Dhoni Bike Collection: భారత క్రికెట్ జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనికి బైకులంటే అమితమైన ఇష్టమన్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో తాను భారత జట్టుకు కొత్తగా ఎంట్రీ ఇచ్చినప్పుడు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుగా వచ్చిన బైకులో యువరాజ్‌ను వెనకాల ఎక్కించుకుని తిరిగినప్పుడే ఈ విషయాన్ని ధోని స్పష్టం చేశాడు. ధోని వద్ద పాతకాలం బైకుల నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చే హైఎండ్ మోడల్ బైక్స్ వరకూ అన్నీ ఉన్నాయి. ఈ విషయాన్ని టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ స్వయంగా వీడియో తీసి మరీ అభిమానులకు చూపించాడు.
ఇటీవలే భారత మాజీ క్రికెటర్ సునీల్ జోషీతో కలిసి రాంచీకి వెళ్లిన వెంకటేశ్ ప్రసాద్.. ధోనిని ఫామ్ హౌస్‌లో కలుసుకున్నాడు. ఈ సందర్భంగా వెంకటేశ్ ప్రసాద్.. ధోని బైక్ షో రూమ్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. ఏదైనా ఒకదానిమీద ప్యాషన్ ఉండటాన్ని తాను గతంలో కూడా చాలా మందిలో చూశాగానీ మరి ఇంత అభిరుచి ఉండటం ఇదే మొదటిసారని ట్విటర్‌లో వీడియో పోస్ట్ చేస్తూ రాసుకొచ్చాడు.
ప్రసాద్ ట్విటర్‌లో.. ‘ఒక వ్యక్తిలో ఇంత క్రేజీ ఫ్యాషన్‌ను చూడటం నేను ఇదే మొదటిసారి. వాట్ ఎ కలక్షన్ అండ్ వాట్ ఎ మ్యాన్ ఎంఎస్‌డీ. గొప్ప సాధకుడు, నమ్మశక్యం కాని వ్యక్తి. తన రాంచీ హౌస్‌లో తన కార్లు, బైకులకు సంబంధించి ఇది జస్ట్ గ్లింప్స్ వంటిదే. వీటి పట్ల అతడి అభిరుచి చూశాక నాకైతే మతిపోయింది..’అని రాసుకొచ్చాడు.
ఇక ఈ వీడియోను ధోని సతీమణి సాక్షి సింగ్ చిత్రీకరించింది. వీడియోలో ఆమె వెంకటేశ్ ప్రసాద్‌తో.. ‘మీరు రాంచీకి రావడం ఇదే మొదటిసారా..? మీరు ఏం చెబుతారు..?’ అని అడగ్గా.. ‘అమేజింగ్, నేను రాంచీకి రావడం ఇది నాలుగోసారి. కానీ ఇక్కడి (ధోని ఇంటికి) రావడం ఇదే మొదటిసారి. ఈ ప్లేస్ చాలా క్రేజీగా ఉంది’అని చెప్పాడు. సునీల్ జోషి స్పందిస్తూ.. ‘నేను కూడా రాంచీకి రావడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. కానీ ఈ లెజెండ్ (ధోనిని చూపుతూ) దగ్గరికి రావడం మాత్రం ఇదే తొలిసారి. ఈ ప్లేస్ గురించి ఏం చెప్పాలో నాకు మాటలు రావడం లేదు..’అని అన్నాడు.
ఆ తర్వాత వెంకటేశ్ ప్రసాద్ బైకులను చూస్తూ.. ‘వాస్తవానికి ఇది ఓ బైక్ షో రూమ్‌లా ఉంది. ఇంతటి ప్యాషన్ ఉండటం కూడా చాలా కష్టం. నేను చెబుతున్నా, ఒక వ్యక్తికి పిచ్చి ఉంటే తప్ప ఇంత సెటప్ చేయలేరు’ అని అన్నాడు. అప్పుడు సాక్షి కూడా.. ‘అవును, ఇది కచ్చితంగా పిచ్చే అని నేను కూడా చెబుతాను..’ అని చెప్పింది. సాక్షి ధోనిని ‘ఎందుకు మహి ఎందుకు..? ఇన్ని బైకులు అవసరమా చెప్పు..?’అని ప్రశ్నించింది. దానికి ధోని స్పందిస్తూ.. ‘మరి ఏం చేయమంటావ్.. నా అనుకున్న ప్రతీది నువ్వు తీసేసుకుంటున్నావ్. నాకంటూ నా సొంతానికి ఏదైనా కలిగిఉండాలి కదా..’అని నవ్వుతూ రిప్లై ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ధోనికి బైకులంటే పిచ్చి అన్న సంగతి తెలుసు గానీ ఈ స్థాయిలో అతడు బైకులను మెయింటెన్ చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. కవాసకీ, కాన్ఫడరెట్, హార్లీ డేవిడ్‌సన్, డుకాటి, యమహా, సుజూకీ, నోర్టాన్ వంటి టాప్ మోడల్ బైక్స్‌తో పాటు పాతకాలపు నాటి మోపెడ్స్ కూడా ధోని గ్యారేజ్‌లో ఉన్నాయి. బైకులతో పాటు కార్లు, పాతకాలపు జీపులు కూడా ధోని గ్యారేజ్‌లో కొలువుదీరాయి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial