నాలుగేళ్లకోసారి జరిగే ఐసీసీ ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ సత్తాచాటేందుకు సిద్ధమయ్యాయి. ధర్మశాల క్రికెట్‌ స్టేడియంలో శనివారం ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌ ఆడనున్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రమాదకర జట్టుగా ఎదుగుతున్న బంగ్లాదేశ్‌.. పొట్టి ఫార్మాట్‌ ప్రభావం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే వన్డేల్లో రాణిస్తున్న అఫ్గానిస్థాన్‌పై పూర్తి ఆధిపత్యం కనబర్చాలని భావిస్తున్నది. మెగాటోర్నీ ఆరంభానికి ముందే.. సెమీస్‌ చేరడమే తమ లక్ష్యమని బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ వెల్లడించగా.. మాజీ సారథి తమీమ్‌ ఇక్బాల్‌ ఆశ్చర్యకర రీతిలో వరల్డ్‌కప్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ అంశంపై బంగ్లా క్రికెట్‌లో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో.. ఆదేశ ప్రధానమంత్రి షేక్‌ హసీనా సైతం కల్పించుకున్న విషయం తెలిసిందే.


ప్రస్తుతం బంగ్లా జట్టులో సీనియర్‌ ఆల్‌రౌండర్ షకీబ్‌తో పాటు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌, లిటన్‌ దాస్‌, ఆల్‌రౌండర్‌ మహ్ముదుల్లా వంటి నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ నలుగురు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా మ్యాచ్‌ను కాపడగలవారే. వీరితో పాటు యువ ఆటగాళ్లు నజ్ముల్‌ శాంటో, తస్కీన్‌ అహ్మద్‌, షరీఫుల్‌ ఇస్లామ్‌, తౌహిద్‌తో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. స్పిన్‌ బౌలింగ్‌తోనే ప్రత్యర్థిని కట్టడి చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగనున్న బంగ్లాకు షకీబ్‌తో పాటు మెహదీ హసన్‌, నసుమ్‌ అహ్‌మద్‌ కీలకం కానున్నారు. 


 ఇక మరో వైపు 2017 ఐసీసీ ఫుల్‌ మెంబర్‌షిప్‌ సాధించిన అఫ్గానిస్థాన్‌.. వన్డే ప్రపంచకప్‌ వంటి మెగా ఈవెంట్‌లో తమదైన ముద్ర వేయాలని తహతహలాడుతోంది. ఇప్పటి వరకు వరల్డ్‌కప్‌ చరిత్రలో 15 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం ఒకే ఒక్క విజయం (స్కాట్లాండ్‌పై) సాధించింది. అయితే తమదైన రోజులో ఎంతటి జట్టునైనా ఇబ్బంది పెట్టగల సత్తా ఆ జట్టుకు ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన 2019 వరల్డ్‌కప్‌లో టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ను అఫ్గాన్‌ భయపెట్టిన విషయం తెలిసిందే. స్టార్లతో నిండి ఉన్న జట్లపై చక్కటి పోరాటం కనబర్చింది. ఇప్పుడు ఆ స్థాయి దాటి మరో ముందడుగు వేయాలని చూస్తోంది.


ధర్మశాలలో ఉదయం గం. 10.30 నుంచి మ్యాచ్‌ ప్రారంభం కానుండగా.. రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌, మహమ్మద్‌ నమీ, హష్మతుల్లా షాహిదిపై ఆ జట్టు ఎక్కువ ఆశలు పెట్టుకుంది. మరో యువ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ కూడా ప్రమాదకారే! బ్యాటింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌, హష్మతుల్లా, నబీ వంటి నైపుణ్యం ఉన్న ప్లేయర్లు అందుబాటులో ఉన్నా.. నిలకడలేమి వారికి ప్రధాన ఇబ్బందిగా మారింది. ఈ ఫార్మాట్‌లో ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లోనూ అఫ్గాన్‌కు పరాజయాలు ఎదురుకాగా.. బంగ్లాదేశ్‌ గత 5 మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడింది. 


తుది జట్లు (అంచనా)
అఫ్గానిస్థాన్‌: హష్మతుల్లా (కెప్టెన్‌), రెహ్మానుల్లా, ఇబ్రహీం, రహమత్‌ సా, నబి, నజిబుల్లా, అజ్మతుల్లా, కరీమ్‌, రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌, ఫజల్‌ హక్‌.
బంగ్లాదేశ్‌: షకీబ్‌ (కెప్టెన్‌), తన్జిద్‌, లిటన్‌ దాస్‌, నజ్ముల్‌, తౌహిద్‌, ముష్ఫికర్‌, మెహదీ హసన్‌, నసుమ్‌ అహ్మద్‌, తస్కీన్‌, షరీఫుల్‌, హసన్‌ మహమూద్‌.