పాకిస్థాన్‌ ప్రపంచకప్ వేట ప్రారంభమైంది. హైదరాబాద్‌ వేదికగా నెదర్లాండ్స్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రపంచకప్‌లో రెండో మ్యాచ్‌ పాకిస్తాన్-నెదర్లాండ్స్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఈ మెగా టోర్నీని ఘనంగా ప్రారంభించాలని పాక్ కు ఆరంభ ఓవర్లలోనే నెదర్లాండ్ బౌలర్లు షాకిచ్చారు. కేవలం 38 పరుగులకే పాక్ టాపార్డర్ బ్యాటర్లు ముగ్గురు ఔటయ్యారు. ఓపెనర్లు ఫకార్ జమాన్ (12), ఇమాముల్ హక్ (15) త్వరగా ఔటయ్యారు. కెప్టెన్ బాబర్ అజమ్ సైతం (5) పరుగులకే వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతానికి పాక్ 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులో రిజ్వాన్ (21), షకీల్ (12) ఉన్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.

 

పాకిస్థాన్‌తో అడిన మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్ ఇప్పటి వరకు ఒక్క వన్డే మ్యాచ్‌లో కూడా గెలవలేదు. ఇప్పటివరకు పాకిస్తాన్‌తో 6 వన్డే మ్యాచ్‌లు ఆడిన నెదర్లాండ్స్‌ అన్నింటిలోనూ ఓటమి చవిచూసింది. 2023 ఆసియా కప్‌లో ఓటమిని మర్చిపోయి సరికొత్తగా ఆటను ఆరంభించాలని పాక్‌ భావిస్తోంది. బాబర్ జట్టులో ఎలాంటి ప్రత్యేక మార్పులు చేయలేదు. యువ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు.  షాహీన్ అఫ్రిదితో కూడిన పాక్‌ బౌలింగ్ దళం చాలాబలంగా ఉంది.   పాకిస్థాన్‌తో నెదర్లాండ్స్ పోటీ పడడం అంత సులభం కాదు. 

 

పాక్‌ ఆందోళన

పాకిస్థాన్‌ను గాయాలు ఆందోళన పరుస్తున్నాయి. కీలక బ్యాటర్లు, బౌలర్లు సైతం ఫామ్‌ కోల్పోవడం కూడా దాయాది దేశాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. పాక్‌ బ్యాటింగ్‌ భారమంతా కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌పై పడింది. వైస్‌ కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌, ఫకర్‌ జమాన్‌, రిజ్వాన్‌ కూడా ఫామ్‌లో లేరు. చివరి రెండు ప్రపంచకప్‌ టోర్నీలో పాక్‌ తొలి మ్యాచుల్లో ఓడిపోయింది. ఈ సాంప్రదాయమే పాక్‌ను ఇంకా ఆందోళనకు గురిచేస్తోంది. అర్హత టోర్నీల్లో మంచి ప్రదర్శనతో నెదర్లాండ్స్‌ ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ఎంపికైంది. పరిస్థితులు ఎలాగున్నా పోరాట స్ఫూర్తిలో వారికి ఎదురులేదు. ఒకప్పుడు పసికూనగా ఉన్న నెదర్లాండ్స్‌ ఇప్పుడు ఒత్తిడిని తట్టుకొని మరీ నిలబడుతోంది. తమదైన రోజున ఈ జట్టు ఎవరినైనా ఓడించగలదు. 

 

బాబర్‌ ఆజమ్‌పైనే భారం

ఈ ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన చేయాలని పాక్ జట్టు పట్టుదలగా ఉంది. వన్డే వరల్డ్‌కప్‌ విజయంతో పాక్‌ క్రికెట్‌కు గత వైభవం తేవాలని కసిగా ఉంది. బాబర్‌ ఆజమ్‌ తోడుగా మిగిలిన బ్యాటర్లు రాణిస్తే పాక్‌కు విజయం సులువే. కానీ నెదర్లాండ్స్‌ను తక్కవ అంచనా వేస్తే పాక్‌ తగిన  మూల్యం చెల్లించుకోక తప్పదు.

 

నెదర్లాండ్స్ జట్టు:

విక్రమజీత్ సింగ్, మాక్స్ ఓ'డౌడ్, కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (వికెట్ కీపర్/కెప్టెన్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్. దత్, పాల్ వాన్ మీకెరెన్