ICC ODI World Cup 2023:
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభానికి మరికొన్ని గంటలే మిగిలింది. అప్పుడే సెమీస్‌కు వెళ్లే నాలుగు జట్లపై చాలా మంది ఒక అంచనాకు వచ్చేశారు. ఆ సంగతి పక్కన పెడితే ఈ మెగాటోర్నీలో అరంగేట్రం చేస్తున్న ఐదుగురు కుర్రాళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది వీరి ఆటను వీక్షించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇంతకీ వారెవరంటే?
శుభ్‌మన్ గిల్: టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ కుర్రాడికి ఎప్పుడో ఫ్యూచర్ స్టార్ అని బిరుదు ఇచ్చేశాడు. ఎందుకంటే 24ఏళ్ల ఈ కుర్రాడి ప్రతిభ అలాంటిది. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన శుభ్‌మన్ గిల్ భారత జట్టులో శాశ్వత సభ్యుడిగా మారిపోయాడు. టీ20, వన్డే, టెస్టు ఫార్మాట్లలో ఓపెనర్‌గా అదరగొడుతున్నాడు. 2018లో భారత్ అండర్ 19 ప్రపంచకప్ గెలవడంతో అతడి పాత్ర ఎంతో కీలకం. ఈ ఏడాది 890 పరుగులో ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 20 వన్డేల్లోనే 1230 పరుగులు చేశాడు. స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌లో అతడు కనీసం 2-4 సెంచరీలు చేస్తాడని మాజీ క్రికెటర్ల అభిప్రాయం.
సూర్యకుమార్ యాదవ్: టీమ్‌ఇండియాలో విలక్షణ ఆటగాడిగా ఎదిగాడు సూర్యకుమార్. టీ20ల్లో 360 డిగ్రీల్లో షాట్లు అతడు విఫలమవుతున్నా వన్డేల్లో ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. ఈ మధ్యే 50 ఓవర్ల ఫార్మాట్లో ఫామ్‌లోకి వచ్చాడు. 31 ఏళ్ల వయసులో అంతర్జాతీయ టీ20ల్లో అడుగుపెట్టిన మిస్టర్ 360పై భారీ అంచనాలే ఉన్నాయి. కీలక సమయాల్లో అతడో గంటసేపు క్రీజులో నిలిచినా పరుగుల వరద పారుతుందని అభిమానులు ఆశ. చాలినన్ని వనరులు ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు సంక్లిష్ట సమయాల్లో ఆదుకుంటాడని అతడిని వన్డే ప్రపంచకప్‌నకు ఎంపిక చేశారు.
కామెరాన్ గ్రీన్: ఈ ఆస్ట్రేలియా కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. 2020 నుంచి ఆసీస్‌కు కీలకంగా మారాడు. మూడు ఫార్మాట్లలోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయడం అతడిపై అంచనాలు పెంచింది. దిగ్గజ పేసర్లు ఉన్నప్పటికీ బౌలింగ్‌లో వైవిధ్యం కోసం అతడిని కంగారూ టీమ్ వాడుకుంటోంది. పైగా భారత్ పిచ్‌లపై మంచి అనుభవం ఉంది. మిడిలార్డర్లో అతడు అత్యంత కీలకం అవుతాడు.
హ్యారీ బ్రూక్: ఇంగ్లాండ్ చిచ్చరపిడుగు హ్యారీ బ్రూక్ కొంత కాలంగా బాగా ఆడటం లేదు. కానీ అతడి దూకుడుపై ఆంగ్లేయ జట్టు నమ్మకం ఉంచింది. ఒకప్పుడు స్పిన్ బౌలింగ్‌కు తడబడేవాడు. ఆఫ్‌సైడ్ దేహానికి దూరంగా బంతులేస్తే ఔటయ్యేవాడు. కానీ క్రీజులో నిలిస్తే నిమిషాల్లోనే మ్యాచ్ గమనం మార్చేసే శక్తి అతడి సొంతం. పైగా జేసన్ రాయ్ ఫిట్‌నెస్ ఇబ్బందుల్లో ఉన్నాడు. అందుకే అతడిని ఇంగ్లాండ్ జట్టులోకి తీసుకుంది.
బాస్ డి లీడ్: నెదర్లాండ్స్‌కు చెందిన ఈ యువ క్రికెటర్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. అతడి తండ్రి టిమ్ డీ లీడ్ మూడు ప్రపంచకప్‌లు ఆడాడు. ఇప్పుడు కొడుకు వంతు వచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ అర్హత పోటీల్లో నెదర్లాండ్స్‌కు అతడే విజయాలు అందించాడు. ఏకంగా 15 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకపై 3/42తో ప్రత్యేకత చాటుకున్నాడు. టీమ్‌ఇండియాతో వార్మప్ మ్యాచ్ రద్దవ్వడంతో అతడి ఆట చూడలేకపోయాం.