఉన్న పాకిస్తాన్ బౌలర్లు ఆ ఛాన్స్ ఇస్తారా..? అన్నది ఆసక్తికరం.