వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఆస్ట్రేలియా మట్టికరిపించింది. మొదట వార్నర్-మార్ష్ విధ్వంసంతో 367 పరుగుల భారీ స్కోరు చేసిన కంగారులు... తర్వాత పాకిస్థాన్‌ను 305 పరుగులకే కుప్పకూల్చింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగిందంటూ చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. స్డేడియంలో కొంతమంది ఫ్యాన్స్ పాకిస్థాన్ జిందాబాద్.. అంటూ నినాదాలు చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేయవద్దని ఓ పోలీస్ అధికారి పాక్ అభిమానిని వారిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. పాకిస్థాన్ జిందాబాద్ స్లోగన్స్ ఇవ్వొద్దని ఆ పోలీస్ అధికారి వాదిస్తుంటే.. తమ జట్టుకు మద్దతుగా నిలవడం తప్పా అని ఆ అభిమాని ప్రశ్నిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. భారత్‌లో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు ఇవ్వడం తప్పని కొందరు నెటిజన్లు ట్వీట్ చేస్తుంటే.. మరికొందరేమో గ్రౌండ్లోని తమ జట్టుకు మద్దతుగా నిలవడం తప్పా అని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లు రెండు జట్లు 672 పరుగులు నమోదు చేశాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బౌలింగ్ తీసుకున్నాడు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్షల్ విధ్వంసంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆరంభంలో లక్ష్యం దిశగా పయనించింది. కానీ ఆసిస్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో పాక్ 305 పరుగులకే పరిమితమైంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయంతో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. పాకిస్థాన్ అయిదో స్థానానికి పడిపోయింది.
డేవిడ్ వార్నర్ 140 బంతులుఎదుర్కొని 168 పరుగులు చేశాడు. 108 బంతులు ఎదుర్కొన్న మిచెల్ మార్ష్ 10 భారీ సిక్సులు, 9 ఫోర్లతో 121 పరుగులు చేశాడు. హరీస్ రౌఫ్ వేసిన తొమ్మిదో ఓవర్లో 24 పరుగులు పిండుకున్నారు. ఆ ఓవర్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సుతో 24 పరుగులు వచ్చాయి. అప్పటినుంచి ఆసిస్ బ్యాటింగ్ జెట్ స్పీడ్‌తో సాగింది. క్రీజులో కాస్త కుదురుకున్నాక విధ్వంసాన్ని మొదలుపెట్టిన ఈ ఇద్దరు ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 33 ఓవర్లపాటు వికెట్ పడకుండా బ్యాటింగ్ చేసి తొలి వికెట్‌కు 259 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆసిస్ బ్యాటర్లు వేగంగా పరుగులు చేయాలన్న ఉద్దేశంతో వికెట్లు పారేసుకున్నారు. దీంతో 400 పరుగులు దాటుతుందన్న ఆస్ట్రేలియా.... 367 పరుగులకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రీదీ 5 వికెట్లు తీశాడు. హరీస్ రౌఫ్ 3 వికెట్లు తీశాడు. కానీ హరీస్ రౌఫ్ ఎనిమిది ఓవర్లలోనే 83 పరుగులు ఇవ్వగా.... మీర్ 9 ఓవర్లలో 82 పరుగులు ఇచ్చాడు.
అనంతరం 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు కూడా మంచి ఆరంభం దక్కింది. శ్రీలంకపై భారీ లక్ష్యాన్ని ఛేదించి ఆత్మ విశ్వాసంతో ఉన్న పాక్... లక్ష్యాన్ని ఛేదించే దిశగా తొలి అడుగు బలంగా వేసింది. పాక్ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఇమాముల్ హక్ అర్ధ సెంచరీలతో తొలి వికెట్‌కు 134 పరుగులు జోడించారు. షఫీక్ 64, ఇమాముల్ హక్ 70 పరుగులు చేసి అవుటయ్యారు. అనంతరం కూడా పాక్ లక్ష్యం దిశగా పయనించి మరోసారి చరిత్ర సృష్టించేలా కనిపించింది. కానీ జంపా బౌలింగ్‌కు దిగడంతో పాక్ పతనం ప్రారంభమైంది. ఆసిస్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో పాక్ 305 పరుగులకే పరిమితమైంది.