Andre Russell: వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రూ రసెల్ ఆ జట్టు క్రికెట్ బోర్డుకు బంపరాఫర్ ఇచ్చాడు. 2024లో తమ దేశంతో పాటు యూఎస్‌లో జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు తాను ఉత్సాహంగా ఉన్నానని, దానికి అవకాశమిస్తే తాను నిత్యం ఆడే క్రికెట్ లీగ్‌ల నుంచి తప్పుకోవడానికి కూడా రెడీగా ఉన్నట్టు విండీస్ బోర్డుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు.
కరేబియన్ జట్టు గెలిచిన రెండు టీ20 ప్రపంచకప్‌లలో ఆండ్రూ రసెల్ కీలకపాత్ర పోషించాడు. అంతర్జాతీయ స్థాయిలో వెస్టిండీస్ తరఫున రసెల్ 67 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 741 పరుగులు చేసి 39 వికెట్లు కూడా పడగొట్టాడు. రసెల్ చివరిసారిగా విండీస్ తరఫున దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ప్రాతినిథ్యం వహించాడు. సుమారు 19 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.
అయితే వెస్టిండీస్ తరఫున ఆడకపోయినా రసెల్ మాత్రం నిత్యం ఏదో ఓ చోట జరిగే ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడుతూనే ఉన్నాడు. రెండు నెలల పాటు ఐపీఎల్ ఆడిన రసెల్.. ఇప్పుడు అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)లో ఆడుతున్నాడు. ఎంఎల్‌సీలో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న రసెల్.. ఫ్యూచర్‌లో వెస్టిండీస్ తరఫున ఆడేందుకు తాను ఉత్సాహంగా ఉన్నానని తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వాటిని త్యాగం చేసేందుకూ రెడీ..
రసెల్ మాట్లాడుతూ.. ‘వెస్టిండీస్ తరఫున మళ్లీ ఆడేందుకు నేను రెడీగా ఉన్నాను. వచ్చే వరల్డ్ కప్‌లో నేను భాగస్వామ్యుడిని అవ్వాలనుకుంటున్నా.. జట్టులోకి ఎంపికైతే నేను చాలా సంతోషిస్తా. అయితే వరల్డ్ కప్ వంట మెగా టోర్నీకి నేరుగా ఆడతామంటే కుదరదు. అంతకుముందు కొన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు కూడా నేను రెడీగా ఉన్నా. వరల్డ్ కప్ చేరుకోవాలంటే నేరుగా ఆడటం వీలుకాదని నాక్కూడా తెలుసు. నేను ద్వైపాక్షిక సిరీస్ లు ఆడాలంటే ఫ్రాంచైజీ లీగులను త్యాగం చేయాలని తెలుసు. అందుకు నేను సిద్ధంగానే ఉన్నా. వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌కు ఆడుతూ నావంత తోడ్పాటు అందించడానికి నేను సిద్ధమే.. వచ్చే నెలలో భారత్ - వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ జరగాల్సి ఉంది. ఆ సిరీస్ లో ఆడేందుకు అవకాశమిస్తే నేను ఆడతా. కానీ నాకు దాని గురించి బోర్డు నుంచి ఎవరూ సంప్రదించలేదు. నేనైతే నా పని చేసుకుంటూ పోతున్నా..’అని చెప్పుకొచ్చాడు.
ఎంఎల్‌సీలో హయ్యస్ట్ సిక్స్..
మేజర్ లీగ్ క్రికెట్ లో భాగంగా లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న రసెల్.. సాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ సిక్సర్ బాదాడు. ఈ మ్యాచ్‌లో 26 బంతుల్లోనే 42 పరుగులు చేసిన రసెల్.. 2 బౌండరీలు, 4 భారీ సిక్సర్లు కొట్టాడు. 19వ ఓవర్ తొలి బంతికి రసెల్.. హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో ఏకంగా 108 మీటర్ల సిక్సర్ బాదాడు. ఎంఎల్‌సీలో ఇప్పటివరకూ ఇదే లాంగెస్ట్ సిక్స్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial