ODI WC 2023: ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆగస్టు మాసాంతం నుంచి వన్డే వరల్డ్ కప్ సన్నాహకాలను ప్రారంభించనుంది. ఆగస్గు చివరివారంలో ఆసియా కప్ మొదలుకానుండగా.. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఉంది. ఇది ముగిశాక భారత జట్టు.. స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఆడనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే జట్లు ఇదివరకే తుది కసరత్తులు చేస్తుండగా టీమిండియా మాత్రం ఇంకా కూర్పు ఎలా ఉండాలన్నదానిపై ఆపసోపాలు పడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ.. భారత హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలకు కీలక సూచన చేశాడు.
వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ను ఆడించాలని.. ఇలా చేస్తే ఓపెనింగ్‌లో రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ బాగా వర్కవుట్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. జైస్వాల్ టెక్నిక్ కూడా బాగుందని దాదా అన్నాడు.
గంగూలీ మాట్లాడుతూ...‘తొలి టెస్టులో సెంచరీ చేయడం ఎప్పటికీ చాలా స్పెషల్‌గా ఉంటుంది. జైస్వాల్ బ్యాటింగ్ టెక్నిక్ కూడా బాగుంది. టీమ్‌లో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ ఉండటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అతడిని వరల్డ్ కప్‌లో ఆడించడం టీమ్‌కు చాలా అవసరం..’అని వ్యాఖ్యానించాడు.
అదే అసలు సమస్య
వాస్తవానికి వన్డే వరల్డ్ కప్ ఆడబోయే కోర్ టీమ్ (20) ను ఇదివరకే సిద్ధం చేసింది. ఇందులో పేర్లు ప్రకటించకపోయినా ఈ టీమ్‌లో పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారు. కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, జస్ప్రిత్ బుమ్రా, రిషభ్ పంత్‌లు ఎన్సీఏకే అంకితమయ్యారు. వీళ్లు జట్టులోకి తిరిగి ఎప్పుడు వస్తారనేది ఇంకా స్పష్టత రావడం లేదు. మరోవైపు జట్టు కూర్పు కూడా టీమ్ మేనేజ్‌మెంట్‌కు సవాల్‌గా మారింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి వన్డేలలో ఓపెనర్‌గా ప్రమోట్ అయిన శుభ్‌మన్ గిల్.. ఇప్పటివరకైతే స్వదేశంలో ఆకట్టుకున్నాడు. రోహిత్‌కు అతడు సరైన జోడీ అనిపించుకున్నాడు.
కానీ రోహిత్‌తో పాటు గిల్ కూడా రైట్ హ్యాండ్ బ్యాటరే. ఈ ఇద్దరే కాదు.. టీమ్‌లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, రాహుల్.. వీళ్లంతా కుడి చేతి వాటం బ్యాటర్లే. రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు వచ్చేవరకూ ఒక్క ఎడం చేతి వాటం బ్యాటర్ కూడా లేడు. ఇది టీమ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ లోటును పూడ్చటానికి భారత జట్టుకు యశస్వి జైస్వాల్‌తో పాటు ఇషాన్ కిషన్ రూపంలో కూడా రెండు ఆప్షన్స్ ఉన్నాయి.
యశస్వినే కరెక్ట్..
వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనబోయేది ఎవరన్న సంగతి ఇంకా తెలియకపోయినా జైస్వాల్ అయితే తన రోల్‌కు న్యాయం చేయగలడన్న వాదనను మాజీ క్రికెటర్లు కూడా వినిపిస్తున్నారు. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో అతడి ఆటతీరు చూశాక చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వినిపించారు. ఐపీఎల్‌లో దూకుడుగా ఆడే యశస్వి.. దేశవాళీ, జాతీయ జట్టుకు తగ్గట్టుగా తన ఆటను మార్చుకుంటూ పరిస్థితులను బేరీజు వేసుకుని ఆడుతుండటం అందరినీ ఆకర్షిస్తున్నది.
కాగా.. జైస్వాల్‌ను టెస్టులకు ఎంపిక చేసిన సెలక్టర్లు.. వన్డే టీమ్‌లోకి మాత్రం తీసుకోలేదు. అంతేగాక అతడు వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోవడం అనుమానమే. జైస్వాల్.. ఆసియా క్రీడల్లో పాల్గొనబోయే భారత జట్టులో ఆడనున్నాడు. ద్వితీయ శ్రేణి టీమ్‌తో బరిలోకి దిగుతున్న ఈ పోటీలలో ఆడబోయే ఆటగాళ్లకు వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనే అవకాశాలు లేవు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial