IND W vs BAN W 2nd ODI: తొలి వన్డేలో తమకు ఎదురైన పరాభవానికి భారత మహిళల జట్టు.. బంగ్లాదేశ్‌పై ప్రతీకారం తీర్చుకుంది. టీమిండియా వెటరన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (78 బంతుల్లో 86, 9 ఫోర్లు) బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో (3.1 ఓవర్లలో 3 పరుగులిచ్చి 4 వికెట్లు) కూడా రాణించడంతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 120 పరుగులకే ఆలౌట్ అయింది.
రాణించిన హర్మన్‌ప్రీత్, జెమీమా
ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఆహ్వానం మేరకు భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి వన్డేలో మాదిరిగానే ఓపెనర్ ప్రియా పునియా (7) మరోసారి విఫలమైంది. మంగళవారమే బర్త్ డే జరుపుకున్న స్మృతి మంధాన (58 బంతుల్లో 36, 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. వన్ డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా (23 బంతుల్లో 15, 3 ఫోర్లు) కూడా విఫలమైంది. 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 52, 3 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 131 పరుగులు జోడించారు. చివర్లో హర్లీన్ డియోల్ (36 బంతుల్లో 25) త్వరగా పరుగులు చేయడంలో విఫలమైంది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్.. 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
కుప్పకూలిన బంగ్లా..
మోస్తారు లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్లు ముర్షిదా ఖాన్ (12), షర్మిన్ అక్తర్ (2)లతో పాటు లతా మొండల్ (9) కూడా విఫలమైంది. అయితే నాలుగో వికెట్‌కు ఫర్గన హాక్ (81 బంతుల్లో 47, 5 ఫోర్లు), రితూ మోని (46 బంతుల్లో 27, 3 ఫోర్లు) కలిసి నాలుగో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. 28 ఓవర్లకు 105-5 గా ఉన్న బంగ్లా.. 15 పరుగుల తేడాతో ఏడు వికెట్లను కోల్పోయింది.
ఫర్గనను దేవికా ఔట్ చేసి బంగ్లా పతనాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత రోడ్రిగ్స్.. రితూ మోనీని పెవిలియన్‌కు పంపింది. కెప్టెన్ నైగర్ సుల్తానా (1) తో పాటు లోయరార్డర్ బ్యాటర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు. జెమీమా వరుస ఓవర్లలో నాలుగు వికెట్లు తీసింది. దేవికా కూడా 8 ఓవర్లు వేసి 30 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. దీంతో బంగ్లాదేశ్.. 35.1 ఓవర్లలో 120 పరుగులకే చాపచుట్టేసింది. ఈ విజయంతో భారత్.. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి వన్డేలో బంగ్లాదేేశ్ గెలిచిన విషయం తెలిసిందే. సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే ఈ నెల 22న ఇదే వేదికపై జరుగనుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial