Asia Cup 2023, IND vs PAK: చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరుకు ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకొంత మిగిలే ఉండేంత వైరం ఈ రెండు దేశాలది.  ఇప్పుడంటే  ఇరు దేశాల మధ్య  రాజకీయ, సరిహద్దు కారణాలతో  భారత్ - పాక్‌లు తరుచూ తలపడటం లేదు గానీ గతంలో  ఇరు దేశాల మధ్య క్రికెటే వారధిగా నిలిచేది. అయితే 20‌12 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి.  కేవలం ఐసీసీ టోర్నీలలోనో, ఆసియా కప్‌లోనో భారత్ - పాక్ మ్యాచ్‌లు చూడాల్సి వస్తుంది. అయితే  మెగా టోర్నీలలో భారత్ కాసింత ఆధిక్యంగా  కనిపిస్తున్నా ఆధిపత్యం మాత్రం వారిదే ఉంది. గడిచిన రెండేండ్లుగా అయితే పాకిస్తాన్ బౌలింగ్ దుర్బేధ్యంగా మారింది. 


భారత్ - పాక్ వైరం @1952.. 


ఇరు దేశాల మధ్య సరిహద్దులు గీసుకున్న తర్వాత 1952 నుంచి ఈ రెండు జట్ల మధ్య వైరం మొదలైంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది 1952లో.. 2007 నుంచి భారత్ - పాక్‌లు టెస్టులు ఆడలేదు కానీ గతంలో  ఈ రెండు జట్ల మధ్య తరుచూ మ్యాచ్‌లు జరిగేవి.  మొత్తంగా  దాయాదుల మధ్య  59 టెస్టులు జరిగితే  అందులో ఏకంగా 38 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. పాకిస్తాన్ 12 నెగ్గగా  భారత్ 9 మాత్రమే  గెలిచింది. 


వన్డేలలో.. 


క్రికెట్ అభిమానులకు అత్యంత ఆసక్తిని,  అసలైన మజాను పంచింది భారత్ - పాక్ వన్డే పోరే అని చెప్పక తప్పదు.  ఇరు జట్లు తొలి వన్డేను 1978లో ఆడాయి.  నాటి నుంచి మొన్నటి ఆసియా కప్ గ్రూప్ స్టేజ్‌లో వర్షం పుణ్యమా అని తుడుచుపెట్టుకుపోయిన మ్యాచ్ వరకూ ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య  133 వన్డేలు జరిగాయి.  ఇందులో భారత్ గెలిచినవి 55 అయితే పాకిస్తాన్ ఏకంగా 73 వన్డేలలో విజయాలను సొంతం చేసుకుంది. ఐదు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. 


టీ20లలో.. 


ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్ కప్‌లోనే భారత్ -పాక్ లు తలపడ్డాయి.  ఈ ఫార్మాట్‌లో మాత్రం భారత్ ఆధిక్యం స్పష్టంగా ఉంది.  దాయాదుల మధ్య ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లు జరుగగా అందులో భారత్ ఏకంగా 9 మ్యాచ్‌‌లలో  గెలిచింది. పాకిస్తాన్ గెలిచినవి మూడు మాత్రమే.. 


ఐసీసీ టోర్నీలలో.. 


ఐసీసీ  టోర్నీలలో పాకిస్తాన్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. వన్డే  ప్రపంచకప్ పోటీలలో ఇంతవరకూ  భారత్.. పాకిస్తాన్‌కు తలవంచలేదు.  1992 నుంచి ఆడిన ప్రతి ప్రపంచకప్‌లో (మొత్తం ఏడు)నూ భారత్‌దే విజయం.  వన్డే  ప్రపంచకప్‌లో భారత్ రికార్డు 7-0గా ఉంది. ఇక ఐసీసీ టీ20 వరల్డ్ కప్  టోర్నీలలో కూడా భారత్‌‌కు పాకిస్తాన్‌పై ఘనమైన రికార్డే ఉంది.  మినీ  వరల్డ్ కప్‌లలో దాయాదులు ఏడు సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ ఆరు మ్యాచ్‌లను గెలుచుకోగా పాకిస్తాన్ ఒక్కసారి (2021 వరల్డ్ కప్‌లో) మాత్రమే నెగ్గింది.  


ఆసియా కప్‌లో.. 


ఆసియా కప్‌లో భారత్ - పాకిస్తాన్‌లు 17 సార్లు (14 వన్డేలు, 3 టీ20లు) తలపడ్డాయి. ఇందులో  భారత్ 9 (ఏడు వన్డేలు, రెండు టీ20లు) మ్యాచ్‌లలో  గెలిచింది.  పాకిస్తాన్ ఆరు మ్యాచ్‌లలో నెగ్గగా రెండు మ్యాచ్‌లలో ఫలితాలు తేలలేదు.  


2021కు ముందు పాకిస్తాన్ ఐసీసీ టోర్నీలలో అలవకోగానే తలవంచేది. కానీ ఆ ఏడాది నుంచి పరిస్థితి మారింది.  షహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, నసీమ్ షా వంటి బౌలర్లు.. బాబర్ ఆజమ్,  మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్,  ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్ వంటి బ్యాటర్లు ఆ జట్టును విజయాల బాట పట్టిస్తున్నారు. 2021లో దుబాయ్ వేదికగా  ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో షహీన్ షా అఫ్రిది కొట్టిన దెబ్బ భారత్‌ను ఇప్పటికీ వెన్నాడుతోంది. వారం రోజుల క్రితం  ఇదే ఆసియా కప్‌లో పల్లెకెలెలో జరిగిన వన్డే మ్యాచ్‌లో కూడా ఇదే  రిపీట్ అయింది. మరి నేడు (సెప్టెంబర్ 10) జరుగబోయే సూపర్ - 4 మ్యాచ్ ‌లో అయినా భారత బ్యాటర్లు పాక్ బౌలర్లపై  ఆధిపత్యం చెలాయిస్తారా..? లేక వారి బౌలింగ్‌కు దాసోహమవుతారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. 


తుది జట్లు : 


పాకిస్తాన్ : బాబర్ ఆజమ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫహీమ్ అష్రాఫ్, నసీమ్ షా, షహీన్ షా ఆఫ్రిది, హరీస్ రౌఫ్


భారత్ (అంచనా) : శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా,  శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ 


మ్యాచ్ టైమింగ్స్, లైవ్.. 


- కొలంబోలోని ప్రేమదాస వేదికగా జరిగే ఈ మ్యాచ్  భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 3 గంటలకు మొదలవుతుంది. 


- ఈ మ్యాచ్‌‌ను  స్టార్ నెట్‌వర్క్‌లో  హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ప్రాంతీయ భాషలలోనూ చూడొచ్చు.  మొబైల్ యాప్‌లో ఎటువంటి రుసుము లేకుండానే డిస్నీ హాట్ స్టార్‌లో లైవ్ టెలికాస్ట్ తిలకించొచ్చు.  

































ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial