వాగ్నర్‌ గ్రూప్‌ బాస్‌ ప్రిగోజిన్‌ మరణం దర్యాప్తుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌, తొలిసారి బహిరంగంగా స్పందించారు. ప్రిగోజిన్‌ విమానంలో గ్రనేడ్‌ పేలి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. విమాన ప్రమాద తర్వాత ప్రిగోజిన్‌తోపాటు ప్రయాణిస్తున్న వారి శరీరాల్లో గ్రనేడ్‌ శకలాలు లభించాయన్నారు. ఫ్రిగోజిన్ కేసును దర్యాప్తు చేస్తున్న బృందం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతులకు మద్యం, డ్రగ్‌ టెస్టులు నిర్వహించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు కిలోగ్రాముల కొకైన్‌ను, గతంలో వాగ్నర్‌ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గతంలో తిరుగుబాటు తర్వాత సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ఆఫీస్‌లో ఎఫ్‌ఎస్‌బీ తనిఖీలు నిర్వహించిందని,  10 బిలియన్‌ రూబుల్స్‌, ఐదు కిలోల కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకొన్నారని పుతిన్ వెల్లడించారు. ప్రిగోజిన్ సహా మిగిలిన వారి శరీరాల్లో గ్రనేడ్‌ శకలాలు కనిపించాయన్నారు. కుట్ర కోణం సహా అన్ని రకాలుగా దర్యాప్తు నిర్వహిస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. 


సరికొత్త క్రూజ్‌ క్షిపణి పరీక్షలు సక్సెస్


అణుశక్తితో దూసుకెళ్లే సరికొత్త క్రూజ్‌ క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వెల్లడించారు. అణ్వస్త్ర పరీక్షల నిషేధానికి సంబంధించిన అంతర్జాతీయ ఒడంబడిక నుంచి తాము వైదొలిగే అవకాశాలు ఉన్నాయన్నారు. 30 ఏళ్ల తర్వాత అణ్వాయుధ పరీక్షలు నిర్వహించే అంశాన్ని కొట్టిపారేయలేమన్న పుతిన్, బురెవెస్త్‌నిక్‌ క్రూజ్‌ క్షిపణితో పాటు సర్మాత్‌ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అభివృద్ధి ప్రక్రియ పూర్తయిందన్నారు. బురెవెస్త్‌నిక్‌ క్రూజ్‌ క్షిపణి రేంజి కొన్ని వేల మైళ్లు ఉంటుందని, అదే సమయంలో రష్యా అణుశక్తిని మరోసారి ప్రపంచానికి గుర్తు చేశామన్నారు పుతిన్. రష్యాపై దాడి జరిగితే వందల కొద్ది క్షిపణులు ఏకకాలంలో గాల్లోకి లేస్తాయని, ఒక్క శత్రువు భూస్థాపితం చేస్తాయని హెచ్చరించారు. 


విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణం


అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసి వెనక్కి తగ్గిన రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్‌ విమాన ప్రమాదంలో మరణించారు. ప్రైవేటు జెట్‌ విమానం మాస్కో నుంచి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలోని 10 మందీ మరణించారు. మాస్కోకు ఉత్తరాన ఉన్న త్వేర్‌ రీజియన్‌లో ఎంబ్రాయర్‌ విమానం కూలిపోయింది. మరణించిన వారిలో ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్రిగోజిన్‌ మృతి తర్వాత వాగ్నర్‌ దళపతుల్లో ముఖ్యుడైన ఆండ్రి ట్రోషెవ్‌కు, వాగ్నర్ గ్రూపు బాధ్యతలు అప్పగించాడు రష్యా అధినేత పుతిన్‌. రష్యా సైన్యంలో గతంలో అధికారిగా ఉన్న ట్రోషెవ్‌, 2014 నుంచి వాగ్నర్‌ గ్రూపులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వాగ్నర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హోదాలో సిరియాలో పోరాట కార్యకలాపాలను పర్యవేక్షించారు. 


పుతిన్ కు నమ్మినబంటు ప్రిగోజిన్


వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత ప్రిగోజిన్‌ ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరఫున క్రియాశీలంగా పోరాటం చేశారు. పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా ప్రిగోజిన్ పేరుంది. 1981లో దొంగతనం, దోపిడీ కేసుల్లో 12 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు ప్రిగోజిన్‌. జైలు నుంచి విడుదలైన తర్వాత రకరకాల వ్యాపారాలు చేశారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో పలు రెస్టారెంట్లను నెలకొల్పారు. ఇక్కడే పుతిన్‌తో ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. క్రమంగా అతడు అధ్యక్షుడి ఆంతరంగికుల్లో ఒకడిగా ఎదిగారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ డిప్యూటీ మేయర్‌గానూ పని చేశారు. రష్యా ప్రభుత్వ ఆహార కాంట్రాక్టులన్నీ ఆయనవే. అలా అంచెలంచెలుగా అధ్యక్షుడి అండతో ఆర్థికంగా ఎదిగి వాగ్నర్‌ ముఠాకు అధినేత అయ్యారు.