క్యాచ్స్ విన్స్ మ్యాచ్స్ అంటారు. ఈ విషయం పాకిస్థాన్ జట్టుకు ఇప్పుడు బాగా అర్థమైనట్లు ఉంది. ఒకే ఒక్క క్యాచ్... అదీ సులువుగా చేతుల్లోకి వచ్చిన క్యాచ్ నేలపాలైంది. ఆ ఒక్క క్యాచ్చే మ్యాచ్‌ను పాకిస్థాన్ నుంచి దూరం చేసింది. ఆ ఒక్క క్యాచ్చే పాక్ బౌలర్ల ఊచకోతకు కారణమైంది. ఆ ఒక్క క్యాచ్చే పాకిస్థాన్ జట్టుపై పిడుగులా మారి ఓటమికి కారణమైంది.
ఇంతకీ ఏమైంది..?
పాకిస్థాన్ బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్ మార్ష్- డేవిడ్ వార్నర్ కొంచెం ఇబ్బంది పడుతున్న సమయమది. ఆ సమయంలో పాక్ బౌలర్లపై ఒత్తిడి తేవాలని భావించిన వార్నర్... షాహీన్ షా ఆఫ్రిది బౌలింగ్‌లో భారీ షాట్ ఆడాడు. అంతే బాల్ గాల్లోకి లేచి నేరుగా ఉస్మాన్ మీర్ దగ్గరికి వెళ్లింది. చాలా తేలికైన క్యాచ్ అది. కానీ ఆ క్యాచ్‌ను ఉస్మాన్ మీర్ జారవిడిచాడు. అప్పుడు వార్నర్ కేవలం పది పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ అవకాశాన్ని ఆస్ట్రేలియా ఓపెనర్ సద్వినియోగం చేసుకున్నాడు. వార్నర్ 163 పరుగుల తుఫాను ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్‌కు ఓటమిని ఖాయం చేశాడు. డేవిడ్ వార్నర్ క్యాచ్‌ను జారవిడవడం చాలా ఖరీదుగా మారిందని మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం అంగీకరించాడు.
ఆస్ట్రేలియాపై పాక్ ఓటమికి పేలవమైన బౌలింగ్ కూడా ఓ కారణమని బాబర్ అన్నా. తమ బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేదని, డేవిడ్ వార్నర్ లాంటి ఆటగాడి క్యాచ్‌ను వదులుకుంటే అతను వదిలిపెట్టడని బాబర్ అన్నాడు. ఇది స్కోర్ చేయడానికి చాలా మండి గ్రౌండ్ అని, చివరి ఓవర్లలో తమ బౌలర్లు మంచి పునరాగమనం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయందని పాక్ సారధి తెలిపాడు. మిడిల్ ఓవర్లలో తమకు మంచి భాగస్వామ్యం లభించకపోవడం కుడా ఓటమికి కారణమన్నాడు.
ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసి ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లు రెండు జట్లు 672 పరుగులు నమోదు చేశాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బౌలింగ్ తీసుకున్నాడు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్షల్ విధ్వంసంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆరంభంలో లక్ష్యం దిశగా పయనించింది. కానీ ఆసిస్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో పాక్ 305 పరుగులకే పరిమితమైంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయంతో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. పాకిస్థాన్ అయిదో స్థానానికి పడిపోయింది.
డేవిడ్ వార్నర్ 140 బంతులుఎదుర్కొని 168 పరుగులు చేశాడు. 108 బంతులు ఎదుర్కొన్న మిచెల్ మార్ష్ 10 భారీ సిక్సులు, 9 ఫోర్లతో 121 పరుగులు చేశాడు. హరీస్ రౌఫ్ వేసిన తొమ్మిదో ఓవర్లో 24 పరుగులు పిండుకున్నారు. ఆ ఓవర్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సుతో 24 పరుగులు వచ్చాయి. అప్పటినుంచి ఆసిస్ బ్యాటింగ్ జెట్ స్పీడ్‌తో సాగింది. క్రీజులో కాస్త కుదురుకున్నాక విధ్వంసాన్ని మొదలుపెట్టిన ఈ ఇద్దరు ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 33 ఓవర్లపాటు వికెట్ పడకుండా బ్యాటింగ్ చేసి తొలి వికెట్‌కు 259 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
పాక్ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఇమాముల్ హక్ అర్ధ సెంచరీలతో తొలి వికెట్‌కు 134 పరుగులు జోడించారు. షఫీక్ 64, ఇమాముల్ హక్ 70 పరుగులు చేసి అవుటయ్యారు. అనంతరం కూడా పాక్ లక్ష్యం దిశగా పయనించి మరోసారి చరిత్ర సృష్టించేలా కనిపించింది. కానీ జంపా బౌలింగ్‌కు దిగడంతో పాక్ పతనం ప్రారంభమైంది. నాలుగు వికెట్ల నష్టానికి 232 పరుగులతో పటిష్టంగానే ఉన్నట్లు కనిపించిన పాక్ తర్వాత వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఆసిస్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో పాక్ 305 పరుగులకే పరిమితమైంది.