ఈ ప్రపంచకప్‌లో వరుసగా భారీ స్కోర్లు నమోదు చేస్తున్న దక్షిణాఫ్రికా మరోసారి అదే పని చేసింది. బంగ్లాదేశ్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ మరోసారి 382 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ మరోసారి భారీ శతకంతో చెలరేగిన వేళ..హెన్రిచ్‌ క్లాసెన్‌ భారీ షాట్లతోవిరుచుకుపడిన వేళ ప్రొటీస్‌... వాంఖడే మైదానాన్ని బౌండరీలతో హోరెత్తించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలుత నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. చినుకు చినుకు గాలివానలా మారినట్లు మొదట ఓవర్‌కు ఆరు పరుగులు సాధిస్తూ ముందుకు సాగిన సఫారీ బ్యాటర్లు తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా క్వింటన్‌ డికాక్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌... బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. డికాక్ కేవలం 140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో 174 పరుగులు చేశాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ కేవలం 49 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సులతో 90 పరుగులు చేశాడు. ప్రొటీస్‌ బ్యాటర్ల విధ్వంసంతో నిర్ణీత 50 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 382 పరుగులు చేసింది. బంగ్లాకు 383 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో 19 సిక్సర్లు బాదడం విశేషం.



    టాస్ గెలిచిన దక్షిణాఫ్రికాను ఆరంభంలో బంగ్లాదేశ్‌ బౌలర్లు సమర్థంగా అడ్డుకున్నారు. ఆరు ఓవర్లకు 33 పరుగులు చేసిన సమయంలో సఫారీకి తొలి దెబ్బ తగిలింది. 19 బంతుల్లో 12 పరుగులు చేసిన హెన్డ్రిక్స్‌ను షోరిఫుల్ ఇస్లామ్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత వెంటనే ఒక పరుగు చేసిన రస్సీ వాన్‌డెర్‌ డస్సెన్‌ను హసన్‌ మిరాజ్‌ వికెట్ల ముందు దొరకబు‌చ్చుకున్నాడు. దీంతో 8 ఓవర్లకో రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. ఈ ఆనందరం బంగ్లా బౌలర్లకు ఎక్కువసేపు నిలవలేదు. క్వింటన్‌ డికాక్‌...ఐడెన్‌ మార్క్రమ్‌ చెలరేగిపోయారు. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు 131 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు. ధాటిగా ఆడి మరింత ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని బంగ్లా సారధి షకీబుల్‌ హసన్‌ విడదీశాడు. 69 బంతుల్లో 7 ఫోర్లతో 60 పరుగులు చేసిన మార్‌క్రమ్‌ను షకీబుల్‌ హసన్‌ అవుట్‌ చేశాడు. దీంతో 167 పరుగుల వద్ద సఫారీ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది.



 ఓ వైపు వికెట్లు పడుతున్నా క్వింటన్‌ డికాక్‌ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో 174 పరుగులు చేశాడు. ప్రారంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన డికాక్‌... క్రీజులో కుదురుకున్నాక విధ్వంసం సృష్టించాడు.  డికాక్‌ బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపు బంగ్లా బౌలర్లకు బంతి ఎక్కడ వేయాలో కూడా అర్థం కాలేదు. కేవలం బౌండరీల రూపంలోనే 92 పరుగులు వచ్చాయంటే డికాక్‌ విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కచ్చితంగా డబుల్‌ సెంచరీ చేసేలా కనిపించిన డికాక్‌ ఆశలను హసన్‌ మహముద్‌ వమ్ము చేశాడు. 174 పరుగుల వద్ద ఉన్న సమయంలో డికాక్‌ను హసన్‌ మహముద్‌ అవుట్‌ చేశాడు. ఆఫ్‌సైడ్‌ వేసిన లో ఫుల్‌టాస్‌ను డికాక్‌ భారీ షాట్‌ ఆడాడు. అక్కడే ఉన్న నౌసమ్‌ అహ్మద్‌ చక్కటి క్యాచ్‌ అందుకోవడంతో డికాక్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. 



 క్వింటన్‌ డికాక్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడినా హెన్రిచ్‌ క్లాసెన్‌ విధ్వంసం కొనసాగించాడు. దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్‌లోకి పంపాడు. కేవలం 49 బంతులే ఎదుర్కొన్న క్లాసెన్‌ 2 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. క్లాసెన్‌ చేసిన పరుగులు 56 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. సెంచరీ దిశగా సాగుతున్న క్లాసెన్‌ను మరోసారి హసన్‌ మహ్‌ముద్‌ అవుట్‌ చేశాడు. క్లాసెన్‌ అవుటైన తర్వాత విధ్వంసాన్ని కొనసాగించే పనిని మిల్లర్‌ తీసుకున్నాడు. 15 బంతుల్లోనే 1 ఫోరు, నాలుగు సిక్సులతో మిల్లర్‌ 34 పరుగులు చేశాడు. డికాక్‌, క్లాసెన్‌ మెరుపులతో ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మరోసారి భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 382 పరుగులు చేసింది. బంగ్లాకు 383 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లా బౌలర్లలో మహ్‌ముద్‌ రెండు, మిరాజ్‌, ఇస్లామ్‌, షకీబుల్‌ హసన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ప్రొటీస్‌ బ్యాటర్ల విధ్వంసంతో బంగ్లా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.