Women's T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్‌(Women's T20 World Cupలో ఆసియా జట్లు శుభారంభం చేశాయి. బంగ్లాదేశ్(BAN), పాకిస్థాన్(PAK) ఘన విజయాలతో పొట్టి ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసి.. శుభారంభం చేశాయి. స్కాట్లాండ్‌(SCO)పై బంగ్లాదేశ్, శ్రీలంక(SL)పై పాకిస్థాన్‌ విజయ దుందుభి మోగించాయి. ఈ రెండు లో స్కోరింగ్ మ్యాచుల్లో బౌలర్లు ఆధిపత్యం చెలాయించడంతో విజయం తేలికైంది.

 


 

స్కాట్లాండ్‌ను చిత్తు చేస్తూ..

స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాట్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్(BAN-W vs SCO-W) బ్యాటింగ్ ఎంచుకుంది. స్కాట్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాకు పరుగులు రావడమే గగనమైపోయింది. స్కాట్లాండ్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 119 పరుగులకే పరిమితమైంది. షతీ రాణి 29 పరుగులు, శోభనా మోస్త్రే 36 పరుగులతో రాణించారు. నిగర్ సుల్తానా 18, ముర్షిదా ఖాతూన్ 12 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లందరూ తక్కువ పరుగులకే పరిమితయ్యారు. స్కాట్లాండ్ బౌలర్లలో రెండు ఓవర్లే బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీసింది. అనంతరం 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌... నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 103 పరుగులకే పరిమితమైంది. దీంతో 17 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. స్కాట్లాండ్  బ్యాటర్లలో సారా బ్రైసీ 49 పరుగులతో అజేయంగా నిలిచినా స్కాట్లాండ్‌ను గెలిపించలేకపోయింది. సారా మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. స్కాట్లాండ్ బ్యాటర్లు ధాటిగా ఆడకపోవడంతో రన్‌రేట్‌ అంతరం భారీగా పెరిగింది. బంగ్లా బౌలర్లలో అందరూ సమష్టిగా రాణించి తమ జట్టును గెలిపించారు.

 

పాక్‌ విజయ కేతనం

మరో మ్యాచులో శ్రీలంకపై పాకిస్థాన్‌(PAK vs SL) విజయం సాధించింది. ఈ లో స్కోరింగ్ మ్యాచులో లంకను కట్టడి చేసిన పాక్...  టీ 20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌... 116 పరుగులకే పరిమితమైంది. పాకిస్థాన్ బ్యాటర్లలో ఫాతిమా సనా 30 పరుగులు, నిదా దర్‌ 23 పరుగులు మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు.  మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. లంక బౌలర్లలో చమరి ఆటపట్టు 3, ఉదేశిక 3, సుగంధిక 3 వికెట్లతో రాణించారు. దీంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లంకను... పాక్ బౌలర్లు హడలెత్తించారు.  సాదియా ఇక్బాల్‌ 3, ఒమైమా 2, నష్రా 2 వికెట్లతో చెలరేగడంతో శ్రీలంక కేవలం 85 పరుగులకే పరిమితమైంది. 20 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసినా.. ఆలౌట్ కాకపోయినా లంక ఏ దశలోనూ లక్ష్యాన్ని సాధించేలా కనిపించలేదు. దీంతో పాక్ 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 


నేడు భారత్ తొలిపోరు

టీ 20 ప్రపంచకప్‌లో భారత్ (India)నేడు తొలి మ్యాచ్‌ ఆడనుంది. బలమైన న్యూజిలాండ్‌(New Zealand )తో అమీతుమీ తేల్చుకోనుంది. రాత్రి 7.30కు మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.