Rohit Sharma: భారత్ - పాకిస్తాన్ మధ్య నేడు కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరగాల్సి ఉన్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటింగ్ ధ్వయం రోహిత్ శర్మ - విరాట్ కోహ్లీ (రోకో) అరుదైన మైలురాళ్ల ముంగిట నిలిచారు. సుదీర్ఘకాలంగా భారత్‌కు ఆడుతున్న ఈ ధ్వయం వ్యక్తిగతంగా పలు కీలక రికార్డులను సొంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. వన్డేలలో పదివేల పరుగుల రికార్డును అందుకోవడానికి రోహిత్, 13వేల మైలురాయిని చేరుకోవడానికి కోహ్లీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
పదివేల క్లబ్‌పై కన్నేసిన రోహిత్..!
టీమిండియా సారథి రోహిత్ శర్మ మరో 78 పరుగులు చేస్తే వన్డేలలో పదివేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ప్రస్తుతం 246 వన్డేలలో 9,922 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆ ఘనతను అందుకుంటాడో లేదో చూడాలి. ఒకవేళ రోహిత్ ఈ ఘనత అందుకుంటే పదివేల పరుగుల క్లబ్‌లో చేరిన ఆరో భారత బ్యాటర్ అవుతాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, మహేంద్ర సింగ్ ధోనిలు రోహిత్ కంటే ముందున్నారు. ప్రపంచవ్యాప్తంగా వన్డేలలో పదివేల రన్స్ చేసిన ఆటగాళ్లు 15 మంది ఉన్నారు.
2007 నుంచి భారత జట్టుకు ఆడుతున్న రోహిత్.. ఇప్పటివరకూ 246 వన్డేలలో 48.87 సగటుతో 9,922 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు 30 సెంచరీలు, 49 అర్థ సెంచరీలు సాధించాడు. రోహిత్ ఖాతాలో మూడు ద్విశతకాలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో వన్డేలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) అతడిపేరుమీదే ఉంది.
కోహ్లీ కూడా..
వన్డేలలో కింగ్ కోహ్లీ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. మరో 98 పరుగులు చేస్తే కోహ్లీ.. 13 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ఇప్పటివరకూ 277 వన్డేలు ఆడిన కోహ్లీ.. 12,902 పరుగులు సాధించాడు. వన్డేలలో కోహ్లీ సగటు 57.08గా ఉంది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో కోహ్లీ పేరిట 46 సెంచరీలు, 65 అర్థ సెంచరీలున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో వన్డేలలో 13వేల పరుగుల మైలురాళ్లు చేసినవారిలో సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర (శ్రీలంక), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), సనత్ జయసూర్య (శ్రీలంక) లు కోహ్లీ కంటే ముందున్నారు. మరి నేడు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో ‘రోకో’ ఏ మేరకు వారి వ్యక్తిగత రికార్డులను సాధిస్తారో చూడాలి.
కొలంబో లోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగబోయే భారత్ - పాక్ మ్యాచ్‌ను స్టార్ నెట్‌వర్క్‌లో హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ప్రాంతీయ భాషలలోనూ చూడొచ్చు. మొబైల్ యాప్‌లో ఎటువంటి రుసుము లేకుండానే డిస్నీ హాట్ స్టార్‌లో లైవ్ టెలికాస్ట్ తిలకించొచ్చు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial