అంబానీకి బెదిరింపులు..


Mukesh Ambani Threat Mails: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీకి  (Mukesh Ambani Death Threat)వరుస పెట్టి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి అంబానీని చంపేస్తామంటూ పదేపదే ఆయన సెక్యూరిటీకి మెయిల్స్ పంపాడు. తాము అడిగినంత ఇవ్వకపోతే కచ్చితంగా హత్య చేస్తామని బెదిరించాడు. ఇప్పటికే ఆరు సార్లు ఇలాంటి మెయిల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ముంబయి పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. మొత్తానికి నిందితులను అరెస్ట్ చేశారు. తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడితో పాటు, గుజరాత్‌కి చెందిన 21 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. సరదా కోసమే ఈ పని చేశారని పోలీసులు వెల్లడించారు. అయితే..ఈ ఇద్దరు నిందితుల మధ్య ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. వారం రోజుల్లో ఆరు సార్లు ఇలా బెదిరింపు మెయిల్స్ పంపారు. తెలంగాణకు చెందిన గణేశ్ రమేశ్ వనపర్తి నవంబర్ 1వ తేదీన ముకేశ్ అంబానీ సెక్యూరిటీకి మెయిల్ పంపాడు. రూ.500 కోట్లు ఇవ్వకపోతే అంబానీని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. నిందితుడిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. నవంబర్ 8న వరకూ రిమాండ్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. IP అడ్రెస్‌తో ట్రాక్ చేసి నిందితుడుని గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు.


వరంగల్‌లోని SR యూనివర్శిటీ నుంచి ఈ మెయిల్స్ పంపినట్టు తెలిపారు. IP అడ్రెస్ ఆధారంగా ట్రాక్ చేసి నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. నిందుతుడి మొబైల్‌ని చెక్ చేశారు. మెయిల్ ఐడీ నుంచి ముకేశ్ అంబానీకి పంపిన మెయిల్స్‌ని చూశారు. కానీ...ఆ మెయిల్‌ని డిలీట్ చేశాడు ఆ యువకుడు. ట్రాష్ ఫోల్డర్ నుంచి పోలీసులు ఆ మెయిల్‌ని రికవర్ చేశారు. వెంటనే ఆ  ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇక రెండో నిందితుడి పేరు రాజ్‌వీర్ కాంత్‌గా వెల్లడించారు ముంబయి పోలీసులు. గుజరాత్‌లో బీకామ్‌ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడని, టెక్నికల్ అనాలసిస్‌ ఆధారంగా పట్టుకున్నట్టు తెలిపారు. shadabkhan@mailfence.com పేరిట ఉన్న మెయిల్ నుంచి ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టు స్పష్టం చేశారు. ఎందుకు చేశారని ప్రశ్నించగా "ఏదో సరదాకి" అని సమాధానమిచ్చారట.