Sri Lanka Cricket board: 



Srilanka News: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌ బోర్డ్‌ని (Srilanka Cricket Board Sacked) రద్దు చేస్తూ ప్రకటన చేసింది. ఇటీవలే భారత్‌-శ్రీలంక జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఘోర ఓటమి పాలైంది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. బోర్డ్‌ని రద్దు చేసే ముందే బోర్డ్ కార్యదర్శి రాజీనామా చేశారు. శ్రీలంక క్రీడాశాఖ మంత్రి రోషన్ రణసింఘే ( Roshan Ranasinghe) బోర్డుని రద్దు చేశారు. బోర్డులోని సభ్యులందరినీ తొలగించారు. ఆ స్థానంలో మధ్యంతర కమిటీని ఏర్పాటు చేశారు. దానికి అర్జున రణతుంగ (Arjuna Ranatunga) నేతృత్వం వహించనున్నారు. 1996లో శ్రీలంక ప్రపంచ కప్ గెలిచింది. ఆ సమయంలో టీమ్ కేప్టెన్‌గా ఉన్నారు రణతుంగ. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీలో రణతుంగతో పాటు ముగ్గురు జడ్జ్‌లను సభ్యులుగా నియమించారు.




క్రికెట్ బోర్డ్‌ సెక్రటరీ మోహన్ డి సిల్వా (Mohan de Silva) రాజీనామా చేసిన వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది క్రీడాశాఖ. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంపై శ్రీలంక క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. క్రికెట్ బోర్డ్ సెక్రటరీ ఇంటి ఎదుట ఆందోళనలు నిర్వహించారు. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం మధ్యంతర కమిటీని నియమించిన క్రీడాశాఖ...క్రికెట్ ఎన్నికలు (Sri Lanka Cricket Election) జరిగేంత వరకూ ఈ కమిటీని కొనసాగించనుంది. మ్యాచ్‌ ఓటమితో పాటు క్రికెట్‌ బోర్డ్‌లు అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలూ బోర్డు రద్దుకి దారి తీశాయి. వీటిపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు క్రీడామంత్రి రోషన్ రణసింఘే. ఇందుకోసమే మధ్యంతర కమిటీని నియమించినట్టు వెల్లడించారు. క్రికెట్‌ బోర్డులో అవినీతి తగ్గించడంతో పాటు కీలక ప్రతిపాదనలు చేయాలన్న ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటైంది. ఇప్పటి వరకూ round-robin league లో శ్రీలంక 7 మ్యాచ్‌లు ఆడగా...అందులో 5 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఫలితంగా సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకుంది.