Samson Post Viral:
యువ క్రికెటర్ సంజూ శాంసన్ ఏం చేసినా ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. అతడిని టీమ్‌ఇండియాకి తీసుకుంటే గొప్పగా ఆడాలని అభిమానులు ట్వీట్లు చేస్తుంటారు. ఒకవేళ అతడిని పక్కన పెడితే సోషల్ మీడియా ఫైర్ అవుతుంది. మిగతా క్రికెటర్లతో అతడి గణాంకాలను పోలుస్తూ విమర్శలు వెల్లువెత్తుతాయి. ఏం జరిగినా అతడు మాత్రం భారత జట్టు యాజమాన్యం, బీసీసీఐ సెలక్టర్లపై వేలెత్తి చూపించడు. వీలైనంత వరకు హుందాగా ప్రవర్తిస్తుంటాడు.
తాజాగా సంజూ శాంసన్ చేసిన ఓ ఇన్‌స్టా పోస్టు వైరల్‌గా మారింది. అందులోని వ్యాఖ్యను చూశాక చాలామంది అతడిని అభినందిస్తున్నారు. అతడి సమయస్ఫూర్తికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత జట్టు తిరువనంతపురం వెళ్లింది. అక్కడి స్టేడియంలో నెదర్లాండ్స్‌తో మంగళవారం వార్మప్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో ఈ మ్యాచూ బంతి, టాస్ పడకుండానే రద్దు చేశారు.
ఈ సన్నాహక మ్యాచుకు ముందు టీమ్‌ఇండియా నెట్స్‌లో సాధన చేసింది. ఇదే సమయంలో అక్కడి గోడకు సంజూ శాంసన్ నిలువెత్తు చిత్రపటం కనిపించింది. దాని ముందే భారత క్రికెటర్లు సాధన చేశారు. ఈ చిత్రాన్ని సంజూ ఇన్‌స్టాలో పంచుకున్నాడు. 'దేవభూమిలో టీమ్‌ఇండియాతో (నేను)' అనే కాప్షన్ పెట్టాడు.
నిజానికి ఐసీసీ వన్డే ప్రపంచకప్ జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. రెండేళ్లుగా అతడిని అప్పుడప్పుడు వన్డేల్లో పరీక్షించారు. వరుస అవకాశాలు రాకపోవడంతో తనదైన ముద్ర వేయలేకపోయాడు. పైగా మిడిలార్డర్లో సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చారు. మరోవైపు రాహుల్ ప్రధాన వికెట్ కీపర్ పాత్ర పోషిస్తున్నాడు. దాంతో ఇషాన్ కిషన్ రెండో కీపర్‌గా ఎంపికయ్యాడు. ఎడమచేతి వాటం కావడం అతడికి ప్లస్‌పాయింట్.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ గురువారం మొదలవుతోంది. టీమ్‌ఇండియా శుక్రవారం చెన్నైలో ఆస్ట్రేలియాతో తన ప్రస్థానం ఆరంభిస్తుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు మంచి జరగాలని, కప్ గెలవాలని కోరుకుంటూ కేరళ క్రికెట్ సంఘం క్రికెటర్లతో కేక్ కట్ చేయించింది. వారికి శుభాకాంక్షలు తెలిపింది.
ప్రపంచకప్‌నకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్