Pakistan Won By 81 Runs Against Netherlands :
హైదరాబాద్: వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ బోణీ కొట్టింది. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో పాక్‌ శుక్రవారం 81 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తుచేసింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ (68; 8 ఫోర్లు), సౌద్‌ షకీల్‌ (52 బంతుల్లో 68; 9 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకాలతో రాణించగా.. మహమ్మద్‌ నవాజ్‌ (39; 4 ఫోర్లు), షాదాబ్‌ ఖాన (32; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌) కీలక పరుగులు చేశారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో బాస్‌ డి లీడ్‌ 4 వికెట్లు పడగొట్టాడు. 


అనంతరం లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్‌ 41 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ విక్రమ్‌జిత్‌ సింగ్‌ (52; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), బాస్‌ డి లీడ్‌ (67; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు. ఈ ఇద్దరు ధాటిగా ఆడటంతో ఒక దశలో నెదర్లాండ్స్‌ 120/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే పట్టు విడవకుండా ప్రయత్నించిన పాక్‌ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి.. నెదర్లాండ్స్‌ను ఆలౌట్‌ చేశారు. పాక్‌ బౌలర్లలో హరీస్‌ రవుఫ్‌ 3, హసన్‌ అలీ రెండు వికెట్లు పడగొట్టారు. 


ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ స్టేడియంలో జరిగిన గత రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదు కాగా.. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో మాత్రం బౌలర్ల హవా కనిపించింది. చిన్న బౌండ్రీ గల మైదానంలో బ్యాటర్లు చెలరేగుతారనుకుంటే.. బౌలర్లు పైచేయి సాధించారు. కాస్త నిలదొక్కుకుంటే పరుగులు చేయడం పెద్ద కష్టం కాదని నెదర్లాండ్స్‌ ప్లేయర్లు సైతం నిరూపించడం కొసమెరుపు. 






సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో మాత్రమే దాయాదులు తలపడుతున్నాయి. ఫలితంగా పాకిస్థాన్‌ జట్టు భారత్‌లో పర్యటించడం లేదు. చివరిసారిగా 2016లో టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు ఇక్కడికి వచ్చిన దాయాది జట్టు మళ్లీ ఏడేళ్ల తర్వాత వన్డే వరల్డ్‌ కప్‌ కోసం భారత్‌లో అడుగుపెట్టింది. నేరుగా హైదరాబాద్‌ చేరుకున్న బాబర్‌ ఆజమ్‌ సేన వార్మప్‌లో భాగంగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో ఇక్కడ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాటర్లు దంచికొట్టిన పాక్‌ సారథి బాబర్‌ ఆజమ్‌.. అసలు మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 5 పరుగులే చేసి పెవిలియన్‌ చేరాడు.


ఓపెనర్లు ఫఖర్‌ జమాన్‌ (12), ఇమామ్‌ ఉల్‌ హక్‌ (15) విఫలం కాగా.. ఇఫ్తిఖార్‌ అహ్మద్‌ (9) ప్రభావం చూపలేకపోయాడు. ఇద్దరు స్పిన్‌ ఆల్‌రౌండర్లను బరిలోకి దింపిన పాకిస్థాన్‌.. బ్యాటింగ్‌లో వాళ్ల సహకారంతో స్కోరు బోర్డుపై మంచి స్కోరు పెట్టగలిగింది. ఆగా సల్మాన్‌తో పోటీపడి తుది జట్టులో చోటు దక్కించుకున్న సౌద్‌ షకీల్‌.. వరల్డ్‌కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు.