IPL: కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్ - 16 సీజన్ తర్వాత ఫ్రాంచైజీలు తమ జట్లలో కీలక మార్పులు  చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆటగాళ్ల మార్పు, మినీ వేలానికి ఇంకా టైమ్ ఉన్నా టీమ్స్‌ను ముందుండి నడిపించే హెడ్‌కోచ్‌లను మార్చేందుకు  రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.  ఇప్పటికే  లక్నో సూపర్ జెయింట్స్ హెడ్‌కోచ్ ఆండీ ఫ్లవర్‌ను తొలగించి జస్టిన్ లాంగర్‌ను నియమించుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో మూడు ఫ్రాంచైజీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. 


అతడి కోసం ఆ రెండు ఫ్రాంచైజీలు.. 


లక్నోను రెండుసార్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు  చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఆండీ ఫ్లవర్‌ను లక్నో వదులుకున్నా అతడిని నియమించుకునేందుకు  మరో రెండు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయి. రాజస్తాన్ రాయల్స్‌తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా  ఆండీ ఫ్లవర్  కోసం పోటీ పడుతున్నాయి.  ఈ మేరకు ఇరు జట్ల ప్రతినిధులూ ఆయనతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తున్నది.


లారాకు గుడ్ బై..!


గత సీజన్‌లో  సన్ రైజర్స్‌కు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా హెడ్‌కోచ్ గా ఉన్నాడు.  కానీ  2023 సీజన్‌లో సన్ రైజర్స్.. నాలుగు  మ్యాచ్‌లు మాత్రమే గెలిచి  పాయింట్ల పట్టికలో  అట్టడుగు స్థానంలో నిలిచింది.  లారా  కోచింగ్ స్టైల్ మీద  సన్ రైజర్స్ కూడా  అసంతృప్తిగా ఉంది. దీంతో  వచ్చే సీజన్‌లో కొత్త  కోచ్‌ను నియమించుకోవాలని సన్ రైజర్స్ భావిస్తోంది.


 






రాజస్తాన్‌ కూడా.. 


ఐపీఎల్ - 15లో ఫైనల్‌కు చేరిన  రాజస్తాన్ రాయల్స్.. గత సీజన్‌లో మాత్రం  లీగ్ దశలోనే వెనుదిరిగింది.  ఆ జట్టుకు  డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్న కుమార సంగక్కరనే హెడ్‌కోచ్ గా కూడా వ్యవహరించాడు.  అయితే వచ్చే ఏడాది సంగక్కరను  డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గానే ఉంచుతూ హెడ్‌కోచ్‌గా  ఆండీ ఫ్లవర్‌ను నియమించుకోవాలని  చూస్తోంది.  


 






వాళ్లిద్దరినీ వదులుకోనున్న ఆర్సీబీ.. 


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)  కూడా ఆ జట్టు హెడ్ కోచ్ సంజయ్ బంగర్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సెన్‌లకు గుడ్ బై చెప్పనుందన్న వార్తలు వస్తున్నాయి. ఏబీడివిలియర్స్‌ను  హెడ్‌కోచ్‌గా నియమించే అవకాశాలున్నాయి. 


ఇవేగాక ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా తమ హెడ్‌కోచ్‌లను మార్చే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. రాబోయే కొద్దిరోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత రానున్నది. ఢిల్లీకి రికీ పాంటింగ్‌ను తప్పించి సౌరవ్ గంగూలీని కోచ్‌గా నియమిస్తారని  ప్రచారం జరుగుతుండగా.. కేకేఆర్‌లో చంద్రకాంత్ పాటిల్ స్థానంలో గౌతం గంభీర్‌ను నియమించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 










ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial