Harbhajan Singh On Kl Rahul: కేఎల్ రాహుల్... ఇప్పుడు క్రికెట్ మాజీలు, విశ్లేషకులు, అభిమానుల నోట్లో బాగా నలుగుతున్న పేరు. నిలకడగా విఫలమవుతూ అన్నివైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఆటగాడు. ఎన్ని అవకాశాలు ఇస్తున్నా జట్టు నమ్మకాన్ని వమ్ము చేస్తున్న ప్లేయర్. గత కొన్నాళ్లుగా రాహుల్ ప్రదర్శనపై విమర్శలు వస్తున్నా.. టీంలో తన స్థానంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నా.. భారత్- ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా అవి మరింత ఎక్కువయ్యాయి. టీమిండియా మాజీ ఆటగాళ్లే రాహుల్ ఫాంపై కోపం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే వెంకటేశ్ ప్రసాద్ అతనిపై ఫైర్ అవగా.. మరో మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రాహుల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య 2 టెస్ట్ మ్యాచ్ లు ముగిశాయి. మార్చి 1 నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. మిగిలిన 2 టెస్ట్ లకు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. ఇందులోనూ కేఎల్ రాహుల్ కు చోటు దక్కింది. అయితే వైస్ కెప్టెన్ పోస్ట్ నుంచి బీసీసీఐ అతన్ని తప్పించింది. కేవలం ఆటగాడిగానే స్క్వాడ్ లో చోటిచ్చింది. దీనిపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాట్లాడాడు. రాహుల్ పేరు పక్కన ఇప్పుడు వైస్ కెప్టెన్సీ ట్యాగ్ లేదు కాబట్టి అతను తుది జట్టులో ఉండకపోయినా నష్టంలేదని టర్బోనేటర్ అన్నాడు.
రోహిత్ తో గిల్ ఓపెనింగ్ చేయాలి
'రాహుల్ ఇప్పుడు వైస్ కెప్టెన్ కాదు. వైస్ కెప్టెన్ గా ఉంటే అతడి ప్రదర్శన ఎలా ఉన్నా తుది 11 మందిలో చోటు దక్కుతుంది. ఇప్పుడు ఆ ట్యాగ్ లేదు కాబట్టి అతడు తుది జట్టులో ఉండకపోయినా ఆశ్చర్యం లేదు. అతను తొలి రెండు టెస్టుల్లో విఫలమయ్యాడు. నా ఉద్దేశ్యం ప్రకారం మూడో టెస్టులో రోహిత్ తో కలిసి శుభ్ మన్ గిల్ ఓపెనింగ్ చేయవచ్చు. కేఎల్ రాహుల్ నాణ్యమైన ఆటగాడే. అయితే ఇప్పుడు అతను పేలవ దశను ఎదుర్కొంటున్నాడు.' అని హర్భజన్ అన్నాడు.
ఇదిలా ఉంటే.. జట్టు యాజమాన్యం, కోచ్, కెప్టెన్ మాత్రం రాహుల్ కు మద్దతిస్తూనే ఉన్నారు. వరుసగా విఫలమవుతున్నా తనపై నమ్మకాన్ని ఉంచుతున్నారు. ఆసీస్ తో రెండో టెస్ట్ ముగిసిన తర్వాత విలేకర్ల సమావేశంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ కు రాహుల్ గురించిన ప్రశ్న ఎదురైంది. దానిపై ద్రవిడ్ స్పందిస్తూ.. 'మేం రాహుల్ కు మద్దతిస్తూనే ఉంటాం. పేలవ దశ నుంచి బయటపడే నాణ్యత, సామర్ధ్యం అతడికుంది' అని అన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే మూడో టెస్టులోనూ రోహిత్ తో పాట్ రాహులే ఓపెనింగ్ చేయవచ్చు.
రాహులే ఎందుకు?
ఇకపోతే టీమిండియా మాజీ ఆటగాడు వెంకటేశ్ ప్రసాద్ కేఎల్ రాహుల్ పై మండిపడుతున్నాడు. అతని ఫాంపై, జట్టులో అతని స్థానంపై విమర్శలు గుప్పిస్తున్నాడు. ఎంతోమంది ఓపెనర్లు, దేశవాళీల్లో అదరగొట్టిన ఆటగాళ్లు, ప్రస్తుత జట్టులోనే సూపర్ ఫాంలో ఉన్న శుభ్ మన్ గిల్ ఇలా ఎందరో అందుబాటులో ఉన్నప్పటికీ రాహుల్ ను ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించాడు.