Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ పరిసరాల్లో గాలి నాణ్యత గణనీయంగా పడిపోతోంది. విపరీతంగా పెరుగుతున్న గాలికాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైద్యులు, ఆరోగ్య నిపుణులు గాలి కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవ శరీరం, మొత్తం ఆరోగ్యంపై వాయు కాలుష్యం ఏవిధంగా ప్రభావం చూపుతుందో వివరించారు.


AIIMS అదనపు ప్రొఫెసర్ డాక్టర్ పీయూష్ రంజన్ మాట్లాడుతూ... మానవ ఆరోగ్యంపై ప్రభావితం చేస్తుందో తెలిపారు. వాయు కాలుష్యం, వివిధ రకాల క్యాన్సర్ల కు కారణమవుతుందని, అందుకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని అన్నారు. శ్వాసకోశ వ్యవస్థకు హాని కలిగించడమే కాకుండా, వాయు కాలుష్యం గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఆర్థరైటిస్, కొరోనరీ ఆర్టరీ వ్యాధులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉందని కూడా ఆయన చెప్పారు.


ఆయన మాట్లాడుతూ.. ‘వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యాధులను కలిగించడంతో పాటు శరీరంలోని వివిధ అవయవ వ్యవస్థలను ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. గాలి కాలుష్యంతో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఆర్థరైటిస్ వంటి కొరోనరీ ఆర్టరీ వ్యాధులతో పాటు పలు రకాల క్యాన్లర్లతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు మా వద్ద ఉన్నాయి’ అని చెప్పారు.


అంతేకాదు మహిళల్లో పిండం ఎదుగుదలపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల ప్రకారం, వాయు కాలుష్యం మెదడు, గుండెను దెబ్బతీస్తుంది. ముందు జాగ్రత్తతో వ్యవహరించకపోతే అన్ని వయస్సుల వారిలో కాన్సర్‌ను కారణమయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా.. ఢిల్లీలో గాలి నాణ్యత ఆదివారం సైతం తీవ్రమైన కేటగిరీలో ఉంది. శనివారం వాయు నాణ్యత 504 ఉండగా ఆదివారం 410కు తగ్గింది. 


ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) స్వల్పంగా క్షీణించింది. SAFAR-India జారీ చేసిన డేటా ప్రకారం, లోధి రోడ్ ప్రాంతంలో గాలి నాణ్యత 385 (చాలా పేలవంగా) నమోదు కాగా, ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో 456 (తీవ్రమైనది) ఉంది. వైద్యుల ప్రకారం, ఏ ఆరోగ్యవంతమైన వ్యక్తికైనా, సిఫార్సు చేయబడిన AQI 50 కంటే తక్కువగా ఉండాలి, కానీ ఈ రోజుల్లో AQI 400 కంటే ఎక్కువ పెరిగింది, ఇది ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాణాంతకం, కొందరిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. వరుసగా ఆరో రోజు ఆదివారం సైతం పొగ మంచు దట్టంగా కమ్మేసింది. నగరంలో కాలుష్యం మరోసారి ‘అత్యంత తీవ్రం’ కేటగిరీలోకి చేరింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) శనివారం సాయంత్రం 4 గంటలకు 415 ఉండగా, ఆదివారం ఉదయం 7 గంటలకు 460గా దిగజారింది. కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.


ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లు తెరిచే ఉంటాయని పేర్కొంది. విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు కూడా వినవచ్చని ఢిల్లీ విద్యా శాఖ మంత్రి సూచించారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండడం, పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాలను దహనం చేస్తుండడంతో ఢిల్లీలో వాయు నాణ్యత పడిపోతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల రాజధానుల కంటే ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత దారుణంగా ఉన్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది.  


వాణిజ్య వాహనాలకు నో ఎంట్రీ
ఢిల్లీలో వాయు నాణ్యత నానాటికీ పడిపోతుండడం, కాలుష్యం పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిర్మాణ పనులపై నిషేధం విధిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కాలుష్యానికి కారణమయ్యే రవాణా వాహనాలు, వాణిజ్య వాహనాల ప్రవేశాన్ని నిషేధించింది.