ICC Champions Trophy 2025 Latest Updates: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ల మధ్య గత ఆదివారం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లీగ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆరు వికెట్లతో ఈజీగా భారత్ గెలుపొందింది. పాక్ అంటేనే విరుచుకుపడే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో సత్తా చాటడంతో ఈజీ విక్టరీని భారత్ సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో పాక్ ఓడటంపై ఆ జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ వింతైన కారణం చెప్పుకొచ్చాడు. చాలా ఒత్తిడికి లోనై తాము ఈ మ్యాచ్ లో ఓడిపోయామని పేర్కొన్నాడు.
సొంతగడ్డపై జరగుతున్న మెగాటోర్నీలో కనీసం ఒక్క మ్యాచ్ లో కూడా పాక్ గెలుపొందలేక పోయింది. టోర్నీ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగులతో, భారత్ చేతిలో ఆరు వికెట్లతో ఓడిపోయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తో జరిగాల్సిన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. రావల్పిండిలో జరగాల్సిన ఈ మ్యాచ్ ప్రతికూల వాతావరణంతో రద్దయ్యింది. ఈ వేదికపై మ్యాచ్ రద్దు కావడం ఇది రెండోసారి.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ కూడా అంతకుముందు రద్దయ్యింది.
గాయాలతో వెనుకబడ్డాం..
మెగాటోర్నీలో తమ వైఫల్యం వెనకాల ఆ జట్టు కోచ్ అజహర్ మహ్మూద్ కారణాలు తెలిపాడు. ప్రధాన ఆటగాళ్ల వైఫల్యం, ఒత్తిడితోనే తాము విఫలమయ్యామని పేర్కొన్నాడు. ఓపెనర్లు సయ్యూమ్ అయూబ్, ఫఖార్ జమాన్ గాయాలతో దూరం కావడం తమ ప్రణాళికలను దెబ్బ తీసిందని పేర్కొన్నాడు. ఆసీస్, న్యూజిలాండ్, జింబాబ్వేలపై అయూబ్ జోరుగా ఆడాడని, అయితే గాయం కారణంగా తను దూరమవడం తమకు షాక్ లాంటిదని పేర్కొన్నాడు. ఇక సరైన వ్యూహాలు లేకుండా జట్టును ఎంపిక చేయడం, తుదిజట్టు బ్యాటింగ్ లైనప్ పై కూడా పాక్ జట్టుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ను ఓపెనర్ గా ఆడించడం కూడా విమర్శలపాలయ్యింది.
సోషల్ మీడియాలో ట్రోల్స్..
భారీ ఖర్చుతో నిర్వహిస్తున్న మెగాటోర్నీలో పాక్ విఫలం కావడంపై ఆ దేశ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. 19న టోర్నీ ప్రారంభమైందని, 23న టోర్నీ ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కివీస్ తో మ్యాచ్ తో టోర్నీని ఆరంభించిన పాక్.. భారత్ చేతిలో ఓటమితో ఇంటిముఖం పట్టిందని పేర్కొంటున్నారు. ఇక తాము చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటామని, మెగాటోర్నీ ముగిశాక, న్యూజిలాండ్ పర్యటనలో మెరుగైన ప్రదర్శిస్తామని రిజ్వాన్ పేర్కొన్నాడు. ఇక దాయాదుల మధ్య మళ్లీ పోరు జరగాలంటే ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఆగక తప్పదు. భారత్ లో జరిగే ఆసియాకప్ లో ఇరుదేశాలు పోటీపడతాయి. టీ20 ఫార్మాట్ లో జరిగే ఈ టోర్నీ హైబ్రీడ్ మోడల్లో జరుగుతుందని తెలుస్తోంది. అంటే ఈ టోర్నీలో పాక్ ఆడే మ్యాచ్ లు భారత్ లో కాకుండా తటస్థ వేదికపై అంటే శ్రీలంక, దుబాయ్ లో జరిగే అవకాశముంది.