ఢిల్లీలోని వాతావరణ కాలుష్యం కారణంగా మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠకు తెరదించుతూ జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌.. శ్రీలంకను తక్కువ పరుగులకే కట్టడి చేసింది. బంగ్లాదేశ్‌ బౌలర్లు సమష్టిగా రాణించడంతో లంక 49.3 ఓవర్లలో 279  పరుగులకే కుప్పకూలింది. ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కానీ చరిత్‌ అసలంక అద్భుత శతకంతో శ్రీలంకకు  పోరాడే స్కోరును అందించాడు. 



 ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. తొలి ఓవర్‌లోనే షోరిఫుల్ ఇస్లాం శ్రీలంకకు షాక్ ఇచ్చాడు. 5 బంతుల్లో నాలుగు పరుగులు చేసిన కుశాల్‌ పెరీరాను అవుట్‌ చేశాడు. అనంతరం పాతుమ్‌ నిసంక, కుశాస్ మెండిస్‌ లంకను ఆదుకున్నారు. రెండో వికెట్‌కు కీలకమైన 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని షకీబుల్‌ హసన్‌ విడదీశాడు. 30 బంతుల్లో 1 ఫోరు, 1 సిక్సుతో 19 పరుగులు చేసిన కుశాల్‌ను షకీబుల్‌ అవుట్‌ చేశాడు. దీంతో 66 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్‌ కోల్పోయింది. కాసేపటికే క్రీజులో కుదురుకున్న  పాతుమ్‌ నిసంక కూడా అవుట్‌ కావడంలో లంక కష్టాల్లో పడింది. 36 బంతుల్లో 8 ఫోర్లతో 41 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన నిసంకను హసన్‌ షకీబ్‌ బౌల్డ్‌ చేశాడు. తర్వాత సధీర సమరవిక్రమ, చరిత్‌ అసలంక శ్రీలంకను భారీ స్కోరు దిశగా నడిపించారు.



 బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న సధీర సమరవిక్రమ, చరిత్‌ అసలంక జట్టును గౌరవప్రదమైన స్కోరు దిశగా నడిపించారు. కానీ సధీర సమరవిక్రమను షకీబుల్‌ హసన్‌ అవుట్‌ చేశాడు. 42 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు చేసి సధీర సమరవిక్రమ అవుటయ్యాడు. దీర సమరవిక్రమను షకీబ్ అవుట్ చేసిన తర్వాత మాథ్యూస్ బ్యాటింగ్‌కి వచ్చాడు. కానీ మాధ్యూస్‌ బ్యాటింగ్‌కు రావడానికి చాలా సమయం తీసుకున్నాడు. దీంతో అతడిని అంపైర్‌ టైమ్డ్‌ అవుట్‌గా ప్రకటించాడు. దీంతో లంకకు ఎదురుదెబ్బ తగిలింది. 135 పరుగులకు లంక అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆచితూచి ధనుంజయ డిసిల్వా 36 బంతుల్లో 34, మహీష్‌ థీక్షణ 31 బంతుల్లో 22 పరుగులతో పర్వాలేదనిపించారు.  ఆడిన చరిత్‌ అసలంక శ్రీలంక త్వరగా ఆలౌట్‌ కాకుండా అడ్డుకున్నాడు.  101 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సులతో అసలంక సెంచరీ చేశాడు. అసలంక పోరాటంతో లంక  49.3 ఓవర్లలో 279  పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో హసన్ షకీఫ్ 3, షోరిఫుల్ ఇస్లాం 2, షకీబుల్‌ హసన్‌ రెండు వికెట్లు తీశారు.



 ఈ మ్యాచ్‌లో శ్రీలంకకు విజయం కీలకం కానుంది. సెమీఫైనల్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినా సాంకేతికంగా లంకేయులకు అవకాశం ఉంది. ఆ అవకాశాలు ఉండాలంటే బంగ్లాపై లంక గెలవాలి. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. పాయింట్ల పట్టికలో శ్రీలంక ఏడో స్థానంలో ఉంది. పాకిస్తాన్‌లో జరిగే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించడానికి శ్రీలంక ఏడో స్థానంలోనే ఉండాలి. అంటే ఈ మ్యాచ్‌లో తప్పక లంక గెలవాలి. శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఇప్పటివరకూ 53 వన్డేలు ఆడగా లంక 49 మ్యాచుల్లో బంగ్లా 9 మ్యాచుల్లో గెలిచాయి. ప్రపంచ కప్‌ వార్మప్ మ్యాచ్‌లో లంకను.. బంగ్లా ఓడించింది. కానీ భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక 55 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని లంక కూడా చూస్తోంది.