Gannavaram High Tension : ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కారును ఆందోళనకారులు ధ్వంసం చేశారు.  దీంటో పాటు వంశీపై విమర్శలు చేసిన దొంతు చిన్నా కారుకు నిప్పుపెట్టారు. అంతకు ముందు గన్నవరం బయలుదేరిన పట్టాభిరామ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయను అరెస్టు చేసి రహస్య ప్రదేశానికి తరలించారు.  గన్నవరం బయలుదేరిన మాజీ మంత్రి దేవినేని ఉమాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడి చేశారు. కార్యాలయంలో ఫర్మిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నేతలు పార్టీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. టీడీపీ కీలక నేతలు గన్నవరం రాకుండా ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ వద్ద పోలీసులు భద్రత పెంచారు. గన్నవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులుచేసుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. టీడీపీ కార్యకర్తలు, నేతలను అరెస్టు చేస్తున్నారు. 






నా భర్తలు ఏం జరిగినా సీఎం, డీజీపీదే బాధ్యత - పట్టాభిరామ్ భార్య 


పట్టాభిరామ్ ఆచూకీపై ఆయన భార్య చందన ఆందోళన వ్యక్తం చేశారు. గన్నవరంలో టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి విషయం తెలిసి నా భర్త అక్కడికి వెళ్లారని చందన తెలిపారు. అక్కడ పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారని తెలిసిందన్నారు. కారు డ్రైవర్, పీఏ పోలీస్ స్టేషల్ ఉన్నారు కానీ నా భర్త అక్కడ లేరని తెలిపారు. నా భర్తను పోలీసులు ఎక్కడకి తీసుకెళ్లారో తెలియడంలేదని ఆందోళన చెందారు. ఆయన ఫోన్ స్విచాఫ్ వస్తోందని, నా భర్తకు ఏం జరిగినా ముఖ్యమంత్రి, డీజీపీదే బాధ్యత అన్నారు. 



పోలీస్ శాఖ మూసేశారా? - చంద్రబాబు ఆగ్రహం 


గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాల దాడి చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఆఫీస్ దాడి, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న వైసీపీ ప్రభుత్వం ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమన్నారు. వైసీపీ నేతలు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారన్నారు. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? అని మండిపడ్డారు. సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. దాడికి కారకులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.