Ashes Series 2023: అప్పుడెప్పుడో 2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ ధాటికి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు ఇచ్చిన  ఇంగ్లాండ్  పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. తాజాగా  అంతర్జాతీయ స్థాయిలో కొద్దిమందికే సాధ్యమయ్యే  రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఇంగ్లాండ్  వెటరన్ పేసర్ తాజాగా 600 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో   జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో భాగంగా ట్రావిస్ హెడ్ వికెట్ తీసిన బ్రాడ్..  తన టెస్టు కెరీర్‌లో 600వ వికెట్‌ను దక్కించుకున్నాడు.   టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనతను దక్కించుకున్న  ఐదో బౌలర్‌గా బ్రాడ్ నిలిచాడు. 


ఓల్డ్ ట్రాఫర్డ్ (మాంచెస్టర్) వేదికగా  ఆస్ట్రేలియాతో  నిన్న మొదలైన నాలుగో టెస్టులో భాగంగా  బ్రాడ్ ఈ ఘనతను అందుకున్నాడు.  ఈ క్రమంలో బ్రాడ్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన  ఐదో బౌలర్ బ్రాడ్. ఇంగ్లాండ్ తరఫున  అతడు జేమ్స్ ఆండర్సన్ తర్వాత  రెండో స్థానంలో నిలిచాడు. 


టెస్టు క్రికెట్‌లో టాప్ - 6 వికెట్ల వీరులు : 


- ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) : 133 టెస్టులలో 800 వికెట్లు 
- షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) : 145 టెస్టులలో 708 వికెట్లు 
- జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్) : 182 టెస్టులలో 688 వికెట్లు 
- అనిల్ కుంబ్లే (ఇండియా) : 132 టెస్టులలో 619 వికెట్లు 
- స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్) : 166 టెస్టులలో 600 వికెట్లు
- గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) : 124 టెస్టులలో 519 వికెట్లు 


స్వదేశంలోనే సగానికంటే ఎక్కువ.. 


హెడ్ వికెట్ తీయడం ద్వారా బ్రాడ్.. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. బ్రాడ్‌కు ఇది ఇంగ్లాండ్‌లో 394వ వికెట్. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్.. 493 వికెట్లు తీయగా.. ఆండర్సన్  432 వికెట్లు పడగొట్టాడు. 


యాషెస్‌లో మూడో బౌలర్.. 


సుదీర్ఘ చరిత్ర కలిగిన యాషెస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో  బ్రాడ్.. ఇంగ్లాండ్ దిగ్గజం ఇయాన్ బోథమ్‌ను అధిగమించి మూడో స్థానంలో నిలిచాడు.  ఈ జాబితాలో షేన్ వార్న్ 195 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. గ్లెన్ మెక్‌గ్రాత్.. 157 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. బ్రాడ్ 149 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. బోథమ్ 148 వికెట్లు పడగొట్టాడు. 


 






గత మూడేండ్లలోనే  167 వికెట్లు.. 


2019 నుంచి  42 టెస్టులు ఆడిన బ్రాడ్.. ఏకంగా  167 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచంలో మరే బౌలర్ కూడా  ఇన్ని వికెట్లు తీయలేదు. సగటున  ప్రతి 48 బంతులకు  బ్రాడ్ ఒక వికెట్ పడగొట్టడం గమనార్హం. 


తొలి రోజు ఇంగ్లాండ్‌దే.. 


లీడ్స్‌ టెస్టు గెలుచుకున్న తర్వాత ఇంగ్లాండ్  మాంచెస్టర్‌లో కూడా అదే జోరు చూపిస్తోంది.  నిన్న మొదలైన  టెస్టులో టాస్ గెలిచి ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన  ఇంగ్లాండ్..  తమ బౌలింగ్‌తో కంగారూలను కంగారెత్తించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్.. 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి  299  పరుగులు చేసింది.  మిచెల్ మార్ష్ (51), మార్నస్ లబూషేన్ (51), ట్రావిస్ హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41) రాణించినా  ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్.. నాలుగు వికెట్లు తీయగా  బ్రాడ్ రెండు వికెట్లు తీశాడు.   వుడ్, మోయిన్ అలీకి ఒక వికెట్ దక్కింది.
















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial