India vs Pakistan: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వర్యంలో  కొలంబో (శ్రీలంక) వేదికగా జరుగుతున్న ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ - 2‌023 టోర్నీలో  భాగంగా  భారత్ ‘ఎ’ - పాకిస్తాన్ ‘ఎ’ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కుర్రాళ్లు అదరగొట్టారు. పాకిస్తాన్‌ను తొలుత బ్యాటింగ్‌లో నిలువరించడమే గాక.. ఆ జట్టు నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించారు. భారత యువ పేసర్ రాజ్‌వర్ధన్  హంగర్గేకర్.. ఐదు వికెట్లతో చెలరేగి పాక్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. భారత్ ఏ తరఫున సాయి సుదర్శన్ (110 బంతుల్లో 104 నాటౌట్, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో భారత్‌కు ఘనవిజయాన్ని అందించాడు.


హంగర్గేకర్ కేక.. 


కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా  జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.   స్కోరు బోర్డుపై పది పరుగులు కూడా చేరకముందే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. తాను వేసిన నాలుగో ఓవర్లో ఓవర్లో హంగర్గేకర్.. ఓపెనర్ సయీమ్ అయూబ్ (0)తో పాటు  ఓమైర్ యూసుఫ్ (0) ను ఔట్ చేశాడు.  36 బంతుల్లో 35 పరుగులు చేసిన  ఓపెనర్ సహిబ్జద ఫర్హాన్‌ను పార్ట్ టైమ్ స్పిన్నర్ రియాన్ పరాగ్ వెనక్కి పంపాడు.  టాపార్డర్ విఫలం కావడంతో  హసీబుల్లా ఖాన్ (27) జట్టును ఆదుకునే యత్నం చేశాడు. కానీ భారత బౌలర్లు  క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో పాకి్తాన్ 26 ఓవర్లలో 96 పరుగులకు ఆరు వికెట్లు కోల్పయింది. 


ఈ క్రమంలో ఖాసిమ్ అక్రమ్ (63 బంతుల్లో 48, 5 ఫోర్లు), ముబాసిర్ ఖాన్ (26 బంతుల్లో 25 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్)లు  ఆదుకోవడంతో  ఆ జట్టు  200 మార్కును దాటింది. పాక్ ఇన్నింగ్స్‌ను మొదట్లోనే దెబ్బకొట్టిన హంగర్గేకర్.. ఆఖర్లో కూడా లోయరార్డర్ తోకను  త్వరగా కత్తిరించాడు. అతడు  8 ఓవర్లు బౌలింగ్ చేసి 42 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. మానవ్ సుతార్ మూడు వికెట్లు తీయగా నిశాంత్ సింధు, రియాన్ పరాగ్‌లు తలా ఒక వికెట్ తీశారు. 


సాయి సూపర్ ఇన్నింగ్స్.. 


స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  భారత్ దూకుడుగా ఆడింది. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడే  తమిళనాడు యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కు తోడు సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఆడే అభిషేక్ శర్మ‌ (28 బంతుల్లో 20, 4 ఫోర్లు) లు తొలివికెట్‌కు 58 పరుగులు జోడించారు.  అభిషేక్ నిష్క్రమించినా  వన్ డౌన్ బ్యాటర్ నికిన్ జోస్‌ (64 బంతుల్లో 53, 7 ఫోర్లు) తో కలిసి  సాయి.. భారత జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆడుతున్నది తొలి మ్యాచ్ అయినా.. ప్రత్యర్థి పాకిస్తాన్ అయినా బెదరకుండా సాయి సుదర్శన్  పాక్ బౌలింగ్‌‌ను సమర్థంగా ఎదుర్కున్నాడు. ఈ ఇ్దదరూ రెండో వికెట్‌కు  99  పరుగులు జోడించారు. మెహ్రన్ ముంతాజ్ వేసిన  30వ ఓవర్లో రెండో బంతికి నికిన్.. స్టంపౌట్ అయ్యాడు.  ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సారథి యశ్ ధుల్ (19 బంతుల్లో 21 నాటౌట్,  2 ఫోర్లు, 1 సిక్స్) మరో వికెట్ పడకుండా  ఆడాడు.  ఆట 37వ ఓవర్లో సాయి.. 4, 6, 6 తో సెంచరీ చేసుకోవడమే గాక  భారత్ విజయాన్ని కూడా సాయి పూర్తి చేశాడు. 


 



















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial