Asia Cup 2023 Schedule: చర్చోపచర్చలు, వాదోపవాదాలు, అలకలు, అవమానాలు, బెదిరింపులు, బహిష్కరణ హెచ్చరికల నడుమ గడిచిన ఏడెనిమిది నెలలుగా  భారత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య రావణకాష్టంలా రగిలిన ఆసియా కప్‌లో  నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. హైబ్రిడ్ మోడల్‌లో జరుగోబయే ఈ టోర్నీలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు జకా అష్రఫ్.. నేటి రాత్రి 7.45 గంటలకు ఆసియా కప్ - 2023 షెడ్యూల్‌ను విడుదల చేయనున్నాడు.  ఆగస్టు 31 నుంచి   సెప్టెంబర్ 17 వరకూ  పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా జరుగబోయే ఈ మెగా టోర్నీకి  కౌంట్ డౌన్ మొదలుకానుంది. 


ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోలో వచ్చిన సమాచారం మేరకు.. జకా అష్రఫ్ బుధవారం రాత్రి 7.45 గంటలకు  ఆసియా కప్ షెడ్యూల్‌ను విడదుల చేయనున్నాడని  పీసీబీ  ప్రతినిధి ఒకరు వెల్లడించాడు. పాకిస్తాన్‌లో నాలుగు,  శ్రీలంకలో 9 మ్యాచ్‌లు ఆడబోయే ఈ టోర్నీలో.. స్వదేశంలో బాబర్ ఆజమ్ సేన, తమ తొలి మ్యాచ్‌ను నేపాల్‌తో ఆడనుంది.  


పాకిస్తాన్ లోని లాహోర్, ముల్తాన్‌లలో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలు  మ్యాచ్‌లు ఆడతాయి. ఈ మ్యాచ్‌లు ముగిశాక టోర్నీ  శ్రీలంకకు షిఫ్ట్ అవనుంది.  ఇక్కడ భారత్ - పాక్ మ్యాచ్‌లతో పాటు మిగిలిన టోర్నీని నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం.. ఆరు దేశాలు పాల్గొనబోయే ఈ టోర్నీ మూడు దశల్లో జరుగనుంది. లీగ్ దశలో టాప్ - 2 టీమ్స్  సూపర్ - 4 కు  అర్హత సాధిస్తాయి.  ఈ దశలో టాప్-2లో ఉన్న జట్లు  ఫైనల్‌ ఆడతాయి.  


 






భారత్ - పాక్ మ్యాచ్.. 


అధికారిక షెడ్యూల్  ఇంకా విడుదల కాకున్నా  భారత్, పాక్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 2, 9వ తేదీలలో  జరిగే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.   శ్రీలంకలోని క్యాండీ లేదా  దంబుల్లాలో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నట్టు  పీసీబీ వర్గాల సమాచారం.  


 






రెండు గ్రూపులు.. 


ఆసియా కప్ - 2023లో పాల్గొనబోయే ఆరు దేశాలను రెండు గ్రూపులుగా విభజించారు.  గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్తాన్, నేపాల్ ఉండగా గ్రూప్ - బీలో  శ్రీలంక,  బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లు ఉన్నాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ (2018లొ చివరిసారి  వన్డే ఫార్మాట్‌లో నిర్వహించినప్పుడు భారత్ విజేత) గా టీమిండియా బరిలోకి దిగనుంది.  


షెడ్యూల్ విడుదలపై  పీసీబీ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ... ‘ఈనెల 15న పాకిస్తాన్ బోర్డు ప్రతినిధులు.. ఏసీసీ అధికారులతో  సమావేశమై షెడ్యూల్ ఫైనలైజ్ చేశారు..’అని తెలిపాడు. ఆతిథ్య దేశంగా ఉన్న తమకు మరిన్ని మ్యాచ్‌లు కావలని కొన్నిరోజుల వరకూ పేచీ పెట్టిన పీసీబీ.. ఎట్టకేలకు ఏసీసీ నిర్ణయానికి అంగీకారం తెలిపి షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. 








ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial