Asia Cup 2023: ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుతో కయ్యానికి కాలు దువ్వితే ఎలా ఉంటుందో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు క్రమక్రమంగా అవగతమవుతోంది. ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహణలో బీసీసీఐ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌కు ముందు ససేమిరా అన్నా తర్వాత ఒప్పుకుని, తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ (2025)కి రాతపూర్వక హామీ (తమ దేశానికి వస్తామని) అడిగిన పీసీబీకి బీసీసీఐ షాకుల మీద షాకులిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఆసియా కప్ పాకిస్తాన్ నుంచి తరలిపోతుండగా ఇన్నాళ్లు తటస్థ వేదికలో తమ ఆటగాళ్ల ఆట చూద్దామని కోరుకున్న పాక్ అభిమానులకు అది కూడా దక్కేట్టు లేదు. ఈ టోర్నీని పాకిస్తాన్ బహిష్కరించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పీసీబీ చీఫ్ నజమ్ సేథీ మంగళవారం దుబాయ్‌లోని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రతినిధులతో ఇదే విషయాన్ని చర్చించినట్టు తెలుస్తున్నది.
‘ఆసియా కప్ కోసం పాకిస్తాన్ సవరించిన హైబ్రిడ్ మోడల్ షెడ్యూల్ ను ఏసీసీ అంగీకరించాలని సేథీ నొక్కి చెప్పారు. ఒకవేళ ఏసీసీలోని మెజారిటీ సభ్యులు టోర్నీని పాకిస్తాన్ లో కాకుండా మరో చోట నిర్వహించాలంటే దానిని 2018, 2022 మాదిరిగా యూఏఈలో ఆడించాలి. సెప్టెంబర్ లో యూఏఈలో ఎండ ఉంటుందని బీసీసీఐ చేసిన ఆరోపణలను సేథీ కొట్టిపారేశారు. అలా అయితే 2020 సెప్టెంబర్, నవంబర్ లలో దుబాయ్ వేదికగా ఐపీఎల్ నిర్వహించలేదా..? అని ఆయన ప్రశ్నించారు..’అని పీసీబీ వర్గాలు తెలిపాయి.
అంతేగాక.. ‘ఫిబ్రవరిలో జరిగిన ఏసీసీ బోర్డు మీటింగ్ లో తమ దేశంలో ఆసియా కప్ నిర్వహించాలని చూసిన శ్రీలంక ప్రతిపాదనను పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ తిరస్కరించాయి. ఇప్పుడు మళ్లీ లంకలో ఎలా నిర్వహిస్తారు..?’ అని ఏసీసీ ప్రతినిధులకు కరాఖండీగా చెప్పేసినట్టు పీసీబీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
పాక్‌కే నష్టం..?
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ కు రాబోయేది గడ్డుకాలమే అని అనిపించక మానదు. ఒకవేళ ఆసియా కప్ ను పాకిస్తాన్ బహిష్కరిస్తే అది ఆ జట్టుకే నష్టం. పాకిస్తాన్ లేకున్నా యూఏఈని ఆడించేందుకు ఏసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఆసియా కప్ వివాదం పాకిస్తాన్‌కు వచ్చే వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీపైనా పడే అవకాశం లేకపోలేదు. ఎటుచూసినా అది పాకిస్తాన్ కే నష్టం. ఈ నెల చివరివరకు ఆసియా కప్ నిర్వహణపై ఏసీసీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో పీసీబీ తన మొండిపట్టుదలను వీడుతుందా..? లేదా..? అన్నది ఆసక్తికరం.