ఆసియా గేమ్స్‌ పురుషుల క్రికెట్‌లో భారత్‌ స్వర్ణ పతకం కోసం అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో సాధికార విజయాలతో ఫైనల్లోకి ప్రవేశించిన టీమిండియా... ఫైనల్లో అఫ్గానిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇవాళ జరిగిన సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి భారత్‌ తుది పోరుకు చేరుకోగా.. పాకిస్థాన్‌కు షాకిస్తూ అఫ్గానిస్తాన్‌ కూడా ఫైనల్‌కు దూసుకొచ్చింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యంలో భీకరంగా ఆడుతున్న భారత జట్టును... అఫ్గానిస్థాన్‌ అడ్డుకోవడం అంత తేలిక కాదని మాజీలు విశ్లేషిస్తున్నారు. ఇక పసిడి పతకం కోసం జరిగే పోరులో రేపు( శనివారం) టీమిండియా-అఫ్గాన్ తలపడనున్నాయి. శనివారం ఉదయం 11:30 గంటల నుంచి భారత్- ఆఫ్గానిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ జెజియాంగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ పింగ్‌ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్‌లో జరగనుంది.

 

అఫ్గానిస్తాన్‌తో జరిగే  మ్యాచ్‌లోనూ విజయం సాధించి భారత్‌కు పసిడిని అందించాలని గైక్వాడ్‌ సేన పట్టుదలగా ఉంది. యశస్వి జైస్వాల్‌, రింకూ సింగ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ సహా ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసిరానుంది. మరోవైపు అఫ్గాన్‌ కూడా తమకంటే బలమైన పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చి ఆత్మ విశ్వాసంతో ఉంది. రేపు భారత్‌కు కూడా షాక్‌ ఇవ్వాలని అఫ్గాన్‌ జట్టు భావిస్తోంది. అయితే ఎలాంటి అలసత్వానికి చోటు ఇవ్వకుండా టీమిండియా స్వర్ణ కాంతులు విరజిమ్మాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

ఆసియా గేమ్స్‌లో ఇవాళ జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేయగా..... రెండో సెమీస్‌లో పాకిస్తాన్‌పై 4వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌ గెలుపొందింది. భారత్‌తో జరిగిన సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు మాత్రమే చేసింది. భారత స్పిన్నర్లు సాయి కిశోర్ 3, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత లక్ష్య ఛేదనలో భారత్‌ ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి 9.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.ఆరు సిక్సర్లతో చెలరేగి ఆడిన తిలక్ వర్మ 55, కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ 40 పరుగులతో అజేయంగా నిలిచారు. రెండో సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌ 115 పరుగులకు ఆలౌటైంది.అనంతరం అఫ్గానిస్తాన్‌ 6 వికెట్ల నష్టానికి 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. రేపు ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌లోభారత్‌ స్వర్ణ పతకం నెగ్గింది.

 

భారత జట్టు:

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (కీపర్‌), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్‌), ఆకాష్ దీప్.

 

అఫ్గానిస్థాన్‌ జట్టు: 

సెదిఖుల్లా అటల్, మహ్మద్ షాజాద్ ( కీపర్‌), నూర్ అలీ జద్రాన్, షాహిదుల్లా కమల్, గుల్బాదిన్ నైబ్(కెప్టెన్‌), షరాఫుద్దీన్ అష్రఫ్, అఫ్సర్ జజాయ్, కైస్ అహ్మద్, సయ్యద్ షిర్జాద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, జహీర్ ఖాన్, నిజత్ మసూద్, జుబా జనాత్, జుబా జనత్, జుబా జనత్, వఫివుల్లా తారఖిల్.