PAK vs SL: గతేడాది జులై నెల తర్వాత టెస్టులలో ఒక్క విజయం కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఏడాదికాలం ఆగాల్సి వచ్చింది. 2022లో జులై 20న శ్రీలంకపై తమ చివరి టెస్టును గెలుచుకున్న పాకిస్తాన్.. సరిగ్గా ఏడాది తర్వాత టెస్టులో విజయం సాధించింది. శ్రీలంక పర్యటనకు వచ్చిన పాకిస్తాన్.. గాలె వేదికగా నేడు ముగిసిన తొలి టెస్టులో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 95.2 ఓవర్లలో 312 పరుగులు చేసింది. లంక తరఫున ధనంజయ డి సిల్వ సెంచరీ (122) చేశాడు. పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ డబుల్ సెంచరీ (208) చేయడంతో ఆ జట్టు 121.2 ఓవర్లలో 461 పరుగులకు ఆలౌట్ చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులు వెనుకబడ్డ శ్రీలంక.. రెండో ఇన్నింగ్స్‌లో 279 పరుగులకే ఆలౌట్ అయింది. ధనంజయ (82) మరసారి లంకను ఆదుకున్నాడు. పాక్ బౌలర్ల కృషితో పాకిస్తాన్.. 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది.
భయపెట్టిన జయసూర్య..
ఛేదించాల్సిన లక్ష్యం చిన్నదే అయినా పాకిస్తాన్ టాపార్డర్ తడబడింది. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య.. నాలుగు వికెట్లతో చెలరేగాడు. 133 పరుగుల ఛేదనలో పాకిస్తాన్.. 38 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు.. 48 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయి ఉంది. ఆఖరిరోజు 83 పరుగులు సాధిస్తే విజయం దక్కుతుందన్న దశలో కూడా పాక్ తడబడింది. జయసూర్య.. పాక్ సారథి బాబర్ ఆజమ్ (24) ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన సౌద్ షకీల్ (30) ఆదుకోవడంతో పాకిస్తాన్ గట్టెక్కింది. విజయానికి ముందు షకీల్ కూడా నిష్క్రమించాడు. సర్ఫరాజ్ అహ్మద్ (1) ను కూడా జయసూర్య ఔట్ చేశాడు. కానీ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (50 నాటౌట్) మరో వికెట్ పడకుండా పాకిస్తాన్‌కు విజయాన్ని అందించాడు.
గత జూన్ 20న శ్రీలంకతో గెలవడం పాకిస్తాన్‌కు టెస్టులలో 146వ విజయం కాగా ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచ్‌తో పాటు స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఆడిన మూడు టెస్టులలోనూ ఓడింది. న్యూజిలాండ్‌తో రెండు టెస్టులూ డ్రా అయ్యాయి. సరిగ్గా ఏడాది తర్వాత గెలిచి టెస్టులలో 147వ విజయాన్ని నమోదుచేసింది. కాగా శ్రీలంకపై పాకిస్తాన్‌కు ఇది పదో టెస్టు విజయం. పాక్‌తో లంక 26 టెస్టులు ఆడింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial