Prithvi Shaw: అండర్ - 19 వరల్డ్ కప్ గెలిచి ఆ తర్వాత 20 ఏండ్లకే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ముంబై బ్యాటర్ పృథ్వీ షాను కొత్తలో వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చారు. మరో సచిన్ అయ్యే లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయన్న వాదనలు వినిపించినా తర్వాత అతడు ఫామ్ కోల్పోయి ఇప్పుడు టీమిండియాలో ప్లేస్ కోసం నానా తంటాలు పడుతున్నాడు. వెస్టిండీస్‌తో త్వరలో జరుగబోయే వన్డే, టీ20 సిరీస్‌తో పాటు ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన టీమ్‌లో సైతం అతడికి ఛాన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో పృథ్వీ షా తన కెరీర్, అవకాశాలు రాకపోవడంతో మానసికంగా కుంగుబాటుకు లోనైన దానిపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఎందుకు తీసేశారో తెలిసేది కాదు..
క్రిక్ బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ షా మాట్లాడుతూ... ‘నన్ను జట్టులోకి ఎంపిక కానప్పుడు అసలు సెలక్టర్లు నన్ను ఎందుకు పక్కనబెడుతున్నారో అర్థమయ్యేది కాదు. కొంతమంది నా ఫిట్నెస్ సమస్య అని చెప్పారు. కానీ నేను బెంగళూరు (ఎన్సీఏ)కు వెళ్లి అక్కడ ఫిట్నెస్ పరీక్షలన్నీ పాసయ్యాను. దేశవాళీలో పరుగులు చేశాను. ఎట్టకేలకు టీ20 టీమ్‌లోకి తీసుకున్నా వెస్టిండీస్ సిరీస్‌లో మాత్రం మళ్లీ పక్కనబెట్టారు. ఈ నిర్ణయంతో నేను చాలా నిరాశచెందా. కానీ నేను ఈ విషయంలో ఏమీ చేయలేను.. ఎవరితోనూ పోరాడలేను..’ అని చెప్పాడు.
ఒంటరిగా బతుకుతున్నా..
జాతీయ జట్టులోకి ఎంపిక కానప్పుడు నిరాశకు గురయ్యానన్న షా.. తన క్రికెట్ జర్నీలో మెంటల్ హెల్త్‌ను కాపాడుకోవడానికి ఒంటరిగా జీవించేందుకు అలవాటుపడుతున్నానని అన్నాడు. ‘ఒక వ్యక్తిగా నేను నా సొంత స్పేస్‌లో ఉండాలనుకుంటున్నా. చాలా మంది నా గురించి చాలా విషయాలు చెబుతారు. కానీ వాళ్లను నాకు ఏం తెలుసు..? నేను ఎలా ఉంటానో ఏం తెలుసు.. నాకు స్నేహితులు లేరు. కొత్తవారిని కూడా చేసుకోవడానికి ఇష్టపడను. మన ఆలోచనలను బయటకు చెప్పుకోవాలన్న భయంగా ఉంది. ఎవరితో అయినా ఏమైనా చెప్దామనుకుంటే దాని వల్ల ఏ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయం వేస్తోంది. నాకు అత్యంత నమ్మకస్తులని నమ్మిన స్నేహితులకు కూడా ఏదైనా విషయం చెబితే అది మరుసటి రోజు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది’అని తెలిపాడు.
‘నేను బయటకు వెళ్తే చాలామంది నా గురించి ఏదో ఊహించుకుని సోషల్ మీడియాలో ఏదేదో రాసేస్తున్నారు. అందుకే నేను ఇంటి నుంచి కాలు బయటపెట్టకూడదని అనుకున్నా. ఒకవేళ ఎప్పుడైనా నేను బయటకు వెళ్దామనుకున్నా ఒంటరిగానే వెళ్తున్నా. నేను బయటకు వెళ్లినప్పుడల్లా సమస్యలు నన్ను చుట్టుముడుతున్నాయి. డిన్నర్, లంచ్‌లకు కూడా ఒక్కడినే వెళ్తున్నా...’అని వివరించాడు.
వెస్టిండీస్‌తో పాటు ఆసియా క్రీడల్లో కూడా తన పేరు లేకపోవడంతో పృథ్వీ షా.. తన ఆటను మెరుగుపరుచుకునేందుకు సన్నద్దమవుతున్నాడు. ఇందులో భాగంగానే దేశవాళీలో జరిగే దేవదార్ ట్రోఫీని వీడి.. ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. కౌంటీలలో అతడు నార్తంప్టన్‌షైర్ తరఫున ఆడతాడు. మరి కౌంటీ క్రికెట్ అయినా పృథ్వీ కెరీర్‌ను గాడిన పెడుతుందో వేచి చూడాలి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial