ODI World Cup 2023: ఈ ఏడాది అక్టోబర్ నుంచి మొదలుకాబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌ ట్రోఫీ  ప్రమోషన్స్‌ను  అంతర్జాతీయ క్రికెట్ మండలి గ్రాండ్‌గా  స్టార్ట్ చేసింది. బాలీవుడ్ బాద్‌షా, కింగ్ ఖాన్  షారుక్ ఖాన్ వాయిస్ ఓవర్‌తో వరల్డ్ కప్  ప్రోమోను వదిలింది.  1975  వన్డే వరల్డ్ కప్ నుంచి  2019 వరకూ విన్నింగ్ మూమెంట్స్,  ఓటములు, ఆటగాళ్ల నైరాశ్యం, అభిమానుల  గుండెకోత,  గెలవాలని మొక్కులు, అభిమాన ఆటగాళ్ల కోసం ప్రార్థనలు.. ఇలా అన్నీ కలగలిపి రూపొందించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. 


‘ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ - 2‌023లో చరిత్ర లిఖించేందుకు,  కలలను సాకారం చేసుకునేందుకు ఒకే ఒక రోజు చాలు..’అన్న  క్యాప్షన్ ఇచ్చి  షారుక్ వాయిస్ ఓవర్‌తో వదిలిన ఈ వీడియోలో టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్‌తో పాటు యువ సంచలనం శుభమన్ గిల్ కూడా  కనిపించారు.   ఇంకా ముత్తయ్య మురళీధరన్, జాంటీ రోడ్స్, జె.పి, డుమిని  వంటి ఆటగాళ్లు  కూడా ఉన్నారు. 


 






ఫ్యాన్స్ రచ్చ.. 


ఈ వీడియోలో షారుక్‌తో వాయిస్ ఓవర్ ఇప్పించడంతో అతడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘ప్రపంచ క్రికెట్‌లో అత్యంత  ప్రాధాన్యత కలిగిన టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు  భారత్‌లో  కింగ్ ఖాన్‌ను మించినవారెవరున్నారు..? ’ అంటూ షారుక్ ఫ్యాన్స్  ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు.  ‘ఇది ఎస్ఆర్‌కె లెగసీ’ అని  కూడా కామెంట్స్ చేస్తున్నారు.  ‘ఐసీసీ కూడా  షారుక్ ఖాన్‌ను గుర్తించిన  తర్వాత ఇంకా చర్చ అనవసరం’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. షారుక్ గతేడాది ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ లాంచ్ సందర్భంగా కూడా  సందడి చేసిన విషయం తెలిసిందే.   ‘పఠాన్’కు ముందు సరిగ్గా హిట్స్ లేక సతమతమైన షారుక్‌కు క్రేజ్ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.  వన్డే వరల్డ్ కప్‌కు షారుక్ ఖాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా చేయాలని వాళ్లంతా ఐసీసీని కోరుతున్నారు.


 






కాగా అక్టోబర్ 5న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్  మధ్య అహ్మదాబాద్ వేదికగా  జరుగబోయే తొలి మ్యాచ్‌తో  మొదలుకాబోయే ఈ టోర్నీ..  నవంబర్  19న ముగియనుంది.  ఈ టోర్నీలో భారత  ప్రపంచకప్ వేట అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో మొదలుకానుంది.   ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న భారత్ - పాక్ మ్యాచ్.. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో జరుగనుంది. 


















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial