ICC ODI Ranking: దుర్బేధ్యమైన బౌలింగ్, పటిష్టమైన బ్యాటింగ్‌తో  వన్డేలలో  ఐసీసీ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకున్న  పాకిస్తాన్‌కు  భారీ షాక్ తాకింది.  సరిగ్గా ఆసియా కప్ - 2‌0‌23లో భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ నెంబర్ వన్ ర్యాంకు హోదాను కోల్పోయింది. తిరిగి ఆస్ట్రేలియా   అగ్రస్థానానికి చేరుకోగా  పాకిస్తాన్ రెండో స్థానానికి పరిమితమైంది. దక్షిణాఫ్రికాపై వరుసగా రెండో వన్డేలో గెలిచిన ఆసీస్.. నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది.


దక్షిణాఫ్రికాతో  బ్లూమ్‌ఫౌంటెన్ వేదికగా  జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా   శనివారం ముగిసిన రెండో వన్డేలో  ఆసీస్ భారీ విజయాన్ని సాధించింది.  ఈ విజయంతో  ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానానికి వెళ్లింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం..  ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో  ఆస్ట్రేలియా 121 పాయింట్లతో  నెంబర్ వన్ హోదాలో ఉంది.  పాకిస్తాన్ 120 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా  114 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో నిలిచాయి.   న్యూజిలాండ్  (106), ఇంగ్లాండ్ (99)లు టాప్ - 5లో ఉన్నాయి.  


 






ఆసియా కప్ ప్రారంభానికి ముందు శ్రీలంకలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్.. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.  కానీ  రెండు వారాల వ్యవధిలోనే  పాకిస్తాన్ ఆ  హోదాను కోల్పోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ గతంలో కూడా వన్డే ర్యాంకింగ్స్‌లో  రెండు రోజులే  నెంబర్ వన్ ర్యాంకును అనుభవించి తర్వాత ఆస్ట్రేలియా  తిరిగి పుంజుకోవడంతో రెండో స్థానానికి పరిమితమైన విషయం తెలిసిందే.  


 






ఆసీస్ ఘన విజయం..


ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ఓటమన్నదే లేకుండా సాగుతోంది.  టీ20 సిరీస్‌ను  3-0తో గెలిచిన కంగారూలు.. వన్డే సిరీస్‌లో కూడా దుమ్మురేపుతున్నారు. తొలి వన్డేలో  పోరాడి గెలిచిన కంగారూలు రెండో వన్డేలో మాత్రం అలవోక విజయాన్ని అందుకున్నారు. రెండో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీ 50 ఓవర్లలో 392 పరుగుల భారీ స్కోరు సాధించింది.  ఓపెనర్ డేవిడ్ వార్నర్ (93 బంతుల్లో 106, 12 ఫోర్లు, 3 సిక్సర్లు), ట్రావిస్ హెడ్ (36 బంతుల్లో 64, 9 ఫోర్లు, 3 సిక్సర్లు)తో పాటు మార్నస్ లబూషేన్ (99 బంతుల్లో 124, 19 ఫోర్లు, 1 సిక్సర్), జోష్ ఇంగ్లిస్ (50) రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. 


అనంతరం  భారీ లక్ష్య ఛేదనలో  సౌతాఫ్రికా తడబడింది.   ఓపెనర్లు క్వింటన్ డికాక్ (45), టెంబ బవుమా (46)లు శుభారంభాన్నే ఇచ్చినా తర్వాత  బ్యాటర్లు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు.  డసెన్ (17), మార్క్‌రమ్ (3)లు నిరాశపరిచారు.  హెన్రిచ్ క్లాసెన్ (49), డేవిడ్ మిల్లర్ (49) లు ఫర్వాలేదనిపించినా  భారీ స్కోర్లు చేయలేకపోయారు.  ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీయగా ఆరోన్ హార్డీ, నాథన్ ఎల్లిస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. 



































ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial