ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసి ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ హై స్కోరింగ్‌ మ్యాచ్‌లు రెండు జట్లు 672 పరుగులు నమోదు చేశాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌  కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ బౌలింగ్ తీసుకున్నాడు. డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్షల్‌ విధ్వంసంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ ఆరంభంలో లక్ష్యం దిశగా పయనించింది. కానీ ఆసిస్‌ బౌలర్లు సమష్టిగా రాణించడంతో పాక్ 305 పరుగులకే పరిమితమైంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయంతో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. పాకిస్థాన్‌ అయిదో స్థానానికి పడిపోయింది. 

 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు దిమ్మతిరిగే ఆరంభాన్ని ఇచ్చారు. ప్రారంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగారు. బంతిని బౌండరీ దాటించడమే పనిగా పెటుకున్నారు. మిచెల్‌ మార్ష్‌, వార్నర్‌ ఇద్దరు పాక్‌ బౌలర్లను చితక్కొట్టి శతకాలు నమోదు చేశారు. వీరి ధాటికి స్కోరు బోర్డు హై స్పీడ్‌తో పరుగు పెట్టింది. డేవిడ్‌ వార్నర్‌ 140 బంతులుఎదుర్కొని 168 పరుగులు చేశాడు. 108 బంతులు ఎదుర్కొన్న మిచెల్‌ మార్ష్‌  10 భారీ సిక్సులు, 9 ఫోర్లతో 121 పరుగులు చేశాడు. హరీస్‌ రౌఫ్‌ వేసిన తొమ్మిదో ఓవర్లో 24 పరుగులు పిండుకున్నారు. ఆ ఓవర్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సుతో 24 పరుగులు వచ్చాయి. అప్పటినుంచి ఆసిస్‌ బ్యాటింగ్‌ జెట్‌ స్పీడ్‌తో సాగింది. క్రీజులో కాస్త కుదురుకున్నాక  విధ్వంసాన్ని మొదలుపెట్టిన ఈ ఇద్దరు ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 33 ఓవర్లపాటు వికెట్‌ పడకుండా బ్యాటింగ్‌ చేసి తొలి వికెట్‌కు 259 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 

 

ప్రారంభంలో డేవిడ్‌ వార్నర్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను పాక్‌ జారవిడిచి భారీ మూల్యం చెల్లించుకుంది. దాని తర్వాత వార్నర్‌, మిచెల్‌ ఏ పాక్‌ బౌలర్‌ను విడిచిపెట్టలేదు. కానీ మిచెల్‌ మార్ష్‌ అవుట్‌ కావడంతో మ్యాక్స్‌వెల్‌  వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ షహీన్‌ షా అఫ్రీదీ బౌలింగ్‌లో తొలి బంతికే వెనుదిరిగాడు. ఒకే ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన అఫ్రీదీ పాక్‌కు కొంచెం ఉపశమనం కల్పించాడు. స్టీవ్‌ స్మిత్‌ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న స్మిత్‌ ఏడు పరుగులు చేసి స్పిన్నర్‌ ఉసామా మీర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. వరుసగా వికెట్లు పడుతున్నా వార్నర్‌ మాత్రం పోరాటం ఆపలేదు. డేవిడ్‌ వార్నర్‌ 168 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం ఆసిస్‌  బ్యాటర్లు వేగంగా పరుగులు చేయాలన్న ఉద్దేశంతో వికెట్లు పారేసుకున్నారు. దీంతో 400 పరుగులు దాటుతుందన్న ఆస్ట్రేలియా.... 367 పరుగులకే పరిమితమైంది. పాక్‌  బౌలర్లలో షహీన్‌ షా అఫ్రీదీ 5 వికెట్లు తీశాడు. హరీస్‌ రౌఫ్‌ 3 వికెట్లు తీశాడు. కానీ హరీస్‌ రౌఫ్‌ ఎనిమిది ఓవర్లలోనే 83 పరుగులు ఇవ్వగా.... మీర్‌ 9 ఓవర్లలో 82 పరుగులు ఇచ్చాడు.

 

అనంతరం 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు కూడా మంచి ఆరంభం దక్కింది. శ్రీలంకపై భారీ లక్ష్యాన్ని ఛేదించి ఆత్మ విశ్వాసంతో ఉన్న పాక్‌... లక్ష్యాన్ని ఛేదించే దిశగా తొలి అడుగు బలంగా వేసింది. పాక్ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఇమాముల్‌ హక్‌ అర్ధ సెంచరీలతో తొలి వికెట్‌కు 134 పరుగులు జోడించారు. షఫీక్‌ 64, ఇమాముల్ హక్‌ 70 పరుగులు చేసి అవుటయ్యారు. అనంతరం కూడా పాక్‌ లక్ష్యం దిశగా పయనించి మరోసారి చరిత్ర సృష్టించేలా కనిపించింది. కానీ జంపా బౌలింగ్‌కు దిగడంతో పాక్‌ పతనం ప్రారంభమైంది. నాలుగు వికెట్ల నష్టానికి 232 పరుగులతో  పటిష్టంగానే ఉన్నట్లు కనిపించిన పాక్‌ తర్వాత వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. బాబర్‌ ఆజమ్‌ 18, రిజ్వాన్‌ 46, షకీల్‌ 30, అహ్మద్‌ 26 పరుగులకే వెనుదిరిగారు. రిజ్వాన్‌ ఉన్నంతసేపు పాక్ ఆశలు మిణుకుమిణుకుమంటూనే ఉన్నాయి. కానీ రిజ్వాన్‌ను అవుట్‌ చేసిన జంపా పాక్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆసిస్‌ బౌలర్లు సమష్టిగా రాణించడంతో విజయానికి 62 పరుగుల దూరంలో పాక్‌ ఆగిపోయింది. 10 ఓవర్లు బౌలింగ్‌ చేసిన జంపా 53 పరుగులిచ్చి నాలుగు వికెట్లు నేలకూల్చాడు. కమిన్స్‌ 2, స్టోయినిస్‌ రెండు వికెట్లు సాధించారు.