Angelo Mathews timed out: ప్రపంచకప్‌లో పెను సంచలనం. తొలిసారిగా శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ ఏంజెలో మ్యాథ్యూస్‌ టైమ్డ్‌ అవుటయ్యాడు. ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. మాధ్యూస్‌ను టైమ్డ్‌ అవుట్‌ అంటూ అప్పీల్‌ చేశాడు. 42 బంతుల్లో 41 పరుగులు చేసిన సదీర సమరవిక్రమను షకీబ్ అవుట్ చేసిన తర్వాత మాథ్యూస్ బ్యాటింగ్‌కి వచ్చాడు. కానీ మాధ్యూస్‌ బ్యాటింగ్‌కు రావడానికి చాలా సమయం తీసుకున్నాడు. దీంతో అతడిని అంపైర్‌ టైమ్డ్‌ అవుట్‌గా ప్రకటించాడు. వికెట్ పడిన తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌ 3 నిమిషాల్లోపు తదుపరి బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. లేకపోతే అతను టైమ్డ్‌ అవుట్‌ అవుతాడు. ఏంజెలో మాథ్యూస్ బ్యాటింగ్ చేయడానికి ఆలస్యంగా వచ్చాడని షకీబ్ అప్పీల్ చేశాడు. దాంతో అంపైర్లు సమయం సరిచూసి అవుట్‌గా ప్రకటించారు. దీంతో మాథ్యూస్ బంతి ఎదుర్కోకుండానే నిష్క్రమించాల్సి వచ్చింది. అసలంకా ప్రస్తుతం ధనంజయ డి సిల్వాతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నారు. 



 ఢిల్లీలోని వాతావరణ కాలుష్యం కారణంగా మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠకు తెరదించుతూ జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌.. శ్రీలంకను కట్టడి చేస్తోంది.  ఈ మ్యాచ్‌లో విజయం శ్రీలంకకు కీలకం కానుంది. సెమీఫైనల్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినా సాంకేతికంగా లంకేయులకు అవకాశం ఉంది. ఆ అవకాశాలు ఉండాలంటే బంగ్లాపై లంక గెలవాలి. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. పాయింట్ల పట్టికలో శ్రీలంక ఏడో స్థానంలో ఉంది. పాకిస్తాన్‌లో జరిగే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించడానికి శ్రీలంక ఏడో స్థానంలోనే ఉండాలి. అంటే ఈ మ్యాచ్‌లో తప్పక లంక గెలవాలి. శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఇప్పటివరకూ 53 వన్డేలు ఆడగా లంక 49 మ్యాచుల్లో బంగ్లా 9 మ్యాచుల్లో గెలిచాయి. ప్రపంచ కప్‌ వార్మప్ మ్యాచ్‌లో లంకను.. బంగ్లా ఓడించింది. కానీ భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక 55 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని లంక కూడా చూస్తోంది.



 మరోవైపు శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌ బోర్డ్‌ని  రద్దు చేస్తూ ప్రకటన చేసింది. ఇటీవలే భారత్‌-శ్రీలంక జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఘోర ఓటమి పాలైంది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. బోర్డ్‌ని రద్దు చేసే ముందే బోర్డ్ కార్యదర్శి రాజీనామా చేశారు. శ్రీలంక క్రీడాశాఖ మంత్రి రోషన్ రణసింఘే బోర్డుని రద్దు చేశారు. బోర్డులోని సభ్యులందరినీ తొలగించారు. ఆ స్థానంలో మధ్యంతర కమిటీని ఏర్పాటు చేశారు. దానికి అర్జున రణతుంగ నేతృత్వం వహించనున్నారు. 1996లో శ్రీలంక ప్రపంచ కప్ గెలిచింది. ఆ సమయంలో టీమ్ కేప్టెన్‌గా ఉన్నారు రణతుంగ. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీలో రణతుంగతో పాటు ముగ్గురు జడ్జ్‌లను సభ్యులుగా నియమించారు. బౌలింగ్‌లోనూ లంక పేసర్లు చెలరేగుతుండగా, కీలక స్పిన్నర్లు లేకపోవడం జట్టును దెబ్బతీసింది. బంగ్లాదేశ్‌ ఈ మెగా టోర్నీలో అఫ్ఘనిస్తాన్‌పై మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచుల్లో పరాజయం పాలయ్యారు.