Asia Cup 2023 Schedule: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ - 2023 షెడ్యూల్ వచ్చేసింది. పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా హైబ్రిడ్ మోడల్‌లో జరుగబోయే ఈ మెగా టోర్నీ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సిద్ధమైంది. ఏసీసీ అధ్యక్ష హోదాలో జై షా ఈ షెడ్యూల్‌ను తన ట్విటర్ ఖాతా వేదికగా పంచుకున్నాడు. ఈ టోర్నీలో భాగంగా నాలుగు మ్యాచ్‌లకు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుండగా 9 మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి.
ఆరు జట్లు పాల్గొనబోయే ఈ మెగా టోర్నీలో వాటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ - ఏలో శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లు ఉండగా గ్రూప్ - బిలో ఇండియా, పాకిస్తాన్, నేపాల్ ఉన్నాయి. టోర్నీ ప్రారంభమయ్యేది పాకిస్తాన్‌లోనే అయినా సూపర్ ఫోర్, ఫైనల్ మాత్రం శ్రీలంకలో జరుగుతాయి.
షెడ్యూల్ ఇదే..
ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా ఆతిథ్య పాకిస్తాన్.. నేపాల్‌తో మ్యాచ్ ద్వారా ఈ టోర్నీ అధికారికంగా ప్రారంభం కానుంది. మరుసటి రోజు శ్రీలంకలోని క్యాండీ వేదికగా బంగ్లాదేశ్ - శ్రీలంక తలపడతాయి. పాకిస్తాన్‌లో జరిగే నాలుగు మ్యాచ్‌లలో బాబర్ ఆజమ్ సేన ఆడేది ఒక్క మ్యాచ్ మాత్రమే కావడం గమనార్హం. సెప్టెంబర్ 3న లాహోర్‌లో బంగ్లా - అఫ్గాన్ మ్యాచ్ జరుగనుండగా ఐదున ఇదే వేదికలో శ్రీలంక.. అఫ్గాన్‌తో తలపడనుంది. సూపర్ - 4 దశలో కూడా తొలి మ్యాచ్ ఇక్కడే (సెప్టెంబర్ 6న) జరగాల్సి ఉంది. అయితే.. పాకిస్తాన్‌లో ముందు వరుసగా నాలుగు మ్యాచ్‌లు నిర్వహించి ఆ తర్వాత టోర్నీ లంకకు షిఫ్ట్ అవుతుందిన గతంలో వార్తలు వచ్చినా రెండు దేశాలలో ఒకేసారి టోర్నీ జరిపేందుకు ఏసీసీ ఆమోదముద్ర వేసింది.
ఇక టోర్నీలో అత్యంత ప్రాధాన్యం కలిగిన భారత్ - పాక్ మ్యాచ్.. సెప్టెంబర్ 2న క్యాండీ వేదికగా జరుగనుంది. రౌండ్ - 1లో భాగంగా భారత్.. సెప్టెంబర్ 4న నేపాల్‌తో తలపడనుంది. లీగ్ దశలో టాప్ - 2 టీమ్స్ సూపర్ - 4కు చేరతాయి. సూపర్ - 4లో ఒక్కో జట్టు తమ గ్రూపులోని మిగతా జట్టుతో పాటు రెండో గ్రూపులోని టాప్ - 2 జట్లతో తలపడుతుంది. దీని ప్రకారం చూస్తే.. భారత్ - పాక్‌లు సెప్టెంబర్ 10న మరోమారు తలపడే అవకాశం ఉంటుంది.
కాగా హైబ్రిడ్ మోడల్‌లో ఈ టోర్నీ జరుగుతున్నందున ఈసారి షెడ్యూల్‌లో.. గ్రూప్ స్టేజ్‌లోని టీమ్స్‌కు ఏ1, ఏ2. ఏ3.. బీ1, బీ2, బీ3 అని నెంబర్లు కేటాయించారు. దీని ప్రకారం పాక్‌కు ఏ1, భారత్‌కు ఏ2, నేపాల్‌కు ఏ3గా కేటాయించారు. ఒకవేళ నేపాల్ గనక సూపర్-4కు అర్హత సాధిస్తే గ్రూప్ స్టేజ్‌లో నిష్క్రమించిన జట్టు స్థానాన్ని ఆ జట్టుకు కేటాయిస్తారు. ఇక సూపర్ - 4లో టాప్ - 2 టీమ్స్ ఫైనల్స్ కు వెళ్తాయి. సూపర్ - 4 మ్యాచ్‌లు క్యాండీ, కొలంబోలలో జరుగుతాయి. సెప్టెంబర్ 17న ఫైనల్ జరుగనుంది. ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తే దాయాదుల సమరాన్ని మూడు వారాల వ్యవధిలోనే మూడు సార్లు చూసే అవకాశం ఉండనుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial