Ayesha Naseem: అత్యంత పోటీ ఉండే  క్రికెట్‌లో ఒక క్రికెటర్  జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే దేశవాళీలో తమను తాము నిరూపించుకున్నాక కూడా కనీసం  24 - 28 ఏండ్ల మధ్య ఓ యుద్ధమే చేయాలి. ఇంత చేసినా  ఛాన్సులు వస్తాయన్న గ్యారెంటీ లేదు.  కానీ 15 ఏండ్లకే  జాతీయ జట్టులో చోటు దక్కించుకుని.. 18 ఏండ్లకే స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన పాకిస్తాన్ మహిళా క్రికెటర్ అయేషా నసీమ్ మాత్రం ఏకంగా తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)‌తో పాటు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.  


ఎవరీ అయేషా.. 


పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో పుట్టిపెరిగిన  అయేషాకు చిన్నప్పట్నుంచే క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. తన కష్టం, ఇష్టానికి తోడు  అదృష్టం కూడా కలిసిరావడంతో  15 ఏండ్లకే ఆమె.. పాకిస్తాన్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన 15వ ఏట.. ఐసీసీ ఉమెన్స్ టీ20 టోర్నమెంట్‌లో పాకిస్తాన్ తరఫున ఆడింది. 2020 మార్చి 3న థాయ్లాండ్‌తో జరిగిన  మ్యాచ్‌లో ఆమె అరంగేట్రం చేసింది.  ఆ తర్వాత ఏడాది (2021లో)  వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో  ఆమెకు ఆడే అవకాశం దక్కింది. 


 






పాకిస్తాన్ తరఫున మూడేండ్లలో నాలుగు వన్డేలు, 30 టీ20 మ్యాచ్‌లు ఆడిన  అయేషా.. వన్డేలలో 33, టీ20లలో 369 పరుగులు చేసింది.  అలవకోగా సిక్సర్లు కొట్టడంలో దిట్ట అయిన  అయేషా..  పాకిస్తాన్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా మారింది. 


ఎందుకు రిటైర్మెంట్..? 


మంచి భవిష్యత్ ఉన్న అయేషా.. రిటైర్మెంట్ గురించి  ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇస్లాం మతానికి అనుగుణంగా  తన జీవితాన్ని మరింత పవిత్రంగా జీవించేందుకే  ఈ నిర్ణయం తీసుకున్నానని  ఆమె తెలిపింది. ఈ ఏడాది  ఫిబ్రవరిలో ఆమె.. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో  ఆడింది. ఈ ఏడాద   ఉమెన్స్ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా.. భారత్‌తో ఆడిన మ్యాచ్‌లో అయేషా.. 45 పరుగులు సాధించింది.   తన టీ20 కెరీర్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.  


 






పాకిస్తాన్‌కు భారీ షాక్..


ఫ్యూచర్ స్టార్‌గా ఎదుగుతున్న అయేషా రిటైర్మెంట్ ప్రకటించడం పాక్ మహిళా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే.  ఈజీగా ఫోర్లు, సిక్సర్లు బాదే ఆమె టీ20  జట్టులో లేకపోవడం  పాకిస్తాన్‌కు నష్టం చేకూర్చేదేనని ఆ జట్టు అభిమానులు  భావిస్తున్నారు. 


 























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial