Asia Cup, IND vs PAK: రెండేండ్లకో నాలుగేండ్లకో ఒకసారి  ఐసీసీ టోర్నీలలో తప్ప రెగ్యులర్‌గా తలపడని భారత్ - పాకిస్తాన్‌ల పోరు వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి జరుగుతోంది. ఆసియా కప్- 2023లో భాగంగా  చిరకాల ప్రత్యర్థులు గ్రూప్ దశలో ఒకసారి తలపడగా వర్షం కారణంగా ఆ మ్యాచ్ అర్థాంతరంగా రద్దు అయింది. సగం మజానే ఇచ్చిన ఆ పోరును  పూర్తిగా ఎంజాయ్ చేయడానికి  క్రికెట్ మరో అవకాశమిచ్చినా వరుణుడు మాత్రం  దానినీ జరగనిచ్చేట్టే లేడు.  ఇప్పుడు ఇరు దేశాల క్రికెట్ అభిమానులు  ఈ మ్యాచ్‌లో ఎవరు గెలవాలి..? అనేదానికంటే.. ‘వరుణదేవుడా.. ప్లీజ్.. ఒక్కరోజు కరుణించవయ్యా..’ అని వేడుకోవాల్సిన సమయం వచ్చింది. నేడు కొలంబోలో వర్షాలు పడే అవకాశం ఏకంగా 90 శాతం  ఉంది. 


పాకిస్తాన్‌కు పేసర్లే బలం.. 


ఇటీవల కాలంలో పాకిస్తాన్ వన్డేలలో వరల్డ్ నెంబర్ వన్ జట్టు కావడానికి కారణం ఆ జట్టు బ్యాటింగ్ కంటే బౌలింగే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. పేస్ త్రయం షహీన్ షా అఫ్రిది,  నసీమ్ షా,  హరీస్ రౌఫ్‌లు  ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఇప్పుడు వాళ్లకు కొత్తగా  నాలుగో పేసర్ కూడా వచ్చి చేరాడు. భారత్‌తో మ్యాచ్‌కు పాకిస్తాన్ ఏకంగా నలుగురు పేసరన్లతో బరిలోకి దిగుతోంది. ఆ నాలుగో ఫహీమ్ అష్రఫ్  కూడా జతకలిశాడు. షహీన్, నసీమ్, హరీస్‌ల బౌలింగ్‌‌లో ఆడేందుకే తలలు పట్టుకుంటున్న భారత బ్యాటర్లకు ఇది మరో కొత్త తలనొప్పే. గత మ్యాచ్ మాదిరిగానే   ప్రారంభ ఓవర్లలోనే  భారత్‌ను దెబ్బతీసి ఒత్తిడిలోకి నెట్టాలన్నది పాకిస్తాన్ పేసర్ల  ప్రణాళిక. పేస్‌కు సహకరించే  కొలంబో పిచ్‌పై నలుగురు పాక్ పేసర్లు భారత బ్యాటర్లకు మరోసారి నిద్రలేని రాత్రులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ సవాల్‌ను  భారత  బ్యాటర్లు ఏ మేర ఛేదిస్తారు అనేది  ఆసక్తికరంగా మారింది.  


రాహుల్, బుమ్రా ఎంట్రీ.. 


ఈ మ్యాచ్‌లో భారత జట్టులో కొన్ని మార్పులు ఉండొచ్చు. శస్త్రచికిత్స తర్వాత పూర్తిగా కోలుకుని ఇటీవలే జట్టుతో చేరిన కెఎల్ రాహుల్ నేటి మ్యాచ్‌లో ఆడే అవకాశముంది. అతడితో పాటు పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో ఆడే అవకాశమొచ్చినా బౌలింగ్ చేయని బుమ్రా మీదే భారత్ ప్రధానంగా దృష్టి సారించింది. వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ ఇద్దరూ రాణించడం భారత్‌కు అత్యావశ్యకం.  అయితే రాహుల్ చివరిసారిగా వన్డేలు ఆడింది  గత మార్చిలో కాగా బుమ్రా అయితే గతేడాది ఆగస్టులో ఆడాడు. మరి ఈ ఇద్దరూ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఏ మేరకు ప్రభావం చూపగలుగుతారనేది చూడాలి. ఇక రాహుల్ టీమ్‌లోకి వస్తే  ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.  ఇటీవలే వన్డే వరల్డ్ కప్  టీమ్ అనౌన్స్‌మెంట్‌లో భాగంగా అవసరమైతే రాహుల్, ఇషాన్‌ ఇద్దరితో ఆడతామని  రోహిత్ చెప్పిన నేపథ్యంలో ఇద్దరికీ అవకాశమిస్తారా..? అన్నది కూడా  ఆసక్తికరమే. అలా ఇస్తే   ఎవరిని పక్కనబెడతారు..? అన్నదీ  చూడాలి. 


ఇక వారం రోజుల క్రితం  పాకిస్తాన్‌తో ముగిసిన  మ్యాచ్‌లో షహీన్, హరీస్‌ల దాడిని ఎదుర్కోలేక భారత టాపార్డర్ చతికిలపడింది.   నేడు భారత ప్రధాన టార్గెట్ అతడే అని చెప్పకతప్పదు.  షాహీన్‌ను కాస్త నిలువరించగలిగితే తర్వాత పరుగులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.  2021 టీ20 వరల్డ్ కప్ నుంచి రోహిత్‌ను ఇబ్బందిపెడుతున్న షహీన్‌ను ఈ మ్యాచ్ ‌లో అయినా హిట్‌మ్యాన్ ఏ మేరకు ఎదుర్కుంటాడో  చూడాలి. గత మ్యాచ్ ‌లో విఫలమైన కోహ్లీ, గిల్, శ్రేయాస్ జూలు విదిల్చితేనే  భారత్  భారీ స్కోరు చేసే అవకాశాలుంటాయి. ఇక నేపాల్‌తో మ్యాచ్‌లో  దారుణంగా విఫలమైన భారత బౌలర్లు  ఈ మ్యాచ్‌లో కచ్చితంగా మెరుగవ్వాలి. బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్ ‌లో కూడా బాబర్ గ్యాంగ్ స్ట్రాంగ్‌గానే ఉంది. 


వరుణుడు కరుణిస్తేనే..


ఆసియా కప్ లాహోర్ నుంచి కొలంబో (శ్రీలంక)కు షిఫ్ట్ అయి ఒక మ్యాచ్ (బంగ్లా - లంక)  కూడా ముగిసింది.  ఇక మిగిలిన సూపర్ - 4 మ్యాచ్‌లతో పాటు ఫైనల్ కూడా కొలంబోలోనే జరగాల్సి ఉంది.  కానీ  గడిచిన కొద్దిరోజులుగా  కొలంబోలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం..  ఆదివారం వర్షాలు పడే అవకాశాలు 90 శాతం దాకా ఉన్నాయట.  ఇదేగనక నిజమైతే మరోసారి  అభిమానుల ఆశల మీద వరుణుడు నీళ్లు కాదు ఏఖంగా కుంభవృష్టి కురిపించినట్టే. అయితే  నిన్నటి లంక- బంగ్లా మ్యాచ్  సజావుగానే సాగడంతో పాటు  భారత్ - పాక్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా ఉండటం కలిసొచ్చేదే.. మరి వరుణుడు  ఏం చేస్తాడో చూడాలి. 


తుది జట్లు : 


పాకిస్తాన్ : బాబర్ ఆజమ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫహీమ్ అష్రాఫ్, నసీమ్ షా, షహీన్ షా ఆఫ్రిది, హరీస్ రౌఫ్


భారత్ (అంచనా) : శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా,  శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ 


మ్యాచ్ టైమింగ్స్, లైవ్.. 


- కొలంబోలోని ప్రేమదాస వేదికగా జరిగే ఈ మ్యాచ్  భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 3 గంటలకు మొదలవుతుంది. 


- ఈ మ్యాచ్‌‌ను  స్టార్ నెట్‌వర్క్‌లో  హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ప్రాంతీయ భాషలలోనూ చూడొచ్చు.  మొబైల్ యాప్‌లో ఎటువంటి రుసుము లేకుండానే డిస్నీ హాట్ స్టార్‌లో లైవ్ టెలికాస్ట్ తిలకించొచ్చు.  
































ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial