Womens T20 World Cup 2023:  మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత మహిళలు విజయం సాధించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 8.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 54 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం వలన ఆట నిలిచిపోయింది. దీంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత మహిళల జట్టు 5 పరుగులతో విజయం సాధించింది. భారత ఇన్నింగ్స్ లో ఓపెనర్ స్మృతి మంధాన 56 బంతుల్లో 87 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు సెమీఫైనల్ కు చేరుకుంది. 






ఈ ఇన్నింగ్స్ తన కెరీర్ లో కష్టతరమైన ఇన్నింగ్స్ లలో ఒకటని స్మృతి మంధాన పేర్కొంది. మ్యాచ్ అనంతరం స్మృతి మాట్లాడుతూ.. 'సెయింట్ జార్జ్ పార్క్ లోని క్లిష్ట పరిస్థితుల కారణంగా ఈరోజు నేను చేసిన ఈ పరుగులు నా కెరీర్ లోనే కష్టతరమైన ఇన్నింగ్సుల్లో ఒకటిగా నిలిచింది. వికెట్ బాగానే ఉంది కానీ ఐర్లాండ్ బౌలర్ల పేస్, ఇంకా మైదానంలోని గాలితో బ్యాటింగ్ కు కష్టమైంది. షెఫాలీ, నేను ఒకరికొకరం ప్రోత్సహించుకున్నాం. పరుగులు చేసేందుకు ప్రయత్నం చేయాలని పదేపదే చెప్పుకున్నాం. మొదట మేమిద్దరం బాగా ఆడలేకపోయాం. మొదట బౌలింగ్ కు అలవాటు పడ్డాక తర్వాత పరుగులు చేశాం. ఇది కీలకమైన మ్యాచ్ కాబట్టి గెలవాలని అనుకున్నాం.' అని స్మృతి మంధాన అంది.






మంధాన మెరుపు ఇన్నింగ్స్


భారత జట్టు తరఫున స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఐర్లాండ్‌పై బ్యాట్‌తో విరుచుకుపడింది. ఈ ముఖ్యమైన మ్యాచ్‌లో ఆమె 56 బంతులు ఎదుర్కొని 87 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో స్మృతి 9 ఫోర్లు, 3 అద్భుతమైన సిక్సర్లు కొట్టింది.


సెమీఫైనల్‌కు చేరిన భారత్


టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌పై విజయం సాధించిన భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. టీ20 మహిళల ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరిన మూడో జట్టుగా టీమిండియా నిలిచింది. గ్రూప్-బిలో ఇంగ్లండ్ తర్వాత సెమీ ఫైనల్‌కు చేరిన రెండో జట్టు టీమిండియానే. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కచ్చితంగా టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని భారత అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.