India vs Ireland, Women T20 WC 2023: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఐదు పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఫలితం డక్‌వర్త్ లూయిస్ ద్వారా వచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
టీమ్ ఇండియా తరుపున స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 56 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 87 పరుగులతో భారీ అర్ధ సెంచరీ చేసింది. స్మృతి అద్భుత బ్యాటింగ్ కారణంగా భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టీమ్ ఇండియా మహిళల టీ20 ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది.
సెమీఫైనల్‌కు చేరిన భారత్
టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌పై విజయం సాధించిన భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. టీ20 మహిళల ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరిన మూడో జట్టుగా టీమిండియా నిలిచింది. గ్రూప్-బిలో ఇంగ్లండ్ తర్వాత సెమీ ఫైనల్‌కు చేరిన రెండో జట్టు టీమిండియానే. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కచ్చితంగా టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని భారత అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.
మంధాన మెరుపు ఇన్నింగ్స్
భారత జట్టు తరఫున స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఐర్లాండ్‌పై బ్యాట్‌తో విరుచుకుపడింది. ఈ ముఖ్యమైన మ్యాచ్‌లో ఆమె 56 బంతులు ఎదుర్కొని 87 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో స్మృతి తొమ్మిది ఫోర్లు, మూడు అద్భుతమైన సిక్సర్లు కొట్టింది.
స్మృతి మంధాన తొలి వికెట్‌కు షెఫాలీ వర్మతో కలిసి 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అదే సమయంలో చివరి ఓవర్లలో ఆమె బౌలర్లపై భారీగా విరుచుకుపడింది. ఫోర్లు, సిక్సర్లో చెలరేగి పోయింది. స్మృతి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా భారత్ ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించింది. ఐర్లాండ్ తన ఇన్నింగ్స్‌లో 8.2 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో చేయాల్సిన పరుగుల కంటే ఐదు పరుగులు తక్కువ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఫలితం రావడం అభిమానులకు నిరాశ కలిగించింది.